ర్యాంకులు, సౌకర్యాల ఎర! | Sakshi
Sakshi News home page

ర్యాంకులు, సౌకర్యాల ఎర!

Published Mon, May 6 2024 12:35 AM

ర్యాం

● ప్రైవేటు విద్యాసంస్థల అడ్మిషన్ల వేట ● తల్లిదండ్రులకు పీఆర్వోల ద్వారా ఫోన్లు ● టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందితో ఇంటింటి ప్రచారం ● మభ్యపెడుతూ ఒప్పించుకుంటున్న యాజమాన్యాలు

కొత్తగూడెంఅర్బన్‌: ప్రైవేటు విద్యాసంస్థలు అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. ర్యాంకులు, సౌకర్యాలంటూ తల్లిదండ్రులకు ఎరవేస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు వచ్చాయని, మీ పిల్లలను చేర్చితే మంచి భవిష్యత్‌ ఉంటుందంటూ కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి. పీఆర్వోల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు సేకరించి, వారు ఒప్పుకునేవరకు వెంటపడుతున్నాయి. ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు ఓకే చేయించుకుంటున్నాయి. పాఠశాల స్థాయి నుంచే ఇంజనీరింగ్‌, ఐఐటీ శిక్షణ ఇస్తున్నామని నమ్మబలుకుతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జీరో ఉత్తీర్ణతాశాతం నమోదైంది. కానీ పీఆర్వోలు అనేక మాటలు చెప్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. ఇక అడ్మిషన్‌ తీసుకుంటే రూ. వేలు, రూ.లక్షలు ఫీజు రూపంలో దండుకుంటాయి. ప్రైవేటు పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బందితో వేసవి సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి ఉదయం, సాయంత్రం వేళ అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అధికారంగా ప్రకటన వచ్చాకే అడ్మిషన్ల కోసం ప్రచారం చేపట్టాల్సి ఉండగా, కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాంస్థల యాజమాన్యాలు వేసవి సెలవులు మొదటి రోజు నుంచే ప్రచారం చేయడం గమనార్హం. ప్రచారం నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో కూడా ప్రైవేటు, కార్పొరేట్‌కు దీటుగా బోధన, సౌకర్యాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అధిక ఫీజులతో భారం

కార్పొరేట్‌, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. నిబంధనలు పాటించినవారికే జిల్లా విద్యాశాఖల అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే దరఖాస్తులు చేసుకున్న అందరికీ అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. అడ్మిషన్ల సమయంలో విశాలమైన తరగతి గదులు, క్రీడాప్రాంగణాలు, ఇంటిని తలపించే హాస్టల్‌ గదులు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారంలో ఉన్న హంగూఆర్భాటం కళాశాలలు, పాఠశాలల్లో కనిపించడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇరుకు గదులు, రేకుల షెడ్లలో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ కూర్చోవాల్సివస్తుందని పేర్కొంటన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఫస్ట్‌ క్లాస్‌ వరకే రూ.10 వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక పదో తరగతి వరకు అయితే రూ.లక్షల్లో తీసుకుంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్‌కు రూ.2 లక్షల వరకు ఫీజులుంటున్నాయని, హాస్టల్‌తో కలిపి రూ.2.50 లక్షల వరకు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు ప్రైవేటు పాఠశాలలు, 30 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ ఫీజులుగా అధికంగా వసూళ్లు చేస్తున్నారు. ఫీజుల వివరాలను ప్రతి పాఠశాల, కళాశాలలో నోటీసు బోర్డులో ఏర్పాటు చేయాలని విద్యాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు.

ప్రభుత్వ ఆదేశాలు వచ్చాకే అడ్మిషన్లు

ప్రభుత్వ ఆదేశాలు, నోటిఫికేషన్‌ వచ్చాకే ఇంటర్మీడియట్‌ ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని గ్రూపులు, సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. సర్కారు కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి.

– సులోచనరాణి, నోడల్‌ అధికారి

ర్యాంకులు, సౌకర్యాల ఎర!
1/2

ర్యాంకులు, సౌకర్యాల ఎర!

ర్యాంకులు, సౌకర్యాల ఎర!
2/2

ర్యాంకులు, సౌకర్యాల ఎర!

Advertisement
Advertisement