ప్రతిభకు గుర్తింపు ఏది? | Sakshi
Sakshi News home page

ప్రతిభకు గుర్తింపు ఏది?

Published Sun, May 5 2024 4:55 AM

ప్రతి

గోదావరిఖని: ప్రపంచస్థాయి రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. ఇందు లో పాల్గొనే ప్రతినిధుల ఎంపిక కోసం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 6న జరిగే ఇంటర్వ్యూ, పరీక్ష కోసం 33 మంది హాజరు కావాలని ఆయా గనుల అధికారులకు లేఖలు పంపించింది. అయితే యువకులు, అవార్డులు సాధించిన వారికి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి.

కొలంబియాలో పోటీలు..

● ఈసారి 13వ ఇంటర్నేషనల్‌ మైన్స్‌ రెస్క్యూ కాంపిటీషన్‌(ఐఎంఆర్‌సీ) పోటీలు కొలంబియాలో సెప్టెంబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తారు.

● ప్రపంచంలోని వివిధ దేశాల మైన్స్‌ రెస్క్యూ బృందాలు హాజరవుతాయి.

● రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీలకు సింగరేణిలోని రెస్క్యూ సభ్యులు రెండు దశాబ్దాలుగా హాజరవుతూ వస్తున్నారు.

● జాతీయస్థాయి పోటీల్లో డబుల్‌హాట్రిక్‌ సాధించిన సింగరేణి రెస్క్యూ ప్రతినిధులు.. అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటడం లేదు.

● ఇందుకు అంతర్జాతీయ స్థాయి నిబంధనలకు అనుగుణంగా శిక్షణ లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు.

నిధులు భారీగా వెచ్చించినా..

అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి రాజీపడకుండా భారీగా నిధులు మంజూరు చేస్తోంది. ఈపోటీల్లో పాల్గొనే సభ్యులకు శిక్షణ ఇస్తోంది. విదేశాలకు వెళ్లివచ్చేందుకు ఖర్చు భరిస్తోంది. ప్రత్యేక యూనిఫాం, షూలు, ఇతర ఏర్పాట్ల కోసమే రూ.50లక్షలకుపైగా ఖర్చు చేస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన పోటీల్లో కూడా సింగరేణి జట్టు పాల్గొంది. కానీ బహుమతులేవీ సాధించకుండానే వెనుదిరిగింది. ఆలిండియా మైన్స్‌ రెస్క్యూ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధిస్తున్న సింగరేణి జట్టు.. అంతర్జాతీయ పోటీల్లో ఎందుకు చతికిల పడిపోతోందనేది అంతుచిక్కకుండా ఉంది. మరోవైపు.. పోటీల్లో పాల్గొనే సభ్యులను ఎంపిక చేమడంలో నిబంధనలు పాటించడం లేదని, అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని పక్కనబెట్టి పైరవీలకు పెద్దపీట వేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విమర్శలు ఉన్నాయి.

అంతర్జాతీయ పోటీల సమాచారం..

● సెప్టెంబర్‌ 12 నుంచి 20వ తేదీవరకు ఐఎంఆర్‌సీ పోటీలు నిర్వహిస్తారు.

● ఇందులో పాల్గొనే రెస్క్యూ బ్రిగేడియర్ల ఎంపిక కోసం ఈనెల6న సింగరేణి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

● సంస్థలోని 33మందికి ఆహ్వానం పంపించింది.

● ఇందులో గత రెండేళ్లలో పాల్గొన్న బ్రిగేడియర్లు, టీం కోచ్‌లే ఉన్నారు.

● 12వ ఐఎంఆర్‌సీలో పాల్గొన్న వారికి ఈసారి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని పేర్కొంది.

● వంద మార్కుల ప్రశ్నల్లో 50మార్కులు లిఖిత పూర్వక, 40మార్కులు రెస్క్యూ స్కిల్స్‌, మరో 10మార్కులు అనుభవానికి కేటాయిస్తున్నారు.

● ఈసారి ఇంటర్వ్యూలకు పిలిచిన వారిలో కొందరు ఇప్పటికే పింఛన్‌ పొందుతూ ఈఏడాది చివరిలో ఉద్యోగ విరమణ చేసేవారూ ఉన్నారని తెలిసింది.

● రెస్క్యూలో ఉత్సాహంగా పాల్గొంటున్న యువత ను కావాలనే పక్కన పెట్టారని అంటున్నారు.

● తద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నేషనల్‌ మైన్స్‌ రెస్క్యూ బోర్డు(ఐఎంఆర్‌సీ) పోటీల్లో సింగరేణి

ఎప్పుడు ఏడాది దేశం సాధించిన బహుమతి

5వ సారి 2006 చైనా 1. ఫస్ట్‌ఎయిడ్‌లో ఓవరాల్‌ రెండోస్థానం

2. మైన్స్‌ రెస్క్యూలో ఐదోస్థానం

6వసారి 2008 అమెరికా గౌరవ గుర్తింపు అవార్డు

7వ సారి 2010 ఆస్ట్రేలియా ఫస్ట్‌ఎయిడ్‌లో ఓవరాల్‌ బెస్ట్‌

8వసారి 2012 ఉక్రెయిన్‌ 1. ఇంజినీరింగ్‌ అనాలసిస్‌లో 6వస్థానం

2. రెస్క్యూ ఈవెంట్స్‌లో 9వ స్థానం

9వ సారి 2014 పోలండ్‌ హాజరుకాలేదు

10వ సారి 2016 కెనడా గౌరవ గుర్తింపు

11వ సారి 2018 రష్యా హాజరు కాలేదు

12వ సారి 2020 – కోవిడ్‌తో పోటీలు నిర్వహించలేదు

13వ సారి 2022 అమెరికా గౌరవ గుర్తింపు

13వ సారి 2024 సెప్టెంబర్‌ 12నుంచి 20 కొలంబియా

అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు ప్రామాణికంపై అనుమానాలు

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

రేపు రెస్క్యూ పోటీల ఎంపిక ఇంటర్వ్యూలు

ప్రతిభావంతులకే పట్టం

మెరికల్లాంటి రెస్క్యూ సభ్యులను ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇప్పిస్తాం. నిధులు కేటాయించడంలో రాజీపడే ప్రసక్తేలేదు. బంధుప్రీతికి తావులేకుండా పారదర్శంగా ఎంపిక ఉండేలా ఆదేశాలు జారీచేస్తాం. సింగరేణి జట్టు ఐఎంఆర్‌సీలో పాల్గొనడం సంస్థకు గర్వకారణం. ప్రపంచస్థాయిలో సత్తా చాటితేలా అన్నిచర్యలు తీసుకుంటాం.

– ఎన్‌.బలరామ్‌, సింగరేణి సీఎండీ

ప్రతిభకు గుర్తింపు ఏది?
1/2

ప్రతిభకు గుర్తింపు ఏది?

ప్రతిభకు గుర్తింపు ఏది?
2/2

ప్రతిభకు గుర్తింపు ఏది?

Advertisement
 
Advertisement