-
ఇవాళ హనుమాన్ జయంతినా? హనుమాన్ విజయోత్సవమా?
హనుమాన్ జయంతి ఎప్పుడనేది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కువగా వైశాఖ మాసంలో దశమి రోజు జరుపుకుంటే, ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇంతకీ ఏది కరెక్ట్?. అదీగాక చాలామంది ఈ రోజును హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని బట్టి చూస్తే హనుమాన్ జయంతి చైత్రమాసంలోనా? వైశాఖంలోనా ? అంటే..! పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుంచి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమినే ఎందుకు.. హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి:" అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రింది శ్లోకంలో వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విజయోత్సవంగా చెప్పడానికి రీజన్.. చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
ఒంటిమిట్టకు పూర్వ వైభవం!
ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయం 'శ్రీరామనవమి' వేడుకలకు ఇప్పుడు ప్రధాన వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వలాంఛనాలతో ఈ దేవాలయం నేడు కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి శోభ, ప్రాశస్త్యం పెరుగుతూ వస్తున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది శుభ పరిణామం. 'భద్రాచలం' తెలంగాణ ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ఆరంభమైంది. ఈ తీర్థం గురించి ఇంకా తెలియల్సినవారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో గొప్ప పౌరాణిక,చారిత్రక నేపథ్యం ఉన్నా ఈ దేవాలయం చరిత్రగతిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు, దోపిళ్ళు, దొంగతనాలు,దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో ఒక మహనీయుడు చేసిన అవిరళమైన కృషి, అనన్య సామాన్యమైన సేవలు నిత్యరమణీయ స్మరణీయాలు. ఆ మహనీయుడి పేరు వావిలకొలను సుబ్బారావు. వాసుదాసుగా, ఆంధ్రవాల్మీకిగా చరిత్ర ప్రసిద్ధుడు. భద్రాచలం శ్రీరామునికి రామదాసు ఎలాగో! ఒంటిమిట్ట కోదండరామునికి వాసుదాసు అలాగ! 'వాసుదాసు -ఒంటిమిట్ట'ను వేరుచేసి చూడలేం. ఈరోజు ఇంతటి ఉత్సవాలను జరుపుకుంటున్నామంటే? అంతా వావిలకొలనువారి చలవే అన్నది నిర్వివాదాంశం. ఒంటిమిట్టకు 'ఏకశిలా నగరం' అనే పేరు కూడా ఉంది. భాగవతకర్త పోతన్న మహాకవి ఇక్కడి వాడేనని వావిలకొలను సుబ్బారావు ఘంటాపథంగా చెబుతూ ఎందరితోనో వాదనలకు దిగారు. నాటి పండితులలో కొందరు ఒప్పుకున్నారు, కొందరు ఆ వాదంతో అంగీకరించలేదు. పోతనామాత్యుడు తన భాగవతాన్ని ఈ కోదండరామునికే అంకితం చేశారని ఆయన చెబుతారు. కవి పోతన కొంతకాలం ఒంటిమిట్టలో నివసించారని అంటారు. భాగవత రచనలో కడప మాండలిక పదాలు కూడా ఉండడం, మరోబలమైన సాక్ష్యమని వాసుదాసు వంటి కొందరు పండితులు విశ్వసించారు. పోతనామాత్యుని విగ్రహాన్ని కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు. "పోతన్నది ఒంటిమిట్ట" అన్నది చారిత్రక వివాదం. ఆ వివాదం గురించి పక్కన పెడదాం. ఈ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. సీత,రామ,లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా మలచడం ఇక్కడి విశిష్టత. కాబట్టి ఈ క్షేత్రం 'ఏకశిలా నగరం'గా ఖ్యాతికెక్కింది. సీతారామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు కలవకముందు కాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ప్రసిద్ధంగా ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు. మృకండుడు,శృంగి మహర్షులు సీతారామలక్ష్మణ విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని ప్రసిద్ధి. విగ్రహాలకు జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఐతిహ్యం. ఇలాంటి విశేషాలెన్నో స్థలపురాణంలో ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు.ఈ దేవాలయం నిర్మాణం మాటున ఎన్నో చారిత్రక విశేషాలు దాగివున్నాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని వివిధ దశల్లో నిర్మించారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దంలో, ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ ఈ దేవాలయన్ని దర్శించాడు. భారతదేశంలోని పెద్దగోపురాల్లో ఈ దేవాలయం ఒకటని రాసుకున్నాడు. ఒకప్పుడు ఈ క్షేత్రం ఎందరో మహాకవులకు, కళాకారులకు నిలయంగా ఉండేది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతీయుడే. ఈయన మనవడే 'అష్ట దిగ్గజ కవులు'లో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడు. తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి,వరకవి మొదలైన పేరెన్నికగన్న కవులెందరో కోదండరామునికి కవితా రూపంగా అక్షరార్చన చేశారు. ఆధునిక కాలంలో దేవాలయ పునరుద్దీపనలో ప్రధాన భూమికను పోషించిన వావిలకొలను సుబ్బారావు కవిగా కూడా పరమాద్భుతమైన పాత్రను పోషించాడు. 24వేల శ్లోకాల సంగమమైన వాల్మీకి విరచిత సంస్కృత రామాయణాన్ని 108సార్లు పఠించి,మధించి, ఉపాసించి 'మందరం' పేరుతో తెలుగులోకి పద్యాల రూపంలో అనువాదం చేశాడు. ఒంటిమిట్ట శ్రీకోదండరామునికి అంకితం చేశాడు. ఆయన చేసిన ఈ అపూర్వ కృషికి మెచ్చిన నాటి మహాకవి,పండితులు 'ఆంధ్రవాల్మీకి' బిరుదుతో ఆయనను ఘనంగా సత్కరించారు. బళ్లారి రాఘవ అధ్యక్షతలో ఈ వేడుక జరిగింది. ఒంటిమిట్ట దేవాలయానికి ఎందరో రాజులు,జమీందారులు, సంపన్నులు ఇచ్చిన వందలాది ఎకరాల భూములు,సంపదలు దోపిడీకి,దురాక్రమణకు ఆవిరైపోయాయి. నైవేద్యం పెట్టే నాథుడు కూడా లేని జీర్ణదశకు ఆ దేవాలయం చేరిపోయింది. అటువంటి సమయంలో, వావిలకొలను సుబ్బారావు దేవాలయ పునరుద్ధరణ బాధ్యతను తలకెక్కించుకున్నారు. టెంకాయ చిప్పను చేతిలో పట్టుకొని,దేశమంతా తిరిగి, ఊరూరా బిచ్చమెత్తి, ధనాన్ని పోగుచేసి, ఆలయాన్ని పునరుద్ధరించాడు. "నీ జన్మ ధన్యము కదే ! టెంకాయ చిప్పా " అంటూ శతకం కూడా రాశాడు. టెంకాయ చిప్ప సంగతి ఎలా ఉన్నా... వాసుదాసు ధన్యుడయ్యాడు, భక్తాగ్రగణ్యుడయ్యాడు. తెలుగువారికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు 'ఒంటిమిట్ట' కోదండరామలయాన్ని నిలబెట్టి, పుణ్యచరితుడయ్యాడు. ప్రస్తుతం ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. శ్రీరామనవమి వేడుకలతో పాటు, బ్రహ్మోత్సవాలు, విశేష పూజలు,సంబరాలు నేడు జరుగుతున్నాయి. దేవాలయాలను పరిరక్షించుకోవడం, ఆ అనంతమైన సంపద పరులపరం కాకుండా చూసుకోవడం, ఆధ్యాత్మిక, చారిత్రక,సాంస్కృతిక వైశిష్ట్యాన్ని నిలబెట్టడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. మనందరి కర్తవ్యం కూడా. ఒంటిమిట్ట కోదండరామాలయం అపూర్వ వైభవంతో అనంతకాలం అలరారుతుందని ఆకాంక్షిద్దాం. వాసుదాసు భక్తప్రభాసుగా తరతరాలకు వాసికెక్కుతాడని ఆశిద్దాం. మాశర్మ, సీనియర్ జర్నలిస్టు (చదవండి: థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!) -
Quiz On Lord Rama: శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
నేడు శ్రీరామ నవమి.. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడి గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసు?... శ్రీరాముడి గురించి మీకు ఈ విషయాలు తెలుసా.. ఈ కింద లింక్ క్లిక్ చేసి క్విజ్‌లో పాల్గొనండి.. -
థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!
థాయిలాండ్‌లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే. మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.. పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్‌లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్. థాయిలాండ్‌లోని మరో అయోధ్య.. థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి. "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు. థాయిలాండ్‌లో నేటికి రామరాజ్యం .. థాయిలాండ్‌లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది. థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం. థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి.. మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్‌కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్ మీటర్. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి. (చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?) -
రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?
శ్రీరామ నవమి అనంగానే తాటాకు పందిళ్లు రాములోరి కళ్యాణ ఘట్టం. కొన్ని గ్రామాల్లో అయితే తిరునాళ్లు కూడా చేసుకుంటారు. ఈ రోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిగిన వెంటనే పానకం, వడపప్పు పంచి పెడతారు. ఈ ప్రసాదాన్ని ఎవ్వరు మిస్ చేసుకోరు. ఆ టైం కల్లా వచ్చి ప్రసాదం అందుకుంటారు. వీధివీధుల్లో ఈ తంతు, కోలాహాలం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం, వడపప్పు ప్రత్యేకమైనవి. ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు? వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు? అంటే.. అందుకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ దృక్కోణాలు రెండూ ఉన్నాయని పలువురు పండితులు చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా, పానకం అన్నా ఇష్టమని, శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు . అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఇక ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా స్వీకరించి ఆయనకు పానకంతో నివేదన చేస్తారు. ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఆరోగ్య ప్రయోజనాలు.. ఇక శాస్త్రీయ కోణంలో చూసినట్లయితే ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది. కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది. కాబట్టి బెల్లం పానకాన్ని స్వామి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచి పెడతారు. అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతేగాదు రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియనూ వృద్ధి చేస్తుంది. ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిబరే రామరసం! రామనామం పాలుమీగడలు, పంచదారతేనెల కంటే కూడా కడు తీయని రసం! నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామమంత మధురంగా ఉంటుంది. ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే! ఈ రెండు నైవేద్యాలకూ అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. (చదవండి: నవమి రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు ఎందుకు..?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్‌నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement