-
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
తోడేళ్ళను తరిమే రోజు!
ఒక్కసారి మనం డెబ్బయ్యేళ్లు వెనక్కు వెళ్లాలి. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనల్ని ఆ జ్ఞాపకం వైపు బలవంతంగా నెడుతున్నాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. తెలంగాణతో కలిసి ఇంకా ఆంధ్ర ప్రదేశ్‌గా అవతరించకముందు 1955లో శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాటి ఆంధ్ర రాష్ట్రం, నేటి ఆంధ్ర ప్రదేశ్ల భౌగోళిక స్వరూపం ఒక్కటే!ఆ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభంజనం కనిపించింది. అప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా కమ్యూనిస్టులు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఉదంతాలు లేవు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్రం రికార్డు సృష్టించ బోతున్నదనే అంచనాలు వెలువడ్డాయి. ముఖ్యమంత్రిగా సుందరయ్య, హోంమంత్రిగా చండ్ర రాజేశ్వరరావు, ఆర్థిక మంత్రిగా మాకినేని బసవపున్నయ్య వగైరా పేర్లతో కేబినెట్ కూర్పుపై కూడా ప్రచారం జరిగింది. సరిగ్గా ఈ దశలోనే పెత్తందారీ ముఠా, వారి అజమాయిషీలోని మీడియా రంగప్రవేశం చేశాయి.అప్పట్లో దున్నేవానికే భూమి అనేది కమ్యూనిస్టుల నినాదం. ఆ మేరకు భూసంస్కరణలు అమలు చేస్తామని వారు వాగ్దానం చేశారు. ఇది చాలు పెత్తందార్లకు! వారి చేతుల్లో వున్న ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ వంటి ఆనాటి ప్రముఖ పత్రికలు ఆయుధాలు బయటకు తీశాయి. కమ్యూనిస్టులు గెలిస్తే రైతుల భూములను లాక్కుంటారు. కమ్యూనిస్టులు గెలిస్తే ప్రజల ఇళ్లలో ఉన్న డబ్బును, బంగారాన్ని ఎత్తుకుపోతారు. వృద్ధులు పని చేయలేరు కనుక వారిని ప్రత్యేక క్యాంపుల్లో పెడతారు లేదా చంపేస్తారు. రష్యాలో, చైనాలో ఇలాగే చేస్తున్నారు. చివరికి మీ భార్యల్ని కూడా జాతీయం చేస్తారు. కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్న మవుతుంది... ఈ రకమైన అభాండాలను అచ్చేసి అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు.ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేంత పబ్లిసిటీ దన్ను ఆనాడు కమ్యూనిస్టులకు లేదు. వాళ్లకున్నది ‘విశాలాంధ్ర’ ఒక్కటే. పార్టీ ముద్ర కారణంగా దానికీ పరిమితులున్నాయి. ఇటువంటి నిస్సహాయ స్థితిలోనే మహాకవి శ్రీశ్రీ గుండెలోంచి తన్నుకొచ్చిన ఆక్రోశం చాలామందికి గుర్తున్నది. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక ఆంధ్రపత్రిక’ అని ఈసడించుకున్నారు. నాటి ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ల అరాచకాన్ని ఒక లక్షతో హెచ్చ వేస్తే నేటి ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’, ‘టీవీ5’, ‘ఏబీఎన్’, ‘ఈటీవీ’ల అరాచకం విలువెంతో తెలుస్తుంది. ఆ ప్రత్యేక సందర్భం తర్వాత∙నాటి పత్రికలు మళ్లీ తటస్థ స్థితికి చేరు కున్నాయి. కానీ మన యెల్లో మీడియా మాత్రం గత పదేళ్లుగా ఆదే యజ్ఞంలో తలమునకలై ఉన్నది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా, ప్రయోక్తగా, ప్రవక్తగా గడిచిన మూడు దశాబ్దాల్లో చంద్రబాబు ఇంతింతై అన్నట్టుగా ఇనుమడించడం మనకు తెలిసిన సంగతే. ఇదే కాలంలో మన యెల్లో మీడియా చంద్రబాబు తరఫున గ్రామ సింహాల పాత్రను పోషిస్తే, బదులుగా ఆయన వారికి సెక్యూరిటీ గార్డు పాత్రను పోషిస్తూ వస్తున్నారు. ఈ ముప్ప య్యేళ్లలో పధ్నాలుగేళ్లపాటు బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ఆయనకు వాలతుల్యుడనదగ్గ కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నాలుగేళ్లు గద్దె మీద కూర్చున్నారు. రాష్ట్రంలోని పేదల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం అమలైన కార్య క్రమాలన్నీ వీరి కాలం మినహా మిగిలిన సమయంలోనే జరగడం ఎవరైనా గమనించవచ్చు.ప్రజలందరికీ విద్య, వైద్యసేవలు అందజేయడం ప్రభుత్వ బాధ్యతగా నాగరిక సమాజం గుర్తిస్తున్నది. ఆ రంగాల్లో సేవలు ప్రభుత్వం బాధ్యత కాదని బాహాటంగా ప్రకటించి, వాటిని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు నర్తనశాలగా మార్చిన అనాగరిక రాజకీయవేత్త చంద్రబాబు. ఫలితంగా ప్రభుత్వ బడులు కునారిల్లిపోయాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లల్ని ప్రైవేట్ బడులకు పంపి అప్పులపాలయ్యారు. నిరు పేదల బిడ్డలు చదువుకు దూరమయ్యారు. ఒక తరం పేద, మధ్యతరగతి వర్గాల కలలను కాటేసిన చరిత్ర చంద్రబాబుది. అలాగే ప్రైవేట్ వైద్యసేవల బలిపీఠాన్నెక్కి లక్షలాది కుటుంబాలు కృశించి, నశించిపోయాయి.వ్యవసాయం దండగనేది ఆయన చేసిన ఒక క్రూర పరిహాసం. ఫలితంగా రైతులు పిట్టల్లా రాలిపోవడం బాబు జమానాలోనే ప్రారంభమైంది. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, నకిలీ మందులకు వ్యవసాయం వేదికైంది. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి వేల ఎకరాల భూములను కార్పొరేట్ శక్తులకు కైంకర్యం చేసే విధానాలను బాబు అవలంబించారు. ఈ క్రమంలోనే ఫిలిం సిటీ పేరుతో రామోజీ దాదాపు మూడువేల ఎకరాలు పోగేశారు. అన్నిరకాల భూచట్టాలూ రామోజీ భూదాహం ముందు చట్టుబండలయ్యాయి. వేలాది ఎకరాల్లో వ్యవసా యాన్ని అటకెక్కించి కార్పొరేట్ సంస్థలు కంచెలు వేసు కున్నాయి. పేదల జీవితాలను కాల్చుకుతింటున్న చంద్ర బాబులో పచ్చమీడియాకు ఓ విజనరీ కనిపించాడు.ఐదేళ్ల కింద ఆంధ్రప్రదేశ్‌లో ఒక తేడా వచ్చింది. చంద్రబాబుకూ, యెల్లో మీడియాకూ అది చిన్న తేడా ఏమీ కాదు. యెల్లో ‘విజనరీ’ విధానాలను కొత్త ముఖ్య మంత్రి జగన్మోహన్రెడ్డి తలకిందులు చేశారు. ప్రజలిచ్చిన అధికారం గుప్పెడుమంది పెత్తందార్ల కోసం కాదు, పురోగ మనం కోసం పోరాడుతున్న విశాల ప్రజానీకం కోసం అనేది ఆయన విధానం. జగన్మోహన్రెడ్డి విధానాలకు, మన పెత్తందారీ ఏజెంట్ల విధానాలకు ఘర్షణ ఏర్పడింది. పెత్తందార్ల కూటమి జగన్ ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్ ప్రభుత్వ విధానాల వల్ల ఊపిరి పీల్చుకున్న పేదవర్గాల ప్రజలు ఆయన వెనుక సైన్యంగా మోహరించారు. పేదలు – పెత్తందార్ల మధ్య మహాయుద్ధానికి ముహూర్తం ఖాయమైంది.ఈ అయిదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వంపై యెల్లో మీడియా సాగించిన దుష్ప్రచారం అన్ని రికార్డులనూ బద్దలు కొట్టింది. గోబెల్స్ బతికి వుంటే సిగ్గుపడి ఉండేవాడు. శ్రీశ్రీ బతికి ఉంటే ఏమని కామెంట్ చేసేవాడో ఊహించుకోవలసిందే. తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా ప్రచారం చేయని రోజు ఈ అయిదే ళ్లలో ఒక్కటీ లేదు. అయినా ప్రజాభిప్రాయాన్ని యెల్లో మీడియా పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నది. దీంతో వారిలో నిస్పృహ ఆవరించింది. అన్ని విలువల్నీ వదిలేశారు. వస్త్రవిసర్జన చేసి దిగంబర వీధినర్తనం మొదలుపెట్టారు. పోలింగ్ పది రోజులుందనగా తయారుచేసిన రెండు వింత కథల మీద ప్రాణం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో మొదటిది ఏమాత్రం క్రియేటివిటీ లేకుండా అల్లిన ఓ కట్టుకథ. ‘మీ భూమి మీది కాదు’ అనే పేరుతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ‘బాధితుల’ కథనాలను ‘ఈనాడు’ అచ్చేసింది. చట్టం పేరులోనే దాని ప్రాముఖ్యత ఉన్నది. భూమిపై రైతుకున్న యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం హామీ పడి ధ్రువీకరించే చట్టం. ఒకసారి ఈ చట్టం అమలులోకి వస్తే భూ వివాదాలు శాశ్వతంగా పరిష్కారమవుతాయి. దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చార్మినార్‌కు కూడా సేల్ డీడ్ ఇచ్చే అధ్వాన్నమైన పరిస్థితులు ఎన్నిసార్లు ఎదురు కావడం లేదు? నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకులను కొల్లగొట్టే దళారీల వృత్తాంతాలు ఎన్ని బయటకు రావడంలేదు? ఎన్ని వేల భూతగాదాలు కోర్టు వ్యాజ్యాల్లో దశాబ్దాల తరబడి నలిగి పోవడం లేదు? గొడవలతో ఎంత రక్తం పారి ఉంటుంది? ఎన్ని హత్యలు జరిగి ఉంటాయి? ఇదిగో ఇటువంటి వివాదాలను పరిష్కరించే సమగ్ర హక్కులను యజమానికి కల్పించి, అందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. ఇందులో భాగంగా మొదట భూముల సమగ్ర సర్వే జరుగుతోంది. గ్రామ ప్రజల సమక్షంలో సరిహద్దులను నిర్ధారించి రైతుకు పాస్‌బుక్ ఇవ్వడం జరుగుతుంది. వందేళ్ల తర్వాత సర్వే జరిపి యాజమాన్య హక్కును గుర్తిస్తూ ప్రభుత్వం ఇస్తున్న పాస్‌బుక్ ఇది. ఆ హక్కుకు ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీకి గుర్తుగా సర్వే జరిగిన కాలపు ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఫోటోను కూడా పాస్‌బుక్‌పై ముద్రిస్తున్నారు. దీన్ని కూడా టీడీపీ – యెల్లో మీడియా వివాదం చేయడం చూస్తున్నాము.అన్ని గ్రామాల్లో సర్వే పూర్తిగా జరిగిన తర్వాత చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసి, వాటిపై గ్రామసభల్లో చర్చలు జరిగిన తర్వాత తుది మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఆ తర్వాతనే చట్టం అమల్లోకి వస్తుంది.ఇదంతా జరగడానికి ఇంకో ఏడాది పట్టవచ్చు. రెండేళ్లు పట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని ‘నీతి ఆయోగ్’ సూచనలకు అనుగుణంగా ఈ చట్టం రూపకల్పన జరుగుతున్నది. అన్ని రాష్ట్రాల్లోనూ భూయజమానికి మేలు చేసే ఈ చట్టం వచ్చి తీరుతుంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ముందుకు కదిలించింది. దీన్ని వ్యతిరేకిస్తున్న యెల్లో కూటమి పార్టీ ఎన్డీఏలో భాగంగా ఉన్నది. కానీ ఇంత వరకు ఈ చట్టంపై తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వంతో ప్రస్తావించకపోవడం తెలుగుదేశం అవకాశవాద వైఖరికి పరాకాష్ఠ. పచ్చమీడియా కూడా ఈ చట్టంపై ఒక్క మాటయినా కేంద్రం ప్రస్తావన చేయకపోవడం వెనకనున్న రహస్యమేమిటి?ఇక శనివారం నాడు ‘ఈనాడు’ రాసిన ‘మీ భూమి మీది కాదు’ అనే కల్పిత కథ జర్నలిజం ప్రమాణాలను పాతాళంలోకి తొక్కేసింది. ఇందులో ముగ్గురు బాధితుల పేర్లు రాశారు.అందులో అమలాపురం సుబ్బారావు ఒకరు. ఆయన భూమి ఎక్కడో చెప్పలేదు. సర్వే నెంబర్ తెలియదు. ఆయన భూమి తనదంటూ ఎవరో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారట! ఆయనెవరో చెప్పలేదు. ఎవరికి దరఖాస్తు చేశాడో చెప్పలేదు. రెండేళ్ల తర్వాత సుబ్బారావు స్పందించలేదంటూ దరఖాస్తు చేసుకున్న వారి పేరు మీద భూమిని రాసేశారట! ఇదంతా ల్యాండ్ టైట్లింగ్ చట్టం మహత్యమట. అమల్లోకే రాని చట్టం రెండేళ్ల కిందనే పనిచేయడం ప్రారంభించిందని ‘ఈనాడు’ ఉవాచ!ఇక సాంబశివుడిది శ్రీకాకుళం జిల్లాలోని ఒక పల్లెనట! ఈ పల్లె పేరు చెబితే రామోజీ తల వెయ్యి ముక్కలవుతుంది కాబోలు. చెప్పలేదు! ఆయన భూమిని అమ్మడానికి వెళితే, ‘కొత్త రిజిస్టర్లో నీ పేరు లేద’ని అధికారులు చెప్పారట. అసలటు వంటి కొత్త రిజిస్టరు తమ దగ్గర ఏదీ లేదని అధికారులు ప్రకటించారు. గోవిందరెడ్డిది కర్నూలు జిల్లా. ఏ ఊరో చెప్పలేదు. ‘ఈనాడు’ ఆంధ్రా ఎడిషన్‌లోనే ఆయన గోవిందరెడ్డి. తెలంగాణ ఎడిషన్‌లో మాత్రం గోవిందయ్య. అంటే తెలంగాణకు వెళ్లిన ప్పుడల్లా ఆయన కులం తోకను కత్తిరించుకుంటాడు కాబోలు. ఆయన తన భూమిని తనఖా పెట్టాలనుకున్నాడట! బ్యాంకులో ఉండే డిస్ప్యూట్ రిజిస్టర్లో ఆయన పేరు ఉన్నదట! టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర క్లియరెన్స్ సర్టిఫికెట్ తెమ్మని బ్యాంకు వారు చెప్పారట. దాంతో గోవిందరెడ్డి ఉరఫ్ గోవిందయ్య ఆంధ్రాలో ఒకసారి, తెలంగాణలో ఒకసారి గొల్లుమన్నాడట! అసలు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే పోస్ట్ అమల్లోకే రాలేదు. డిస్ప్యూట్ రిజిస్టరూ లేదు. చదివేవాడు వెర్రి వాడయితే... రాసేవాడు రామోజీ!పెన్షన్ల వ్యవహారంపై తెలుగుదేశం – యెల్లో మీడియాలు నడిపిస్తున్న వ్యవహారంలో మరో వింతకథ. వలంటీర్ వ్యవస్థకే ఈ పెత్తందార్లు వ్యతిరేకం. తమ వ్యతిరేకతను వాళ్లు దాచుకోనూ లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇంటి దగ్గరే ఒకటో తారీఖు పొద్దున్నే వలంటీర్లు గత ఐదేళ్లుగా పింఛన్లు అంద జేస్తున్నారు. దాంతో అవ్వాతాతలు, దివ్యాంగులు భరోసాతో బతుకుతున్నారు. వలంటీర్లు విధుల్లో పాల్గొనకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ తరఫున వారి ఏజెంటు నిమ్మగడ్డ రమేశ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి యెల్లో మీడియా వంత పాడింది. దాంతో వలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.ఈసీ సూచనల మేరకు ఏప్రిల్‌లో విలేజ్ సెక్రటేరియట్లలో పెన్షన్లు అందజేశారు. దీనిపై వృద్ధుల్లో వ్యతిరేకత వచ్చింది. గాభరాపడ్డ తెలుగుదేశం బృందం మళ్లీ నిమ్మగడ్డను పంపించి బ్యాంకు ఖాతాల్లో జమ చేయించాలని ఈసీకి దరఖాస్తు పెట్టారు. ఈసీ సూచనలకు అనుగుణంగా మే నెలలో బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. ఇక వృద్ధుల బాధలు వర్ణనాతీతం. వారి శాపనార్థాలతో కంగారు పడిన యెల్లో ముఠా వృద్ధుల బాధలకు జగన్ ప్రభుత్వమే కారణమనే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. దొంగతనం చేసినవాడే ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! జగన్మోహన్రెడ్డి సభలకు మండుటెండల్లో కూడా వెల్లువెత్తుతున్న జనప్రవాహంతో కూటమి వణికిపోతున్నది. ఈ రెండు అంశాలపై అబద్ధాలను ప్రచారం చేసి గట్టెక్కాలన్న దింపుడు కల్లం ఆశ దానిలో కనిపిస్తున్నది.ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగబోతున్నది. ఇది పేద వర్గాలకు అందివచ్చిన అద్భుతమైన అవకాశం. పేద బిడ్డల ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్న, వారి నాణ్యమైన చదువు లను వ్యతిరేకిస్తున్న పెత్తందార్లను చావచితక్కొట్టడానికి ఇదో అవకాశం. పేదల సాధికారతను, మహిళల సాధికారతను సహించలేకపోతున్న పెత్తందార్లను పరుగెత్తించడానికి ఇంకో వారం రోజుల్లో అమూల్యమైన అవకాశం ఉన్నది. బలహీన వర్గాలకు ఉన్నత పదవులు ఇస్తే, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్లు కేటాయిస్తే ఓర్వలేకపోతున్న పెత్తందార్లకు బుద్ధి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం. అబద్ధాలనూ, అభూత కల్పనలనూ, కట్టుకథలనూ ప్రచారంలో పెడుతూ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే గాక సమాజంలో అశాంతిని రేకెత్తి స్తున్న పెత్తందారీ తోడేళ్లను తరిమి తరిమి కొట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది?వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రగులుతున్న క్యాంపస్‌లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...
రానున్న టీ20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ ప్యానెల్ చేసిన ఎంపికలో కొందరు స్టార్ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్ మన్ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబయ్ ఇండియన్స్ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీలకు సెలక్షన్ ప్యానెల్ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్ – బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ ఆప్షన్ జట్టుకు దక్కింది. ఈసారి ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్ కప్ పిలుపొచ్చింది. మిడిల్ ఆర్డర్లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్ వికెట్ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్ కుర్రాడు శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో మిడిల్ ఆర్డర్లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్ కప్ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. ఈ ఏడాది ఐపీఎల్లో బాగా ఆడుతున్న స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్ ఛాన్స్ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్ 15 మందిని మార్చడానికి అగర్కర్ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్ టీ20 టైటిల్స్ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్లో కొత్త మలుపు. టీ20లకు భారత్ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్ ఆరంభంతో కథే మారిపోయింది. ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్ విధ్వంసాలు, స్కోర్ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్ లేని సేఫ్ గేమ్‌తోనే పొట్టి క్రికెట్లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! -
సత్యానికి సవాల్!
కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్‌ఫేక్‌ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్‌లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్ కీ బార్ 400 పార్) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్ సహా వివిధ మాధ్యమాల్లో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది. గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్ వాట్సప్‌లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్ షార్ట్ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్ మీడియా సంస్థలు సైతం ఫేక్ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ డీప్‌ఫేక్‌ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. ఓ డీప్‌ఫేక్ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement