కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌ | Sakshi
Sakshi News home page

కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌.. లిక్కర్‌ కేసులో బెయిల్‌ నిరాకరణ

Published Mon, May 6 2024 12:09 PM

Delhi Liquor Case: BRS MLC Kavitha Bail Rejected

న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్‌ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్‌ కోర్టు  కొట్టేసింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్‌ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్‌ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్‌ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.

లిక్కర్‌ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆపై జ్యూడీషియల్‌ రిమాండ్‌ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్‌ చేసింది.  ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి  అక్రమార్జన  చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. 

మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్‌ గ్రూప్‌ సిండికేట్‌ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  

కల్వకుంట్ల కవితకు బిగ్‌ షాక్‌

వాదనలు ఇలా.. 

ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.

అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. 

ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! 

వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్‌ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ ముగియనుంది. బెయిల్‌ నిరాకరిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement