జిల్లాలో 80.30 శాతం పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

జిల్లాలో 80.30 శాతం పోలింగ్‌

Published Wed, May 15 2024 4:45 AM

జిల్లాలో 80.30 శాతం పోలింగ్‌

తుది లెక్కలు విడుదల చేసిన కలెక్టర్‌

ఓటు వేసిన వారు 13,12,255

కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొన్ని ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలను కాకినాడ జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములకు మంగళవారం ఉదయం 7 గంటల వరకూ తరలిస్తూనే ఉన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ వివరాలు అధికారులకు ఆలస్యంగా అందాయి. జిల్లాలో పోలింగ్‌ తుది వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ రాత్రి ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో 80.30 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 8,04,445, మహిళలు 8,29,371, ఇతరులు 186 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 6,52,578 (81.12 శాతం), మహిళలు 6,59,575 (79.52 శాతం), ఇతరులు 102 (54.84 శాతం) కలిపి మొత్తం 13,12,255 మంది ఓట్లు వేశారు.

చైతన్య కార్యక్రమాలతో..

ఓటు ప్రాధాన్యంపై ఓటర్లలో అవగాహన పెంచేందుకు నిర్వహించిన చైతన్య కార్యక్రమాలు ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరగడానికి దోహదపడ్డాయని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 78.52 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, ఈసారి ఇది పెరిగిందని తెలిపారు. ఈ ఉద్యమంలో చురుకై న భూమిక వహించిన జేఎన్‌టీయూకే, రంగరాయ వైద్య కళాశాలల విద్యార్థులు, లాయర్లు, మత్స్యకార పెద్దలు, ఆటో డ్రైవర్లు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్‌ అభినందించారు. ఓటు పవిత్రత, ప్రాధాన్యాన్ని చాటుతూ ప్రసిద్ధ యువ నేపథ్య గాయకుడు యశస్వి కొండేపూడి సహకారంతో చిత్రీకరించి, వివిధ మాధ్యమాల్లో ప్రదర్శించిన ‘ఓటే నీ ఆయుధం’ స్వీప్‌ వీడియో పాటను 57 వేల మందికి పైగా తిలకించి, స్పందించారన్నారు. వీటితో పాటు స్వీప్‌ సదస్సులు, ర్యాలీలు, సందేశాత్మక గ్లో లైట్లు, హోర్డింగులు, సెల్ఫీ పాయింట్లు కూడా ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజలను జాగృతం చేశాయని వివరించారు. పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు.

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రం

జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో సురక్షితంగా భద్రపరిచామని కలెక్టర్‌ నివాస్‌ వెల్లడించారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం జేఎన్‌టీయూకేలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పోలింగ్‌ కేంద్రాల వారిగా ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని స్వీకరించామని వివరించారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూములకు జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్‌.గణేష్‌, రాజేష్‌ జోగ్‌పాల్‌, కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ ఎస్‌.సతీష్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌, పిఠాపురం రిటర్నింగ్‌ అధికారి ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం సీల్‌ వేశారు. అన్ని స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలతో 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎల్‌ఈడీ టీవీ స్క్రీన్లు, విద్యుద్దీపాలు అమర్చారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూకేకి కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ కార్యక్రమంలో తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట నియోజవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పీవీ రామలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఇట్ల కిషోర్‌, జె.సీతారామారావు, జె.వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, ట్రైనీ ఐపీఎస్‌లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement