Nyrika Holkar: గోద్రెజ్‌ సైనిక... నైరిక | Sakshi
Sakshi News home page

Nyrika Holkar: గోద్రెజ్‌ సైనిక... నైరిక

Published Sat, May 4 2024 6:21 AM

Nyrika Holkar made her way to the top in Godrej Enterprises Group

పవర్‌ఫుల్‌ ఉమెన్‌

వ్యాపార విభజనతో గోద్రెజ్‌ కంపెనీ వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో  ‘గోద్రెజ్‌ అండ్‌ బోయ్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్,  ఆ కంపెనీ ఫ్యూచర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 
క్యాండెట్‌ నైరికా హోల్కర్‌పై ప్రత్యేక దృష్టి పడింది. ‘గోద్రెజ్‌’లో న్యూ జనరేషన్‌  ప్రతినిధిగా భావిస్తున్న నైరికా హోల్కర్‌  లీడర్‌షిప్‌ ఫిలాసఫీ గురించి....

గోద్రెజ్‌ కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరికా హోల్కర్‌కు నేర్చుకోవాలనే తపన. ఆఫీసులోని సీనియర్‌ల నుంచి ఇంట్లో చిన్న పిల్లల వరకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ పడదు. ‘వినడం వల్ల కలిగే ఉపయోగాలు, కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌ నా కూతురి నుంచి నేర్చుకున్నాను’ అని వినమ్రంగా చెబుతుంది నైరిక. ఐడియా రాగానే ఆ క్షణానికి అది గొప్పగానే ఉంటుంది. అందుకే తొందరపడకుండా తనకు వచ్చిన ఐడియా గురించి అన్నీ కోణాలలో విశ్లేషించి ఒక నిర్ధారణకు వస్తుంది. ‘నా అభి్రపాయమే కరెక్ట్‌’ అని కాకుండా ఇతరుల కోణంలో కూడా ఆలోచించడం అలవాటు చేసుకుంది.

‘యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌’లో లా చదివిన నైరిక కొలరాడో కాలేజీలో (యూఎస్‌)లో ఫిలాసఫీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ చదువుకుంది. లీగల్‌ ఫర్మ్‌ ‘ఏజెడ్‌బీ అండ్‌ పార్ట్‌నర్స్‌’తో కెరీర్‌ప్రారంభించిన నైరిక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు సలహాలు ఇవ్వడంలో ప్రత్యేక ప్రతిభ సాధించింది. గోద్రెజ్‌ అండ్‌ బోయ్స్‌ (జీ అండ్‌ బి)లోకి అడుగు పెట్టి డిజిటల్‌ స్ట్రాటజీ నుంచి కంపెనీ లీగల్‌ వ్యవహారాలను పర్యవేక్షించడం వరకు ఎన్నో విధులు నిర్వహించింది. ఆమె నేతృత్వంలో కంపెనీ ఎన్నో ఇంక్యుబేటెడ్‌ స్టారప్‌లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సాధికారతకుప్రాధాన్యత ఇచ్చే నైరిక ‘పవర్‌’ అనే మాటకు ఇచ్చే నిర్వచనం...

‘అర్థవంతమైన మార్గంలో ప్రభావం చూపే సామర్థ్యం’ ‘నాయకత్వ లక్షణాలకు చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. చిన్న స్థాయిలో పనిచేసే మహిళలలో కూడా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉండవచ్చు. అలాంటి వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం నాప్రాధాన్యతలలో ఒకటి’ అంటుంది నైరిక.
కోవిడ్‌ కల్లోల కాలం నుంచి ఎంతోమంది లీడర్స్‌లాగే నైరిక కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంది.

‘మాలాంటి కంపెనీ రాత్రికి రాత్రే డిజిటల్‌లోకి వచ్చి రిమోట్‌ వర్కింగ్‌లోకి మారుతుందని చాలామంది ఊహించలేదు’ అంటున్న నైరిక సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ‘స్ప్రింట్‌’ ΄ోగ్రాం ద్వారా కొత్త ఐడియాలను ్ర΄ోత్సహించడం నుంచి ప్రయోగాలు చేయడం వరకు ఎన్నో చేసింది. ‘నైరిక ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడుతుంది. ఒకప్రాజెక్ట్‌లో భాగంగా సమర్ధులైన ఉద్యోగులను ఒకచోట చేర్చే నైపుణ్యం ఆమెలో ఉంది. న్యూ జనరేషన్‌ స్టైల్‌ ఆమె పనితీరులో కనిపిస్తుంది’ అంటారు గోద్రెజ్‌లోని సీనియర్‌ ఉద్యోగులు.


‘గోద్రెజ్‌ అండ్‌ బోయ్స్‌’ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జంషెడ్‌ గోద్రేజ్‌ సోదరి స్మితా గోద్రెజ్‌ కూతురే నైరికా హోల్కర్‌. ఇండోర్‌ రాజ కుటుంబానికి చెందిన యశ్వంత్‌రావు హోల్కర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలానికి పైగా ఇంజనీరింగ్‌–ఫోకస్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకొని రాణించడం అంత తేలికేమీకాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను తన సామర్థ్యంతో అధిగమించి గోద్రెజ్‌ మహాసామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది నైరికా హోల్కర్‌. గ్లోబల్‌ లీగల్‌ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేయడం వరకు కంపెనీలో తనదైన ముద్ర వేసింది.
 

2030 నాటికి...
కోవిడ్‌ తరువాత కొత్త ప్రాధాన్యత రంగాలను... ఉత్పత్తులు, సేవలను మెరుగు పరిచే అవకాశాలను గుర్తించాం. కార్బన్‌ తీవ్రతను తగ్గించాలనుకుంటున్నాం. ఎనర్జీప్రాడక్టివిటీని రెట్టింపు చేయాలనుకుంటున్నాం. పర్యావరణ హిత ఉత్పత్తుల నుంచి 32 శాతం ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రాబోయే కాలంలో కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం.
– నైరికా హోల్కర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement