తస్మాత్‌ జాగ్రత్త | Sakshi
Sakshi News home page

తస్మాత్‌ జాగ్రత్త

Published Mon, May 6 2024 10:55 AM

తస్మాత్‌ జాగ్రత్త

నేరం చేస్తే నేరుగా జైలుకే

పోలీస్‌ నియమావళి కఠినతరం

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

కాకినాడ సిటీ: ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారు నిజంగా అనుకుంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంతో ఏ చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడి చేసే అధికార అస్త్రాలు పోలీసుల అమ్ములపొదిలో ఉంటాయి. ఆ అస్త్రాలివీ..

సెక్షన్‌ 125ఎ: అభ్యర్థులు తమకు పడిన శిక్షలు, తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణల వివరాలను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

సెక్షన్‌ 126: ఎన్నికలకు 48 గంటల లోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.

సెక్షన్‌ 127ఎ: ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో రాజకీయ పార్టీల బహిరంగ సభలకు ఎవరైనా అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించటం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు శిక్ష తప్పదు.

సెక్షన్‌ 127: ప్రచురణకర్తల చిరునామా లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రకటనలు ముద్రించటం నేరం. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను జిల్లా మెజిస్ట్రేట్‌ అనుమతితోనే జారీ చేయాలి. దీనిని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, రూ.25 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

సెక్షన్‌ 128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు చెందిన విషయాలను గోప్యంగా ఉంచాలి. దీనిని ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు.

సెక్షన్‌ 129: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ పార్టీ అభ్యర్థికై నా అనుకూలంగా వ్యవహరించటం నేరం. దీనిని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు, జరిమానా తప్పవు.

సెక్షన్‌ 130: పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించటం, ఓటర్లను అభ్యర్థించ టం, ఇతర పార్టీల అ భ్యర్థులకు ఓట్లు వేయవద్దని చెప్పడం నేరం.

సెక్షన్‌ 131, 132: పోలింగ్‌ స్టేషన్లలోని వ్యక్తులకు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆగ్రహం తెప్పించేలా మెగా ఫోన్లు, లౌడ్‌ స్పీకర్లతో ధ్వనులు చేయడం నిషిద్ధం. అలాంటి వారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రిసైడింగ్‌ అధికారులు, పోలీసు అధికారులకు సూచించవచ్చు. నిందితులకు మూడు నెలల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.

సెక్షన్‌ 134ఎ: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి పోలింగ్‌, కౌంటింగ్‌ ఏజెంటుగా ఉండటం నేరం. అలా చేస్తే మూడు నెలల జైలు తప్పదు.

సెక్షన్‌ 134బి: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల అనుమతి పొందిన సాయుధ పోలీసులు మినహా ఎవ్వరూ ఆయుధాలు ధరించి, పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో సంచరించకూడదు. పట్టుబడితే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.

సెక్షన్‌ 165, 166 సీఆర్‌పీసీ: వారెంట్లు లేకుండానే సోదాలు చేసే అధికారాన్ని పోలీసులకు ఈ సెక్షన్లు కల్పిస్తాయి. ఓటర్లకు పంపిణీ చేయటానికి ఎక్కడైనా డబ్బు, మద్యం, ఇతర బహుమతులను భద్రపరచినట్లు సమాచారం వస్తే పోలీసులు వెంటనే సోదాలు నిర్వహిస్తారు. అనుమతి లేకుండా ఉంచిన ఆయా సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తారు.

సెక్షన్‌ 353, 332, 186, 189, 190: వీటి ప్రకారం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను నిరోధించటం, దౌర్జన్యాలకు పాల్పడటం, దాడులు చేయటం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యా లు, హత్యాయత్నాలు, మారణాయుధాలు వినియోగించి దాడులకు పాల్పడటం, బాంబులు విసురుకోవడం చేస్తే ఐపీసీతో పాటు ఆర్‌పీ యాక్టు, పోలీసు చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు.

Advertisement
 
Advertisement