సమ్మర్‌లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి! | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!

Published Mon, May 6 2024 12:05 PM

Ponduru Khadi Speciality, Uniqueness Mahatma Gandhis Soft Spot

75 ఏళ్ల చరిత్ర ఉన్న పొందూరు ఖాదీని మహాత్మాగాంధీని వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నగరానికి సుమారు 30 కిలోమీటర్లు దూరంలో ఉన్న పొందూరు అనే గ్రామంలో ఈ మృదువైన ఖాదీని నేస్తారు. ఆ గ్రామం పేరు మీదుగానే ఈ ఖాదీకి పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ గ్రామం పత్తి వడకడానికి గాంధీ చరఖా స్పిన్నర్లనే ఉపయోగించడం విశేషం. అందువల్లే ఈ నేత చీరలు ఎక్కడలేని ప్రత్యేకతనూ చాటుకుంటున్నాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో వెలుగొందిన ఈ నూరుకౌంట్‌ చీర మళ్లీ స్పెషల్‌​ ఎట్రాక్షన్‌గా ట్రెండ్‌ అవుతోంది. పొందూరు చీరలనే ఎలా నేస్తారు? వాటి విశేషాలు సవివరంగా తెలుసుకుందామా..!

మండుటెండలో ఈ చీర చల్లగా హాయిగా ఉంటుంది. ఎముకలు కొరికే చలిలో వెచ్చదనాన్ని ఇచ్చే పొందికైన చీరలివి. స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవడానికని స్వయంగా తన కొడుకు దేవదాస్‌ గాంధీని పొందూరుకు పంపించారట. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవదాస్‌ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో మహాత్మ తన ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో అద్భుతమైన వ్యాసం రాశారు. దీంతో ఒక్కసారిగా నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికి క్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు చేనేత వైభవం. 

ఆచార్య వినోభాబావే 1955లో శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే... నేడు ఆంధ్రా ఫైన్‌ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘంగా మారింది. దీని పరిధిలో సుమారు 26 గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తుంటే వీరిలో 200మంది నేత కార్మికులు, 1500 మంది నూలు వడికేవారు ఉన్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఈ గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా సున్నితమైన చేతులతో పత్తిని శుద్ధి చేసి వడుకుతోన్న స్త్రీలే ఎక్కువగా కనిపిస్తారు. 

చేపముల్లుతో పత్తిని శుద్ది చేసి..?
పొందూరు నేత కోసం మొదట చేసే పని... చేప ముల్లుతో పత్తిని శుద్ధి చేయడం. అందుకోసం వారు వాలుగ చేప దవడని ఉపయోగిస్తారు. ఇదే వారి ప్రధాన పరికరం. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేపముల్లుని జాలర్లు వారికి ప్రేమగా ఇస్తారు. ఈ ముల్లును స్థానికంగా, ఒక్కోటి ఇరవై రూపాయలకు కొంటారు. దీంతో దూదిని ఏకడం వల్ల పత్తిలోని మలినాలు పోయి, వస్త్రం దృఢంగా ఉంటుందనేది చేనేత కార్మికుల నమ్మకం

అక్కినేని, సినారే బ్రాండ్‌ అంబాసిడర్లుగా..
తెల్లని దుస్తులు ధరించాలనుకునే చాలామంది నిరాశ పడే విషయం... ఒక్క ఉతుకు తరవాత అవి మెరుపు పోవడం, నల్లగా మారడం. కానీ ఈ పొందూరు చీరలు, పంచెలు ఉతికేకొద్దీ ఇంకా ఇంకా వన్నెలీనుతాయి. వేసవిలో చల్లగా, తెల్లగా ఉండే ఈ పంచెల్ని అక్కినేని, సినారే వంటివారు ఎంతగానో ప్రేమించారు. బ్రాండ్‌ అంబాసిడర్లుగానూ మారారు. ఇప్పటికీ ‘అక్కినేని అంచు పంచెలు’ ఇక్కడ బాగా అమ్ముడవుతాయి. ‘నూరు కౌంట్‌ మా ప్రత్యేకం. వాలుగ చేప దవడతో దూదిని ఏకిన తరవాత... మగ్గానికి చేరే ముందు వివిధ దశల్లో శుద్ధిచేస్తాం. 

నూరు కౌంట్‌ అనడానికి రీజన్‌..
ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తియ్యటం, మెత్తబరచటం, ఏకు చుట్టడం, వడకటం, చిలక చుట్టడం ఇలా ఎనిమిది దశలు ఉంటాయి. మేమే పత్తి కొనుక్కుని ప్రత్యేక పనిముట్లను ఉపయోగించి పైన చెప్పిన పద్ధతుల్లో సన్నని, స్వచ్ఛమైన నూలుపోగులు తయారు చేస్తాం. అందుకే దీన్ని నూరు కౌంట్‌ అంటారు. ఆ స్వచ్ఛమైన నూలుపోగులతోనే చీరలు రూపొందిస్తాం. మా దగ్గర తయారయ్యే జాందానీ చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పూర్తిగా చేతులతోనే నేస్తాం. 

ఒక్కో చీర ధర రూ.4000 నుంచి రూ.15000 వరకూ ఉంటుంది. తయారీకి 15-20 రోజులు పడుతుంది. ధరతో సంబంధం లేకుండా ఈ చీరలకు ఇప్పటికీ డిమాండ్‌ ఉండటం విశేషం. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌, గాంధీజీ మనవరాలు తారాగాంధీ వంటివారకి ఈ పొందూరు చీరలనే ఎంతోగానో ఇష్టంగా ధరించేవారట.

మోదీకి సైతం బహుకరించేందుకు.. 
75 ఏళ్ల జల్లేపల్లి కాంతమ్మ... ఆరేళ్ల ప్రాయం నుంచీ ఈ నేత పనిలోనే ఉన్నారు. నూలును నాణ్యంగా వడికే నైపుణ్యం ఉన్న అతి కొద్దిమందిలో కాంతమ్మ ఒకరు. గాంధీజీ సిద్ధాంతాల్ని ఇప్పటికీ ఆచరిస్తోన్న కాంతమ్మని కలవడానికి దేశం నలుమూలల నుంచి చేనేత ప్రేమికులు వస్తూనే ఉంటారు. 2013లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా ఎర్రకోట నుంచి ఆహ్వానం అందుకున్నారు కాంతమ్మ. అప్పుడే ప్రధాని మోదీకి ఖాదీ గొప్పతనం వివరించి, తన చేతులతో వడికిన నూలును బహుకరించారు. 

ఇక్కడ తయారవుతున్న వస్త్రాలు గుంటూరు, వావిలాల, మెట్టుపల్లి, తుని తదితర ప్రాంతాలకు పంపుతున్నారు. బెంగుళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, మచిలిపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి మరీ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఈ పొందూరు నేతన్నలకు ప్రస్తుత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నేతన్న నేస్తం కింద రూ 48 వేలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అయితే తర్వాత తరాలు ఈ విద్యపై ఆసక్తి చూపించడం లేదని నేత కార్మికులు బాధపడుతున్నారు.  

(చదవండి: ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!)

 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement