ఆదాయం రూ.6 వేలు.. ఖర్చు 2 లక్షలు! | Sakshi
Sakshi News home page

ఆదాయం రూ.6 వేలు.. ఖర్చు 2 లక్షలు!

Published Sun, May 5 2024 4:55 AM

-

ఆదరణ కరువైన సిద్దిపేట–సికింద్రాబాద్‌ రైలు
● రోజుకు సగటున 250 మంది మాత్రమే ప్రయాణం ● ప్రస్తుతం కేవలం 40 కి.మీ వేగంతో నడుస్తున్న రైలు ● మూడుచోట్ల కొనసాగుతున్న వంతెనల పనులే కారణం ● బస్సు కన్నా గంటకు పైగా ఎక్కువ ప్రయాణ సమయంతో ఆసక్తి చూపించని ప్రజలు

సాక్షి, హైదరాబాద్‌: ఆ రైలు రోజుకు రెండు ట్రిప్పులు తిరుగుతోంది. ఆ రెండు ట్రిప్పుల్లోనూ అందులో ప్రయాణించే వారి సంఖ్య సగటున 250 మంది మాత్రమే. కాగా టికెట్ల రూపంలో రైల్వేకు రోజుకు వస్తున్న ఆదాయం కేవలం సుమారు రూ.6 వేలు. కానీ ఈ రెండు ట్రిప్పులకు అయ్యే నిర్వహణ వ్యయం ఎంతో తెలుసా? ఏకంగా రూ.2 లక్షలు! సికింద్రాబాద్‌ – సిద్దిపేట మధ్య తిరుగుతున్న డెమూ రైలు కథ ఇది. పరుగులు పెట్టాల్సిన ఈ రైలు షెడ్యూల్‌ ప్రకారం గానే అయినా దాదాపు నడుస్తున్నట్టు వెళ్లడమే ఈ పరిస్థితికి కారణం. నగరంలోని జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరే బస్సు 2.15 గంటల్లో సిద్దిపేటకు చేరుకుంటుంటే, ఈ రైల్లో మాత్రం ఇందుకోసం కనీసం 3 గంటల నుంచి మూడున్నర గంటల సేపు ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ రైలు సగటు వేగాన్ని అధికారులు గంటకు కేవలం 40 కిలోమీటర్లకే పరిమితం చేశారు. అందుకనే 116 కి.మీ (రైలు రూట్‌ కి.మీ. ప్రకారం) ప్రయాణానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు స్టేషన్‌ సిద్దిపేటకు దూరంగా ఉంది. దీంతో సిద్దిపేట నుంచి స్టేషన్‌కు రావాలన్నా, స్టేషన్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లాలన్నా ప్రత్యేకంగా ఆటోలో ప్రయాణించాల్సి వస్తోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు రైలు ఎక్కడం కంటే బస్సు బెటరని అటు మళ్లుతున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో కొనసాగింపు

రెండు ట్రిప్పుల్లో సగటున నాలుగైదు వేల మంది ప్రయాణించాల్సి ఉండగా 250 కూడా మించటం లేదు. సిద్దిపేటలో 30 మందికి మించి రైలు ఎక్కడం లేదు. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి సిద్దిపేట చేరుకునే సరికి అంతే సంఖ్యలో ప్రయాణికులు మిగులుతున్నారు. మధ్యలో ఉండే స్టేషన్లలో ఐదారుగురు చొప్పున ఎక్కి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రైల్లో 50–60 మంది ప్రయాణికులు కూడా ఉండటం లేదని సిబ్బంది చెప్పడటం ఈ రైలుకున్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఇలాంటప్పుడు రైల్వే దీనిని డిమాండ్‌ లేని సర్వీసుగా పరిగణించి రద్దు చేస్తుంది. కానీ భవిష్యత్తులో ఇది కరీంనగర్‌ (పెద్దపల్లి) వరకు సేవలు అందించాల్సిన సర్వీసు కావటంతో, ఇప్పుడు రద్దు చేస్తే మళ్లీ పునరుద్ధరించేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ, తదనంతర అనుమతులు రావడం లాంటి తతంగం ఉన్నందున తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రైలును కొనసాగిస్తోంది.

ఎందుకింత మెల్లగా..

మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట వరకు మార్గం సిద్ధం కావటంతో రైలు ప్రారంభించారు. కానీ మధ్యలో మూడు నాలుగు చోట్ల ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిద్దిపేట–జనగామ రోడ్డులో రంగధామపల్లి వద్ద ఆర్‌ఓబీ నిర్మాణం జరుగుతోంది. కొమురవెల్లి స్టేషన్‌ సమీపంలో ఆర్‌యూబీ నిర్మాణం కొనసాగుతోంది. కుకునూరుపల్లి వద్ద ఆర్‌ఓబీ ఇటీవలే పూర్తయింది. ఈ మూడు కీలక నిర్మాణాల కారణంగానే వేగాన్ని బాగా తగ్గించి రైలు నడుపుతున్నారు.

రోజుకు 1,800 లీటర్ల డీజిల్‌ ఖర్చు

ఇది ఎనిమిది కోచ్‌లుగా ఉండే రేక్‌. దీనికి రెండు పవర్‌ కార్‌లుంటాయి. ఒక్కో పవర్‌ కార్‌కు నాలుగు కోచ్‌లు అటాచ్‌ అయి ఉంటాయి. ఒక ట్రిప్పునకు (వెళ్లి రావడానికి) 900 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతోంది. రెండు ట్రిప్పులకు 1800 లీటర్లు ఖర్చవుతున్నాయి. ఇక ఈ సర్వీసు సిబ్బందికి ఒకరోజు జీతం రూ.20 వేలుగా ఉంటోంది. ఈ మొత్తం కలిపితే రోజుకు రూ.2 లక్షల ఖర్చవుతోంది.

ఆ దారి బాగు చేయండి

సిద్దిపేట, రైల్వేస్టేషన్‌కు మధ్య (ప్రధాన రహదారి) దాదాపు నాలుగు కి.మీ.దూరం ఉండటం ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. గుండ్ల చెరువు మీదుగా వెళ్తే ఒకటిన్నర కి.మీ.దూరమే ఉంటుందని, కానీ ఆ దారి మధ్యలో ధ్వంసం కావటంతో వాహనాల రాకపోకలు కుదరటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దారి బాగు చేస్తే తమకు కొంతవరకు సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు.

75 కిలోమీటర్లకు పెరగనున్న వేగం

ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల పనులను త్వరగా పూర్తి చేసి రైలు వేగాన్ని పెంచాలని ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో రైలు గరిష్ట వేగాన్ని 75 కి.మీ.కు పెంచాలని నిర్ణయించారు. అదే జరిగితే ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాలు తగ్గుతుంది. అప్పుడు రెండున్నర గంటల్లోనే రైలు గమ్యం చేరుతుందని, ప్రయాణికుల ఆదరణ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

రైలు వేళలు ఇలా..

● సిద్దిపేటలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి 10.15కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్‌లో ఉదయం 10.35కు బయలుదేరి మధ్యాహ్నం 1.45కు సిద్దిపేట చేరుకుంటుంది.

● సిద్దిపేటలో 2.05కు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.20కు చేరుకుంటుంది.

● సికింద్రాబాద్‌లో.5.45కు బయలుదేరి రాత్రి 8.45కు సిద్దిపేటకు చేరుకుంటుంది.

● మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్‌, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌, మనోహరాబాద్‌, నాచారం, బేగంపేట, గజ్వేల్‌, కొడకండ్ల, లకుడారం, దుద్దెడల్లో ఆగుతుంది.

Advertisement
 
Advertisement