సేవా ముసుగులో థామస్‌ దోపిడీ | Sakshi
Sakshi News home page

సేవా ముసుగులో థామస్‌ దోపిడీ

Published Mon, May 6 2024 8:35 AM

సేవా ముసుగులో థామస్‌ దోపిడీ

వెదురుకుప్పం : ప్రజా సేవ ముసుగులో టీడీపీ అభ్యర్థి థామస్‌ భారీ దోపిడీ చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు. ఆదివారం మంఢలంలోని వేణుగోపాలపురం ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను పావుగా వాడుకుని వారికి రూ. 200 చొప్పున ఇస్తూ సమాజానికి సేవ చేస్తున్నట్లుగా ఫోటోలు తీయించి దేశంలోని చర్చిలు, పాస్టర్లకు పంపి రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి అక్రమార్కుడు నేను అవినీతికి పాల్పడ్డానని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. దళితులంటే గిట్టని చంద్రబాబు పార్టీలో చేరి ఎస్సీలపై కపటప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రమాదం జరిగితే ఆ ఘటననూ రాజకీయ కోణంలో చూపి నేను చంపేందుకు కుట్ర చేస్తున్నానని థామస్‌ దుష్ప్రచారం చేశారని వెల్లడించారు. ఆయనను చంపాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ అనుభవం ముందు థామస్‌ ఒక బచ్చా అని తెలిపారు. తన ఇంట్లో తిని, పెరిగి ఇప్పుడు తన కుమార్తె కృపాలక్ష్మిపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి దెయ్యాల రమేష్‌కు విశ్వాసం లేదని వివరించారు. తన పిల్లలు బాగా చదువుకుని చక్కగా సంపాదించుకుంటున్నారని, అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ తనకు లేదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం టీడీపీ, కాంగ్రెస్‌ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ముద్రగడకు ఆయన కుమార్తెకు రచ్చ పెట్టారని, సీఎం జగనన్నకూ షర్మిలమ్మకు గొడవ పెట్టారని, రాజకీయ స్వార్థం కోసం కుటుంబాలను విభజిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీతో అందరి భ్రమలు తొలగిపోతాయని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుని ప్రజలను బురిడీ కొట్టించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారని ఆరోపించారు. బాబు మేనిఫెస్టో బూటకమని తెలిసి బీజేపీ చేతులుదులుపుకుంటోందని వివరించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ చెబుతున్న బీజేపీకి ఈ ఎన్నికల్లో మూడిందన్నారు. పేదల జీవితాల్లో నెలకొన్న చీకటిని తొలగించే సూర్యుడు జగనన్న అని కొనియాడారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం తథ్యమని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement