వినూత్న ప్రచారం | Sakshi
Sakshi News home page

వినూత్న ప్రచారం

Published Sun, May 5 2024 5:40 AM

వినూత

కర్నూలు(టౌన్‌): వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ బీసీ సెల్‌ కార్యదర్శులు లక్ష్మీకాంతయ్య, కె.నాగేశ్వరమ్మ, పార్టీ నాయకులు చంద్రకళబాయ్‌, చంద్రికమ్మ, మల్లేష్‌, మధు, శేఖర్‌లతో కలిసి ముఖాలకు మాస్క్‌లు ధరించి శనివారం రాత్రి వినాయక ఘాట్‌ వద్ద ఉన్న స్ట్రీట్‌ మార్కెట్‌లో ప్రచారం నిర్వహించారు. చిరు వ్యాపారులను కలసి ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్‌, పార్లమెంట్‌ అభ్యర్థి బీవై రామయ్యలను గెలిపించాలని కోరారు.

మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

బేతంచెర్ల: చైత్ర మాసం శనివారం సందర్భంగా బేతంచెర్ల ఆర్‌ఎస్‌ రంగాపురం శివారులో వెలసిన లక్ష్మీ గణమద్దిలేటి నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.12,19,345 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్‌, ఆలయ ఈఓ రామాంజనేయులు, చైర్మన్‌ రామచంద్రుడు తెలిపారు.

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం

సి.బెళగల్‌: మండలంలోని చింతమానుపల్లె గ్రామానికి చెందిన శ్రీదేవి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన వడ్డెరాజు, శ్రీదేవి దంపతులకు మొదటి సంతానంగా రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పులో భాగంగా శ్రీదేవిని శుక్రవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి ఆమెకు సిజేరియన్‌ చేయగా ముగ్గురు శిశువులకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ముగ్గురిలో ఒకరు బాలుడు కాగా.. ఇద్దరు బాలికలు ఉన్నట్లు తండ్రి వడ్డె రాజు తెలిపారు.

అప్పుల బాధతో ఆత్మహత్య

ఆలూరు: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలూరులోని కోయినగర్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఈడిగ తిక్కయ్య కుమారుడు ఈడిగ మనోజ్‌ గౌడు(35) బతుకు దెరువు కోసం ఆలూరుకు ఐదేళ్ల క్రితం భార్య పల్లవితో కలసి వచ్చారు. రూ. 40 లక్షలతో ప్రొక్లెయిన్‌ కొనుగోలు చేశాడు. కుటుంబ పోషణ కోసం అధిక వడ్డీకి అప్పు చేశాడు. వాటిని తీర్చే దారిలేక శుక్రవారం రాత్రి అందరూ నిద్రపోయాక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఉదయం నిద్రలేసేసరికి భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పల్లవి స్థానికుల సాయంతో కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఏఎస్‌ఐ చంద్రశేఖర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్‌ గౌడు కుటుంబాన్ని వైఎస్సార్‌సీపీ ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి బుసినె విరూపాక్షి, నాయకులు వైకుంఠం మల్లికార్జునచౌదరి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పద్మజ, జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరుశేఖర్‌, ఎంపీపీ రంగమ్మ పరామర్శించారు.

సింగరాజు పల్లెలో..

కొత్తపల్లి: మండలంలోని సింగరాజు పల్లె గ్రామానికి చెందిన రైతు మద్దిరాల లింగారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఐదు ఎకరాలతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండేవాడు. రెండేళ్లుగా నష్టాలతో రూ.6 లక్షల వరకు అప్పుఅయ్యింది. ఎలా తీర్చాలో తెలియక గత నెల 27న నందికుంట సమీపంలో పురుగు మందు తాగాడు. బంధువులు ఆత్మకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు. కోలుకోలేక శనివారం మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె, భార్య ఉన్నారు. భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఏఎస్‌ఐ బాబా ఫకృద్దీన్‌ తెలిపారు.

వినూత్న ప్రచారం
1/2

వినూత్న ప్రచారం

వినూత్న ప్రచారం
2/2

వినూత్న ప్రచారం

Advertisement
Advertisement