No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Sun, May 5 2024 6:15 AM

-

కమ్మర్‌పల్లి: స.హ చట్టం సెక్షన్‌–7 ప్రకారం దరఖాస్తుదారుడు నిర్ణీత కాలంలో సమాచారం తీసుకోవడానికి కొంత రుసుములు చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి. సెక్షన్‌–8, 9 ప్రకారం దేశ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎటువంటి సమాచారం అయినా రుసుములు చెల్లించి తీసుకోవాలి. ఉత్తర్వు నంబర్‌ 740, 454 ప్రకారం సమాచారం ఇవ్వాల్సిన ప్రజా సమాచార అధికారులు ఏ–4 లేదా ఏ–3 పరిమాణం గల కాగితానికి రూ. 2 చొప్పున తీసుకోవాలి. సమాచారం ఎక్కువగా ఉంటే సీడీ, డీవీడీ లేదా ప్లాపీ రూపంలో సమాచారాన్ని తీసుకోవచ్చు. ఒక సీడీకి రూ.100, డీవీడీకై తే రూ.200, ప్లాపీకై తే రూ.50 చెల్లించి తీసుకోవాలి. కానీ 4(1)–బి రూపంలో ఉన్న 17 అంశాల సమాచారం మాత్రం దరఖాస్తుదారుడికి ఉచితంగా ఇవ్వాలి. సహజంగా దరఖాస్తుదారులు కోరే సమాచారంలో 90 శాతం 4(1)–బి కి సంబంధించిన సమాచారమే ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తంలో రుసుములు అడుగుతూ కొందరు అధికారులు స.హ చట్టం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.

అధికారులే అడ్డు గోడలు...

ఉమ్మడి జిల్లాలో పౌరులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకోవడానికి స.హ చట్టం ఉత్తర్వు నంబర్‌ –740, సెక్షన్‌–7ను ఆయుధంగా చేసుకొని అధిక రుసుం వసూలు పేరుతో స.హ చట్టానికే మస్కా కొడుతున్నారు. స.హ చట్టం సెక్షన్‌–6(1) ప్రకారం ఒక ప్రభుత్వ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే 30 రోజుల్లో సమాచారం ఇవ్వడం గగనంగా మారింది. సాధారణ సమాచారం అయితే ఇస్తున్నారు కానీ, అవినీతితో ముడిపడిన సమాచారం గానీ, లోపాలు గల సమాచారం ఇవ్వడానికి అధికారులు రుసుముల పేరుతో కొత్త ఎత్తుగడ అనుసరిస్తున్నారు. అధిక రుసుములపై సమాచార కమిషన్‌కు సెక్షన్‌–18(1) దరఖాస్తుదారులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ, ఆ అప్పీల్‌ విచారణకు రావడానికి రెండేళ్లు సమయం పడుతోంది. ఈ దశలో దరఖాస్తుదారులు ఏమి చేయాలో తెలియక మిన్నకుండిపోతున్నారు.

దరఖాస్తుదారుడికి బషీరాబాద్‌ పంచాయతీ కార్యదర్శి పంపిన లేఖ

Advertisement
Advertisement