పోరాడి ఓడిన హారిక... కాంస్య పతకం సొంతం | Sakshi
Sakshi News home page

పోరాడి ఓడిన హారిక... కాంస్య పతకం సొంతం

Published Sun, Feb 26 2017 5:11 AM

పోరాడి ఓడిన హారిక... కాంస్య పతకం సొంతం - Sakshi

టెహరాన్‌ (ఇరాన్‌): చివరి క్షణం వరకు తన శక్తి వంచన లేకుండా పోరాడినప్పటికీ.... సమయాభావం రూపంలో దురదృష్టం వెంటాడటంతో ప్రపంచ మహిళల నాకౌట్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కాంస్య పతకంతో సంతృప్తి పడింది. తాన్‌ జోంగి (చైనా)తో శనివారం జరిగిన సెమీఫైనల్‌ టైబ్రేక్‌లో హారిక 3–4 తేడాతో ఓడిపోయింది. ‘ర్యాపిడ్‌’ పద్ధతిలో జరిగిన తొలి రెండు గేముల్లో చెరొకటి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. ‘ర్యాపిడ్‌’ పద్ధతిలోనే మళ్లీ రెండు గేమ్‌లు నిర్వహించగా... ఈసారీ చెరొకటి గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత ‘బ్లిట్జ్‌’ పద్ధతిలో నిర్వహించిన రెండు గేమ్‌లూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ‘అర్మగెడాన్‌’ పద్ధతిలో ఆఖరి గేమ్‌ను నిర్వహించారు.

 తెల్ల పావులు పొందిన హారికకు 5 నిమిషాలు... నల్లపావులు పొందిన తాన్‌ జోంగికి 4 నిమిషాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడేవారు ఐదు నిమిషాల్లో ఫలితం సాధించాలి. లేదంటే నల్లపావులతో ఆడినlవారిని విజేతగా ప్రకటిస్తారు. 99 ఎత్తుల తర్వాత హారిక వద్ద సమయం అయిపోవడం, ఫలితం తేలక పోవడంతో తాన్‌ జోంగి విజేతగా నిలిచింది. దాంతో ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో హారికకు వరుసగా మూడోసారీ (2012, 2015, 2017) కాంస్యమే దక్కింది.

Advertisement
 
Advertisement
 
Advertisement