ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో.. | Sakshi
Sakshi News home page

ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..

Published Sun, May 5 2024 12:36 PM

Uttamudi Vruttantham Is An Inspiring Story Written By Sankyaayana

ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.

ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. 
      ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.

ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు.
      ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.
‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు.
      విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.

రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు.
      ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు.
      ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు.
      ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు.
      ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.

ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. 
      ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు.

      ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.
‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు.
      ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.
అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.
విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.

‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.

ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయన

ఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'?

Advertisement
 
Advertisement