ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం

Published Sun, May 5 2024 5:00 AM

ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం

నల్లగొండ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి డ్యూటీల కేటాయింపుపై ఉద్యోగుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఎన్నికల విధుల నుంచి కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పైరవీకారులు తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు మూడు నెలల్లో రిటైర్డ్‌ అయ్యేవారు, గర్భిణులు, బాలింతలు, గుండె జబ్బులు ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రం ఎన్నికల డ్యూటీలు వేశారు. కానీ ఆరోగ్యంగా ఉన్నవారికి, పలువులు యువకులకు మాత్రం డ్యూటీలు వేయలేదని తెలుస్తోంది. ఎన్నికల విధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ హరిచందన కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు కిందిస్థాయి అధికారుల నిర్వాకం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల విధులకు సరిపడా ఉద్యోగులకు లేనప్పుడు అందరూ తప్పనిసరిగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉన్న వారికి విధుల్లో మినహాయింపు ఇచ్చి, ఆనారోగ్యంతో ఉన్నవారికి విధులు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి.

నిబంధనలు పట్టని అధికారులు

ఆరు నెలల్లోపు రిటైర్డ్‌ అయ్యే ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ 2, 3 నెలల్లో రిటైర్డ్‌ అయ్యే వారికి కూడా అధికారులు డ్యూటీలు వేశారు. బాలింతలు, గర్భిణులు, నడవలేని వారి కూడా విధులు కేటాయించారు. దీంతో పలువురు వారి పరిస్థితిని వివరించి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులకు విన్నవించుకుంటే.. మొదటి విడత శిక్షణ సమయంలో రద్దు చేశారు. కానీ, తిరిగి రెండో విడత శిక్షణ నాటికి తిరిగి విధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారంగా ప్రస్తుత వేసవి, అనారోగ్యం దృష్ట్యా ఎన్నికల విధులు నిర్వహించలేమని ఆవేదన చెందుతున్నారు. మూడు నెలల్లో రిటైర్డ్‌ అయ్యే ఓ ఉపాధ్యాయుడికి ఎన్నికల డ్యూటీ వేయడంతో.. అతను డ్యూటీ క్యాన్సిల్‌ చేయాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. వారు రద్దు చేయకపోవడంతో హైకోర్టుకు వెళ్లి డ్యూటీ రద్దు ఆర్డర్‌ తెచ్చుకున్నాడు.

ఆరోగ్య సమస్యలున్నా విధులకు వెళ్లాల్సిందే..

గుర్రంపోడు పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు త్వరలో రిటైర్డ్‌ అవ్వబోతున్నారు. అదే మండలంలో మరో ఉపాధ్యాయుడికి ఇటీవల గుండెపోటు రావడంతో స్టంట్‌ వేశారు. నాంపల్లి మండలంలో మోడల్‌ స్కూల్‌లో పనిచేసే ఒక ఉపాధ్యాయుడికి ఓపెన్‌ హార్టు సర్జరీ అయ్యింది. దేవరకొండ మండలంలో ఓ చిన్న పాప ఉన్న ఉపాధ్యాయురాలికి డ్యూటీలు వేశారు. వీరంతా మినహాయింపు కోసం ఎన్నికల అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.

ఫ సంఘాల నాయకులు, పైరవీకారులకు మినహాయింపు

ఫ రెండు, మూడు నెలల్లో రిటైర్డ్‌

అయ్యే వారికి మాత్రం విధులు

ఫ దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి,

గర్భిణులు, బాలింతలకు కూడా..

ఫ డ్యూటీల కేటాయింపుపై ఉద్యోగుల నుంచి విమర్శలు

ఈ పాఠశాలల టీచర్లకు డ్యూటీలు పడలే..

నార్కట్‌పల్లి మండలంలోని శాపల్లి, నార్కట్‌పల్లి, అక్కినపల్లి, ఆవులోనిబావి, బ్రాహ్మణవెల్లెంల , నెమ్మాని , పోతినేనిపల్లి, మాండ్ర, ఏపీలింగోటం, కనగల్‌ మండలంలోని తేలకంటిగూడెం, పొనుగోడు, తుర్కపల్లి, బోయినపల్లి, అమ్మగూడెం, గుర్రంపోడు మండలంలోని కాచారం, పార్లపల్లి, కొత్తలాపురం, వడ్డెరగూడెం, కొప్పోలు, గుర్రంపోడు–2, చాపెల్లి, పాల్వాయి, లక్ష్మీదేవిగూడెం, పాల్వాయి–2, మొండికానిగూడెం, కొప్పోలు–2, పాఠశాలల్లో పనిచేసే కొందరు ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీకి మినహాయింపు ఇచ్చారు. అనుముల మండలంలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయిచంలేదు.

Advertisement
Advertisement