కుట్ర కోణం.. | Sakshi
Sakshi News home page

కుట్ర కోణం..

Published Sun, May 5 2024 7:10 AM

కుట్ర

ఓటమి భయం.. గూండాయిజంతో నెట్టుకురావాలన్న ప్రయత్నం.. ప్రత్యర్థిని హతమార్చయినా పదవి సాధించాలన్న మాయోపాయం.. వెరసి దేవరాపల్లి మండలంలో శనివారం సృష్టించిన ఘర్షణపూరిత వాతావరణం.. ఇది సీఎం రమేష్‌ రౌడీ రాజకీయానికి పరాకాష్ట. ప్రజాస్వామ్యానికే అప్రతిష్ట. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడును హత్య చేసేందుకు పన్నాగం పన్నారన్నది ఆయన అభిమానుల భయాందోళన.. అందుకు ఊతమిచ్చేవిధంగా నిందితులను సీఎం రమేష్‌ వెనుకేసుకు రావడం, ముత్యాలనాయుడు ఇంటి వైపు దూసుకురావడం కుట్ర కోణాన్ని బలపరుస్తున్నాయి.
రౌడీ రాజకీయం

హత్యా రాజకీయాలకు తెర లేపుతున్న సీఎం రమేష్‌

ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర

అనుమతి లేకుండా బూడి నివాసంపై డ్రోన్‌తో రెక్కీ

బీజేపీ ఎంపీ అభ్యర్థి రమేష్‌ అనుచరులుగా గుర్తింపు

ఇంకా ఎలాంటి విధ్వంసాలు చూడాలో అని జిల్లా ప్రజల భయాందోళనలు

సాక్షి, అనకాపల్లి: అది ఆకతాయిల పని కాదు. అనుకోకుండా జరిగినది అంతకంటే కాదు. డ్రోన్‌తో ఏమైనా చిత్రీకరించాలంటే.. అదీ ఎన్నికల వాతావరణంలో.. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇంటిపై.. అనుమతి తీసుకోకుండా ఆ పని చేయకూడదని తెలియనివారు కాదు. అయినా సరే చేశారంటే.. తమపైనే దాడి జరిగిందని పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారంటే వారి ఘర్షణపూరిత వైఖరి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సీఎం రమేష్‌ వారికి మద్దతుగా రాత్రి వరకు హైడ్రామా సృష్టించడంతో కుట్ర కోణం స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూల పవనాలకు తోడు.. మాడుగలను అభివృద్ధి పథంలో నడిపించి ఒక మోడల్‌ నియోజకవర్గంగా తయారు చేసిన బూడి ముత్యాలనాయుడికి ఉన్న ప్రజాదరణ చూసి సీఎం రమేష్‌కు చెమటలు పడుతున్నాయి. ఓటమి భయం రోజురోజుకూ అధికమవుతోంది. అందుకే ఆ ఆందోళన ఇలా వ్యక్తమయింది. తమపై దాడి జరిగిందని సీఎం రమేష్‌, అతని అనుచరులు సానుభూతి డ్రామా ఆడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సీఎం రమేష్‌ ఎదురుదాడి

డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఇంటి వద్ద డ్రోన్‌తో రెక్కీ నిర్వహించిన వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారని తెలుసుకున్న సీఎం రమేష్‌ తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో మధ్యాహ్నం సుమారు 4 గంటల ప్రాంతంలో దేవరాపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన బూడి వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని.. లేకుంటే అమరావతి, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. ఘటన జరిగిన ముత్యాలనాయుడు ఇంటి వద్దకు వెళ్తానని సీఎం రమేష్‌ సిద్ధం కాగా శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు నిరాకరించారు. పోలీసులను నెట్టుకుంటూ అనుచరులతో తారువ బయలుదేరి వెళ్లారు. ముత్యాలనాయుడి అనుచరవర్గం మోహరించి ఉందని తెలుసుకొని హనుమాన్‌ ఆలయం ముందు మెట్లపై సుమారు 2 గంటల పాటు కూర్చుండి పోయారు. తారువ గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు అధిక సంఖ్యలో చేరుకొని రౌడీ రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని, వెంటనే ఇక్కడి నుండి వెళ్లి పోవాలన్న పోలీసుల సూచనలతో సీఎం రమేష్‌ పోలీస్‌ జీపు ఎక్కారు. సీఎం రమేష్‌ ఎక్కిన పోలీస్‌ జీపుకు అడ్డంగా గ్రామస్తులు బైఠాయించారు. తమ గ్రామం వచ్చి గుండాయిజం చేసి తమను రెచ్చకొట్టిన సీఎం రమేష్‌ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సుమారు అరగంటకు పైగా సీఎం రమేష్‌ ఎక్కిన పోలీస్‌ వాహనం నిలిచిపోయింది. పోలీస్‌ వాహనాన్ని చుట్టముట్టడంతో సీఎం రమేష్‌, అతని అనుచర వర్గం భయంతో వణికి పోయారు. పోలీసులు అతి కష్టం మీద సీఎం రమేష్‌ ఎక్కిన వాహనాన్ని ముందుకు పంపించగా గ్రామస్తులు మాత్రం ఊరు పొలిమేర దాటే వరకు వెంబడించారు.

దౌర్జన్యం.. దాడికి పాల్పడం పరిపాటి..

బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, అధికారులపై దౌర్జన్యం, దాడులకు పాల్పడినందుగాను గతంలో సీఎం రమేష్‌పై కేసులు కూడా నమోదు చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డీఆర్‌ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై దాడి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అది కాకుండా.. గతంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్టేషన్‌ పరిధిలో ఫోర్జరీ కేసు, నెల్లూరు జిల్లా కావలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోవిడ్‌ 19 నిబంధనలకు విరుద్ధంగా అమరావతి రైతు సంఘం జేఏసీ పేరిట పాదయాత్ర నిర్వహించడం, కడప జిల్లా యర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2019 ఎన్నికల సమయంలో యర్రగుంట్లలోని ఓ ఎన్నికల బూత్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్లడంతో పాటు తన కారు డ్రైవర్‌తో కలసి పరిగపాటి వెంకట సుధాకర్‌పై దాడి చేసిన కేసు, హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో భూ వివాదం కేసు, హైదరాబాద్‌ లకిడీకాపూల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏపీ సెక్రటేరియట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న సైఫాబాద్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను దూషించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్‌ను అడ్డుకున్నందుకు గాను హైదరాబాద్‌ అంబర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు, హైదరాబాద్‌లోని డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ ఆదేశాలను పాటించనందుకు మరో కేసు సీఎం రమేష్‌పై నమోదు చేశారు.

కుట్ర కోణం..
1/3

కుట్ర కోణం..

కుట్ర కోణం..
2/3

కుట్ర కోణం..

కుట్ర కోణం..
3/3

కుట్ర కోణం..

Advertisement
Advertisement