● ఇచ్చిన హామీలను నెరవేర్చని ఘనుడు ● ఓట్ల కోసమే చంద్రబాబు మయామాటలు ● సీకే బాబు.. ఆరణితోనే చిత్తూరు వెనుకబాటు ● వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | Sakshi
Sakshi News home page

● ఇచ్చిన హామీలను నెరవేర్చని ఘనుడు ● ఓట్ల కోసమే చంద్రబాబు మయామాటలు ● సీకే బాబు.. ఆరణితోనే చిత్తూరు వెనుకబాటు ● వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యం ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Published Mon, May 6 2024 8:30 AM

● ఇచ్చిన హామీలను నెరవేర్చని ఘనుడు ● ఓట్ల కోసమే చంద్రబాబ

పేదల అభ్యున్నతే జగన్‌ అజెండా

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం పేదల అభ్యున్నతి కోసమే అధికారంలోకి రావాలనుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. ఐదేళ్లలో 99శాతం హామీలు నెరవేర్చిన ఘనత దేశంలోనే జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు. అందుకే అమలు చేసే పథకాలతోనే నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతున్నామని వెల్లడించారు. పేదరికమే కొలమానంగా సంక్షేమ పథకాలు అందిస్తామని, మేనిఫెస్టోలో సీఎం జగన్‌ చేసేదే చెప్పారని స్పష్టం చేశారు.

చిత్తూరు కార్పొరేషన్‌ : చంద్రబాబునాయుడు ఎప్పుడూ మాట మీద నిలబడరని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని, మళ్లీ ఇప్పుడు కొత్తగా పక్క రాష్ట్రాల పథకాలను కాపీ కొట్టి మేనిఫెస్టో విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ అంటే నమ్మకమని, బాబు అంటే అబద్ధమని స్పష్టం చేశారు. గతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మోసపు వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, నమ్మితే మునిగిపోవడం తథ్యమని హెచ్చరించారు.

వెనుకబడ్డ చిత్తూరు

మాజీ ఎమ్మెల్యే సీకేబాబు వైఖరితో చిత్తూరు చాలా నష్టపోయిందన్నారు. ఆయన రౌడీయిజం కారణంగా చిత్తూరుకు రావాలంటే ఇతర ప్రాంతాలవారు భయపడ్డారని తెలిపారు. ఇతర జిల్లాలకు కార్పొరేట్‌ కంపెనీలు క్యూ కడుతుంటే చిత్తూరు మాత్రం వెనుకబడిందన్నారు.ఈ క్రమంలోనే ఆరణి శ్రీనివాసులును చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపిస్తే విశ్వాసం లేకుండా జనసేనకి వెళ్లారని మండిపడ్డారు. ఇక్కడ భూములన్నీ కబ్జా చేసేసి, ఇప్పుడు తిరుపతిపై పడ్డారని ఆరోపించారు.

కరోనా సమయంలో గురజాల ఎక్కడ?

జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా సమయంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. బీసీ నేత రావూరి ఈశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీ గెలుపునకు కారణమైతే అధికారంలో వచ్చాక మోసంచేశారని మండిపడ్డారు. రూ.300 కోట్లు విలువైన తన ఫ్యాక్టరీని నలుగురు నాయకులు కుట్రపన్ని మూయించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు గాయత్రిదేవి మాట్లాడుతూ కనకనేరి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలను టీడీపీ అభ్యర్థి గురజాల అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మేయర్‌ అముద, చుడా చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రమ్య, డిప్యూటీ మేయర్‌ రాజేష్‌కుమార్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ సరళామేరి, పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు లీనారెడ్డి పాల్గొన్నారు.

మేనిఫెస్టో కూడా కాపీనే

చంద్రబాబుకు ఎప్పుడూ ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదని, మేనిఫెస్టోను సైతం సొంతంగా ప్రకటించే దమ్ము లేదని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఏడాదికి రూ.1.65 లక్షల కోట్లు కావాలని, అందుకే ఆయన మాటల్ని ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వస్తే రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ చేసిన సంస్కృతి చంద్రబాబుదని, అందులో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5తోపాటు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ కూడా భాగస్వామ్యమేనని ఆరోపించారు. బడా వ్యాపారవేత్తలు, డబ్బుండే నాయకులు, సొంత ఆస్తులు పరిరక్షణే కోసమే చంద్రబాబు అధికారం కోరుకుంటున్నారని తెలిపారు.

కష్టం వస్తే ఆదుకుంటూ..

వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పదేళ్లుగా చిత్తూరు ప్రజలకు సేవ చేస్తున్నారని, కష్టం వస్తే ఆదుకుంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. సీకేబాబు లాంటి రౌడీని ఎదుర్కోవాలంటే తెలివైన విజయానందరెడ్డికే సాధ్యమన్నారు. ఈ పర్యాయం అధికారంలోకి రాగానే అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి చిత్తూరుకు శాశ్వతంగా నీటి సరఫరా చేయిస్తామని తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఇంటర్‌ రోడ్డు కనెక్టవిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయని, వాటికి రాయితీలను మరింత పెంచేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. డబ్బులు పంచి, దొంగ ఓట్లతో గెలవాలని టీడీపీ యత్నిస్తోందన్నారు. చిత్తూరు ఎంపీగా రెడ్డెప్పను, ఎమ్మెల్యేగా విజయానందరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ప్రజాసేవే పరమావధి

ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప మాట్లాడుతూ జిల్లాలోని ఒక పార్లమెంట్‌, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగనన్న ఆశీస్సులు, మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నామని, తమను ఆశ్వీరదించాలని అభ్యర్థించారు. గత పాలకుల శాపాలతోనే చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి రౌడీయిజం కారణంగా ఎన్నో కుటుంబాలు దిక్కులేకుండా పోయాయని, మరొకరి భూదాహం కారణంగా రూ.వందల కోట్ల ప్రజాధనం లూటీ అయ్యిందని విమర్శించారు.

Advertisement
Advertisement