నాయకుల అప్రమత్తం | Sakshi
Sakshi News home page

నాయకుల అప్రమత్తం

Published Mon, May 6 2024 5:20 AM

నాయకుల అప్రమత్తం

సాక్షి, మహబూబాబాద్‌: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజార్టీ వచ్చింది.. మాకు ఎదురు లేదు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరిని పెట్టినా గెలుస్తారు.. మా అభ్యర్థి గెలుపు నల్లేరుమీద నడకే’ అని ఎన్నికల ప్ర చారాన్ని పెద్దగా పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు కీలక నాయకులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయలేదని పార్టీ రాష్ట్ర నాయకులు అసంతృప్తి వెల్లగక్కినట్లు ప్రచారం. అయితే ఈ షాక్‌ నుంచి తేరుకోకముందే కేసీఆర్‌ రోడ్‌షోకు జనం కిక్కిరిసిపోయి సక్సెస్‌ కావడంతో.. అసలు ఏం జరుగుతుందో అని కాంగ్రెస్‌ నాయకులు డైలమాలో పడినట్లు ఆ పార్టీ నాయకుల్లో చర్చగా మారింది. దీనికి తోడు నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారంతో మానుకోట పార్లమె ంట్‌లోని ప్రజాప్రతినిధులు ప్రచార తీరు మార్చుకోవాలని అధిష్టానం హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయి నాయకులు గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూ ప్రచారం ముమ్మురం చేశారు.

కేసీఆర్‌ రోడ్‌షోను చూసిన తర్వాత..

ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌ ఫ్యూహం మార్చుకొని అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు జిల్లా ప్రజలు నీరాజనం పట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో మానుకోట వీధులు గులాబీమయంగా మారాయి.జనాన్ని చూసిన కేసీఆర్‌ మురిసిపోయారు. ఎన్నడు లేని విధంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, ఎంపీ అభ్యర్థి మాలోత్‌ కవిత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ బస్సుపై వేసిన నృత్యాలు వారి సంతోషానికి అద్దం పట్టాయి. ఇదంతా చూసిన కాంగ్రెస్‌ నాయకుల్లో కలవరం మొదలైంది. నిన్నటి వరకు నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి ఊపులో ఉన్న సమయంలో సీఎం సభకు జనం వచ్చిన తీరు.. కేసీఆర్‌ సభకు జనం వచ్చిన తీరుపై బేరీజు వేసుకొని ఖంగుతిన్నట్లు తెలిసింది.

బల నిరూపణ అంటే ఓట్లు వేయించడమే..

జిల్లాలోని జరిగిన పరిణామాలు, సీఎం, మాజీ సీఎం సభలు జరిగిన తీరు, తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ సునాయసంగా గెలుస్తారనే చర్చ నుంచి.. ఏం జరుగుతుందో అనే చర్చ మొదలైంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోకవర్గంపై ప్రత్యేక చర్చ కూడా పెట్టినట్లు తెలిసింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ తుమ్మల నాగేశ్వర్‌రావు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఎవరు ఏం చేస్తారో.. తెలియదు.. మీకు వచ్చిన మెజార్టీని మళ్లీ తీసుకురావాలి.. మీ బలం నిరూపించుకోవడం అంటే.. ఓట్లు వేయించడమే...దీనిని బట్టే పార్టీలోని మీ ప్రాధాన్యత, నామినేటెడ్‌, ఇతర పదువుల అప్పగించడంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. దీంతో జిల్లాలో ఉన్న నాయకులు సీరియస్‌గా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా నిన్నటి వరకు పార్టీలో చేరికలపై ఉత్సాహం చూపని నాయకులు ఇప్పుడు చేరికలు కూడా మొదలు పెట్టారు. జిల్లాలోని ఓ మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడిని చేర్పించుకొని ఆ మండలాన్ని క్లీన్‌స్వీప్‌ చేయాలని కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు అర్థం అవుతుంది. అదేవిధంగా ప్రజాబలం ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నించాలని నాయకులనుఆదేశించినట్లు తెలిసింది. ఇలా ఏ అవకాశాన్ని కూడా విడిచి పెట్టకుండా.. ఓటు బ్యాంకు ‘చెయ్యి’ జారకుండా అప్రమత్తం అవుతున్నారు.

కేసీఆర్‌ రోడ్‌షో సక్సెస్‌తో కాంగ్రెస్‌ నేతల అలర్ట్‌

ప్రచారంలో నిమగ్నమైన ప్రజా ప్రతినిధులు

మళ్లీ చేరికలపై దృష్టి పెట్టిన నాయకులు

ఎవరికి వారుగా మెజార్టీ చూపించుకోవాలని టార్గెట్‌

Advertisement
Advertisement