రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్‌ గోబెల్స్‌ ప్రచారం | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్‌ గోబెల్స్‌ ప్రచారం

Published Sun, May 5 2024 5:00 AM

-

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని మేం 20 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. అది మా పార్టీ విధానమని స్పష్టంగా చెప్తున్నాం. మోదీ ప్రధాని అయ్యాక కొత్తగా ఏమీ దీనిని లేవనెత్తలేదు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులు కూడా తీర్పులిచ్చాయి. కానీ విపక్షాలు కావాలని బురద చల్లుతున్నాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున గోబెల్స్‌ ప్రచారానికి దిగాయి. దీనిపై ప్రధాని మోదీ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్ల రద్దు ఉండదని, రాజ్యాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అయినా బీజేపీపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ.. దాన్ని ఎన్నికల ఎజెండాగా తయారుచేసి పెట్టారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే మేం పదే పదే వివరణ ఇవ్వకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నాయి. ఇది మాదిగలకు అనుకూలం, మాలలకు వ్యతిరేకమనే ఆలోచన తప్పు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలాలు అందాలని కోరుకుంటున్నాం.

Advertisement
 
Advertisement