ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? | Sakshi
Sakshi News home page

ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?

Published Sun, May 5 2024 12:09 PM

The History Of Petrifying Well Is A Mystery And Shocking Facts

‘మంత్రాలకు, శాపాలకు ఏదైనాసరే.. రాయిగా మారిపోతుంది’ అనే మాటను పురాణగాథల్లో, జానపద కథల్లో వింటుంటాం. కానీ ఈ బావిలోని నీళ్లు దేన్నైనాసరే నిలువునా రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా? కానీ అది నిజం. ఇంగ్లండ్‌లోని ‘పెట్రిఫైయింగ్‌ వెల్‌’ చరిత్ర ఓ మిస్టరీ. దీన్నే ‘మదర్‌ షిప్టన్‌ కేవ్‌’ అని కూడా పిలుస్తారు.

నార్త్‌ యార్క్‌షైర్‌లోని అందమైన ప్రాంతాల్లో నేజ్‌బ్ర ఒకటి. దానికి అతి చేరువలో ఉన్న ఆ నుయ్యి నిరంతరం పొంగుతూనే ఉంటుంది. వర్షపు చినుకుల్లా పైనుంచి నీళ్లు కిందున్న ప్రవహంలోకి పడుతుంటాయి. ఈ ప్రవాహం కాలాన్ని బట్టి కొన్నిసార్లు ఎక్కువగా.. మరికొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. ఆ నీళ్లు పడే చోటే బొమ్మలు, టోపీలు, దుస్తులు, మనిషి పుర్రెలు, ఎముకలు, టీ కప్పులు, టెడ్డీబేర్‌ ఇలా ప్రతిదీ తాళ్లకు కట్టి వేలాడదీస్తారు ఇక్కడి నిర్వాహకులు. శీతాకాలంలో అవన్నీ మంచుతో గడ్డకట్టి రాళ్లుగా మారిపోతుంటాయి. అందుకే జ్ఞాపకార్థంగా ఉంచుకోవాల్సిన కొన్ని వస్తువులను ఇలా, ఇక్కడ రాళ్లుగా మార్చి మ్యూజియమ్స్‌లో దాచిపెడుతుంటారు. ఈ నీటిలో కొన్నినెలల పాటు ఉంచిన సైకిల్‌ రాయిగా మారిపోవడం గతంలో ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించింది.

నిజానికి ఇక్కడి అందాలను చూడటానికి రెండు కళ్లూ్ల చాలవు. నిడ్‌ నదికి పశ్చిమంగా ఉన్న ఈ ప్రదేశం..1630 నుంచి పర్యాటకేంద్రంగా వాసికెక్కింది. అప్పటి నుంచి ఇక్కడి నీళ్లపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఈ నీటిలో ఖనిజ పదార్థాలు, టుఫా, ట్రావెర్టైన్‌ వంటి శిలాసారం ఎక్కువ శాతం ఉండటంతో ఈ నీరు దేని మీద పడినా అది రాయిగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే పక్కనే ఉన్న మదర్‌ షిప్టన్‌  గుహకు సంబంధించిన కథ హడలెత్తిస్తుంది.

ఆ గుహలోనే.. 1488లో అగాథ సూత్‌టేల్‌ అనే 15 ఏళ్ల పాప ఓ బిడ్డకు జన్మనిచ్చిందని.. ఆ బిడ్డ పేరు ‘ఉర్సులా సౌథైల్‌’ అని, ఆ పాప పుట్టగానే ఏడవకుండా పెద్దపెద్దగా అరిచిందని, చూడటానికి విచిత్రమైన రూపంతో పెద్ద ముక్కతో హడలెత్తించేలా ఉండేదని, దాంతో ఆమెను సమాజంలో తిరగనిచ్చేవారు కాదని, అందుకే ఆ గుహలోనే పెరిగిందని, ఆమెకు ఎన్నో మంత్ర విద్యలు వచ్చని స్థానిక కథనం. అంతేకాదు ఆమె భవిష్యవాణి చెప్పగలిగేదట.

హెన్రీ Vఐఐఐ (1547) మరణం, గ్రేట్‌ ఫైర్‌ ఆఫ్‌ లండన్‌ (1666) వంటి ఎన్నో సంఘటనలను ముందుగానే చెప్పిందట. ఆమె చెప్పివన్నీ చాలా వరకు నిజం కావడంతో మన బ్రహ్మంగారి కాలజ్ఞానం మాదిరిగానే ఆమె చెప్పే జోస్యాన్ని చాలామంది నమ్మేవారు. ఆ తరుణంలోనే ఆమె పేరు ‘మదర్‌ షిప్టన్‌ ’గా మారింది.

ఇక ఆమెను దేవత అని పూజించేవారు కొందరైతే, ప్రమాదకరమైన మంత్రగత్తె అని దూరంపెట్టేవారు ఇంకొందరు. ఈ రెండవ వర్గం వాదన అక్కడితో ఆగలేదు. ఆమె ప్రభావంతోనే అక్కడి నీరు అలా మారిపోతోందని ప్రచారం సాగించారు. అయితే ఆమెను దైవదూతగా భావించినవారంతా ఆ నుయ్యి దగ్గర కోరిన కోరికలు తీరతాయని నమ్మడం మొదలుపెట్టారు.

ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏమిటంటే 1561లో తన 73 ఏళ్ల వయసులో ఆమె చనిపోయిందట. అయితే ఆమె మృతదేహం కూడా రాయిగా మారిపోయిందని, అది ఆ గుహలోనే శిల్పంలా ఉందనే ప్రచారమూ సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఆ గుహలో ఆమె రూపంలో ఒక శిల్పం ఉంటుంది.. ఆ గుహను పడిపోకుండా ఆపుతున్నట్లుగా! అయితే అది నిజంగా ఆమె మృతదేహమేనా అనేదానిపై స్పష్టత లేదు.

మదర్‌ షిప్టన్‌  చనిపోయిన 80 ఏళ్లకు ఆమె రాసిన పుస్తకం ఒకటి బయటపడిందట. అందులో ఆమె 1881లో ప్రపంచం అంతం అవుతుందని రాసిందంటూ 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా వార్తలు వ్యాపించాయి. ఆమె చెప్పిన జోస్యం జరిగి తీరుతుందని, మనకు చావు తప్పదని చాలామంది వణికిపోయారు. అయితే ప్రపంచం అంతం కాకపోయేసరికి ఆ జోస్యం ఆమె చెప్పింది కాదనే ప్రచారమూ ఊపందుకుంది.

ఏది ఏమైనా ఇక్కడి నీళ్లను ఎవరూ తాకకూడదని ఎక్కడికక్కడ నింబధనలు ఉంటాయి. శాస్త్రవేత్తలు, నిర్వాహకులు సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అసలు ఈ నీరు ఎప్పటి నుంచి అలా మారింది? ఉర్సులా సౌథైల్‌ చనిపోతూ నిజంగానే శిల్పంగా మారిందా? అసలు ఉర్సులా పూర్వీకులు ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆమె తల్లి ఏమైపోయింది? లాంటి ఏ వివరాలూ  ప్రపంచానికి తెలియవు. అందుకే నేటికీ ఈ గుహ వెనకున్న కథ మిస్టరీనే మిగిలిపోయింది. — సంహిత నిమ్మన

ఇవి చదవండి: మధిర టు తిరుపతి.. 'సారూ.. ఆ రైలేదో చెబితే ఎక్కుదామని..!'

Advertisement
Advertisement