బహిరంగ ప్రచారానికి తెర | Sakshi
Sakshi News home page

బహిరంగ ప్రచారానికి తెర

Published Mon, May 6 2024 5:40 AM

బహిరంగ ప్రచారానికి తెర

సాక్షి, బళ్లారి: లోక్‌సభ ఎన్నికల్లో రెండో విడత పోరు ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. రెండో దశలో మిగిలిన 14 స్థానాల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. నెల రోజులుగా అన్ని పార్టీల నేతలు హోరాహోరీ ప్రచారం కొనసాగింది. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు శ్రమించారు. ఈనెల 7న ఉత్తర కర్ణాటక, మధ్య కర్ణాటక పరిధిలో బళ్లారి, రాయచూరు, కొప్పళ, దావణగెర, బాగల్‌కోట, బీదర్‌, హావేరి, విజయపుర, బెళగావి, గదగ్‌, కలబుర్గి తదితర 14 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

ప్రచారంలో అగ్రనేతలు :

ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు ఎండలతో నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ప్రచారం హోరెత్తించారు. నామినేషన్లు వేసినప్పటి నుంచి బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా, కాంగ్రెస్‌ పార్టీ తరుపున రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సీఎం సిద్ధరామయ్యలు విస్తృతంగా ప్రచారం చేశారు. మండుటెండల్లో నేతలు సైతం తమ పార్టీ అభ్యర్థులు తరపున తమదైన శైలిలో వాగ్భాణాలు సంధిస్తూ ప్రచారం చేశారు. చివరి రోజు జిల్లా వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు హోరాహోరీగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు, మాజీ సీఎం సదానందగౌడ, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. బహిరంగ ప్రచారానికి తెరపడటంతో నేడు (సోమవారం) సాయంత్రం వరకు ఇంటింటా ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉండటంతో అభ్యర్థితో పాటు కలిసి నలుగురు లేదా ఐదుగురు ప్రచారం చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. బహిరంగ ప్రచారానికి చివరి రోజు కావడంతో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్‌ సూర్జివాలా బెళగావి జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. బళ్లారి లోక్‌సభ నియోజవర్గ పరిధిలో బీజేపీ తరపున బీ.శ్రీరాములు, కాంగ్రెస్‌ పార్టీ తరపున తుకారం ఎన్నికల బరిలో ఉండటంతో ఇద్దరు సమఉజ్జీలే కావడంతో రెండు పార్టీలు గట్టి పోటీ పడుతున్నాయి. పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది.

నేడు ఇంటింటా ప్రచారం

రేపే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌

Advertisement
 
Advertisement