కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు

Published Wed, May 15 2024 4:30 AM

కొనుగ

నిజాంసాగర్‌(జుక్కల్‌): యాసంగి పంట నూర్పిళ్లు చేసి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కుప్పలు పోసిన రైతులు విక్రయాలకు తిప్పలు పడుతున్నారు. తూకం చేసిన ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. లారీలు రాక రైస్‌ మిల్లులకు ధాన్యం బస్తాలు తరలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరిధాన్యం సేకరణ చేపడుతున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 2.3 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. లక్షకు పైగా మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు సిద్ధంగా ఉంది. గడిచిన 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయాలు సక్రమంగా ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వరిధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రాకపోవడంతో తూకాలు మందకొడిగా సాగుతున్నాయి. అంతే కాకుండా రైస్‌ మిల్లుల్లో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోవడంతో రైస్‌ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. వరిధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీలు వారం రోజుల పాటు ఖాళీ కాకపోవడంతో లారీల కొరత తీవ్రంగా ఉంది. అంతే కాకుండా మిల్లర్లు కడ్తా పేరిట బస్తాకు రూ.2 కిలోలు తరుగు ఇస్తే ధాన్యం బస్తాలను తీసుకుంటామని షరతులు విధిస్తున్నారు.

వారం రోజులుగా నిలిచిన కొనుగోళ్లు

నిజాంసాగర్‌, మహమ్మద్‌నగర్‌ మండలాల్లోని మాగి, వెల్గనూర్‌, ఆరేడ్‌, బ్రాహ్మణపల్లి, హసన్‌పల్లి, మహమ్మద్‌ నగర్‌, బూర్గుల్‌, తుంకిపల్లి, కొమలంచ, గాలీపూర్‌, ముగ్థుంపూర్‌ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా తూకాలు అర్థంతరంగా నిలిచాయి. ఆయా కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ధాన్యం బస్తాలు రైస్‌ మిల్లులకు తరలించకపోవడంతో హమాలీలు తూకాలను నిలిపి వేశారు.

గున్కుల్‌ కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉన్న ధాన్యం బస్తాలు

లారీలు రావు.. రైస్‌ మిల్లులకు

ధాన్యం బస్తాలు పోవు

పట్టించుకోని సొసైటీల నిర్వాహకులు, అధికారులు

వడ్లు అమ్మి వారం రోజులైంది

వడ్లు అమ్మి వారం రోజులవుతున్నా ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. లారీలు రాకపోవడంతో రాత్రింబవళ్లు ధాన్యం బస్తాల వద్ద కాపాలా ఉంటున్నా. ఐదు ఎకరాల్లో పంట పండించినా తిప్పలు కాలేదు కానీ వడ్ల బస్తాల కాడ కాపలా ఉండాలంటే దు:ఖం వస్తుంది.

– మొట్ట అంజయ్య, రైతు గున్కుల్‌

అమ్ముకోవడం మరో ఎత్తు

ఆరుగాలం కష్టపడి పంట పండించడం ఒక్క ఎత్తైతే వ డ్లు అమ్ముకోవడం మరో ఎ త్తు. వారం రోజుల కిందట 858 బస్తాలు కాంటా పెట్టించి రైస్‌ మిల్లుకు లారీ పంపించినా. ఇప్పటికి రైస్‌ మిల్లులో లారీ ఉంది కాని బస్తాలను ఖాళీ చేసుకోలేదు. ఇంకా కొనుగోలు కేంద్రంలో 175బస్తాలు ఉన్నాయి. అధికారులు స్పందించాలి. – రియాజ్‌, రైతు, కోమలంచ

కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు
1/2

కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు

కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు
2/2

కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు

Advertisement
 
Advertisement
 
Advertisement