మే నెలలో రెండో ఆదివారం మదర్స్‌ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు | Sakshi
Sakshi News home page

మే నెలలో రెండో ఆదివారం మదర్స్‌ డే : కానీ అక్కడ మాత్రం రెండు సార్లు

Published Sat, May 11 2024 1:00 PM

Mother's Day 2024: Is it celebrated twice a year? check here

సమాజానికి తల్లులు చేసిన అమూల్యమైన సేవలను స్మరించుకునే  రోజే  మదర్స్‌ డే. మే నెల రెండోఆదివారం ప్రపంచవ్యాప్తంగా మదర్స్‌ డే జరుపుకుంటారు. వెలకట్టలేని తల్లి ప్రేమకు గుర్తుగా మదర్స్‌ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మాతృమూర్తుల త్యాగాలను, కష్టాలను గుర్తించడం, తిరిగి ప్రేమను అందించడమే ఈ మదర్స్‌ డే లక్ష్యం.

అంతులేని త్యాగానికి  ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు పెట్టింది పేరు అమ్మ. ప్రతీ మనిషికి ప్రత్యక్ష దైవం.  ఆ దేవదేవుడికైనా, సామాన్య మానవుడికైనా  అమ్మే ఆది దైవం, గురువు అన్నీ.

ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా , అమెరికాలలో మే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. 1908వ సంవత్సరంలో అమెరికాకు  చెందిన కార్యకర్త అన్నా జార్విస్ తన తల్లిని గౌరవించేందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని  ప్రారంభించింది.  ఆ తరువాత  తల్లి కష్టాలను గుర్తించే రోజుగా మదర్స్‌డేగా  ప్రాచుర్యంలోకి వచ్చింది.

మదర్స్‌ డే చరిత్ర
నిజానికి మదర్స్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది. పురాతన గ్రీకు నాగరికతలో  వసంత వేడుకలా దీన్ని జరుపుకునేవారు. రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్‌గా భావించి ప్రతి ఏడాదికి ఒక సారి నివాళులర్పించే వారు. 17వ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు జరిపే వారు. అదే 1872 లో అయితే జూలియ వర్డ్‌ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని  నిర్వహించారు.

అమెరికాలో అన్ని రాష్ట్రాలలో మాతృ దినోత్సవాన్ని 1911 నాటికి జరపడం మొదలైంది. 1914 నుంచి అధికారికంగా జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించారు. ఇలా అప్పటి నుంచి మేనెలలో వచ్చే  రెండో ఆదివారం మదర్స్ డే ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో మదర్స్ డే జరుపుకుంటారు.

ఏడాదికి  రెండు సార్లు మదర్స్ డే?
కొన్ని దేశాల్లో మార్చిలో కూడా జరుపుకుంటారు.  యూకే, కోస్టారికా, జార్జియా, సమోవా , థాయిలాండ్‌లలో ఈస్టర్ ఆదివారం కంటే మూడు వారాల ముందు మదర్స్ డే జరుపుకుంటారు.

మదర్స్ డే వెనుక ఇంత కథ ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి.  అమ్మ ప్రేమని ఈ కేవలం ఒక్కరోజు స్మరించుకుంటే సరిపోతుందా? ఒక గులాబీ పువ్వో, లేదా ఒక గ్రీటింగ్‌ కార్డ్‌.. ఒక హగ్‌ ఇచ్చేస్తే సరిపోతుందా? ఎంతమాత్రం కానే కాదు. కల్మషం ఎరుగని అమ్మ సేవలకు విలువ కట్టలేం. కానీ కన్నబిడ్డగా ఆమె రుణం తీర్చుకోవచ్చు. అమ్మకు అమ్మంత ప్రేమను తిరిగి ఇచ్చేయండి. అమ్మకు అండగా నిలవండి. ఈ సంవత్సరం మదర్స్ డే రోజు  అమ్మకు ఇంతకంటే అద్భుతమైన  బహుమతి ఇంకేముంటుంది చెప్పండి. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement