TDP Ex MLA Nallamilli Ramakrishnan Reddy Irregularities - Sakshi
Sakshi News home page

టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం: నిగ్గు తేలుతున్న నిజాలు  

Published Tue, Aug 31 2021 7:36 AM

Former TDP MLA Nallamilli Ramakrishna Reddy Irregularities - Sakshi

సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: చేసిన పాపం ఊరకనే పోదంటారు పెద్దలు. అది రాజకీయాల్లో అయితే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అక్షర సత్యమైంది. అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా వ్యవహరించిన ఈయన అవినీతి గుట్టు రట్టవుతోంది. ఐదేళ్ల ఏలుబడిలో సాగించిన అక్రమాల పుట్ట విజిలెన్స్‌ చేతికి చిక్కింది. విజిలెన్స్‌ విచారణలో వాస్తవాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. నీరు–చెట్టు, బ్రాందీషాపులు, ధాన్యం కొనుగోలులో హమాలీల ముసుగు, లే అవుట్‌ల అనుమతులు, ప్రభుత్వ సబ్సిడీ రుణాలలో ముందస్తు కమీషన్ల కక్కుర్తి...ఇలా ఒకటేంటి.. విజిలెన్స్‌ విచారణలో ఎన్నింటిలోనో అవినీతి దర్శనమిస్తున్నట్లు భోగట్టా. 

విచారణాంశాల్లో కొన్ని..
నీరు–చెట్టు పథకంలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి గ్రావెల్, మట్టిని తెగనమ్మేసిన విషయం విజిలెన్స్‌ విచారణలో ప్రా«థమికంగా తేలిందని సమాచారం. గ్రావెల్‌ను లేఔట్లకు, మట్టిని ఆలమూరు మండలం జొన్నాడ, ఆలమూరు, రాయవరం మండలం సోమేశ్వరం, రాయవరం, అనపర్తి మండలం పొలమూరుతోపాటు జిల్లాలో పలు ప్రాంతాలలో ఇటుకబట్టీలకు అమ్మేశారని నిర్థారణకు వచ్చారు. చెరువులలో అపరిమితమైన లోతు తవ్వేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

నీరు–చెట్టు ద్వారా 2016నుంచి 2018 వరకూ సుమారు రూ.3 కోట్లతో 51 పనులు చేపట్టారు. ఇందుకు 10 రెట్లు అంటే సుమారు రూ.30 కోట్లు అవినీతి జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారని సమాచారం. బిక్కవోలు మండలం లింగాల చెరువు పనుల్లో భారీగానే సొమ్ము చేసుకున్నారని తెలిసింది.

రంగంపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపురం, వడిశలేరు, సింగంపల్లి గ్రామాల్లో అవినీతి చోటు చేసుకుందని గుర్తించారు. రంగాపురంలో అచ్చన్న చెరువు, తమ్మలపల్లిలో రాళ్ల కండ్రిగ చెరువుల తవ్వకాల్లో దోచుకున్నారని నిఘా విభాగం ఆధారాలు సేకరించింది.

మాజీ ఎమ్మెల్యే బ్రాందీ షాపులనూ విడిచిపెట్ట లేదు. మందుబాబులపై ఎన్‌.ఆర్‌.టాక్సు పేరుతో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా యజమానులు వసూలుకు తలుపులు బార్లా తెరిచారు. 40 షాపుల నుంచి కమీషన్‌లు కొట్టేశారనే అంశంపై విజిలెన్స్‌ లోతుగా విచారిస్తోంది. ఏటా రూ.80 లక్షలు వసూలు చేసిన  వైనంపై ఆరా తీస్తోంది.. రామవరం, పొలమూరులకు చెందిన ముఖ్య అనుచరులు  ఈ వ్యవహారాన్ని చక్కబెట్టడాన్ని విజిలెన్స్‌ అధికారులు గుర్తించారని సమాచారం.

ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలులో హమాలీల పేరుతో రూ. లక్షలు కాజేశారు. ఈ మొత్తాన్ని మధ్యవర్తుల ద్వారా వెనకేసుకున్నారని తేలింది. కొమరిపాలెంలో జరిగిన కొనుగోలులో 10 శాతం కమీషన్‌ రూపంలో వెనకేసుకున్నారు.  సొసైటీ ప్రతినిధి రెండు విడతల్లో రూ.20 లక్షలు అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ముఖ్య అనుచరుడి ద్వారా కమీషన్‌గా రాబట్టడంపై విజిలెన్స్‌ దృష్టి సారించింది.

అనధికార లేఔట్లు, ల్యాండ్‌ కన్వర్షన్‌కు అనుమతులు మంజూరు చేయాలంటే ముందుగా లేఔట్‌ యజమాని ఎకరాకు రూ.2 లక్షలు ముట్టజెప్సాలిందే. అనపర్తికి చెందిన సత్తి వెంకటరామారెడ్డి ల్యాండ్‌ కన్వర్షన్‌ కోసం టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు ఎస్‌డీఆర్‌ ద్వారా ఎకరాకు రూ.2 లక్షలు వంతున వసూలు చేశారు. ఊలపల్లిలో రెండెకరాల లేఔట్‌ అనుమతికి జి.మామిడాడకు చెందిన సూర్యనారాయణరెడ్డి దరఖాస్తు చేసుకుంటే ఎకరాకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని టిఎస్సార్‌ అనే ముఖ్య అనుచరుడు మధ్యవర్తిత్వం వహించారు. చివరకు రూ.5 లక్షలు చేతిలో పడ్డాకనే అనుమతించినట్టు విజిలెన్స్‌ గుర్తించింది.

బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన రామారెడ్డి 2017లో వరికోత మెషీన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.2.50 లక్షలు ఇస్తేనే మెషీన్‌ మంజూరవుతుందని టీడీపీ నాయకుడు విజయభాస్కరరెడ్డి బేరం పెట్టారు. ధాన్యం అమ్మగా వచ్చిన రూ.2.50 లక్షలు ముట్టజెప్పినా  కోత మెషీన్‌ మంజూరు కాలేదు. సరికదా ఇప్పటికీ ఆ సొమ్ము తిరిగి చెల్లించకపోవడం గమనార్హం. ఇలాంటి బాగోతాలన్నీ విజిలెన్స్‌ నిశిత పరిశీలనలో తేలాల్సి ఉంది.

విచారణ జరుగుతోంది 
ఫిర్యాదులపై మా టీమ్‌ విచారణ జరుపుతోంది. ఇప్పటికే నాలుగైదు రోజులుగా క్షేత్ర స్థాయిలో విచారించారు. బిక్కవోలు, అనపర్తి మండలాల్లో వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. విచారణ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. ఒక డీఎస్పీ, ఇద్దరు ఇనస్పెక్టర్‌లు, ముగ్గురు వివిధ విభాగాల అధికారులు, మొత్తంగా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం వేగవంతంగా విచారిస్తోంది
– విజిలెన్స్‌ ఎస్పీ రవిప్రకాష్‌

ఇవీ చదవండి:
తాలిబన్ల ‘కే’ తలనొప్పి 
కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు

 

Advertisement
 
Advertisement
 
Advertisement