కంగనా దుస్తులపైనే అందరి దృష్టి! | Sakshi
Sakshi News home page

కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!

Published Mon, May 6 2024 2:11 PM

Kangana Ranaut Traditional Dress Catches Internet Social Media Users Attractions

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి నటి కంగనా రనౌత్‌ బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై పోటీ చేస్తున్నారు. హిమాచల్‌లో 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం మండీలో విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభా సింగ్ ఎంపీగా ఉన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇక్కడి నుంచి పోటీ చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కాగా కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రచారంలో సంప్రదాయ దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్  ఇటీవల కంగనా ధరిస్తున్న సంప్రదాయ దుస్తులపై కామెంట్‌ చేశారు. ఆమె ప్రజలను ఆకట్టుకునేలాంటి దుస్తులను తరచూ ధరిస్తున్నారని విక్రమాదిత్య సింగ్‌ ఆరోపించారు.

కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని భంబ్లా పరిధిలోగల జాహు నివాసి. మండిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కంగనా రనౌత్ సంప్రదాయ చీరలు, స్థానిక దుస్తులతో కనిపిస్తున్నారు. ఆమె కులులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు కుల్లవి వేషధారణలో కనిపించారు. ఇక్కడ ఈ తరహా దుస్తులకు ఎంతో ఆదరణ ఉంది.

ఆమె చంబాలోని భర్మౌర్‌ను సందర్శించినప్పుడు శామ్ చౌరాసి దేవాలయంలో పూజలు చేశారు. ఈ సమయంలో కంగనా చంబా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు.  ఆ సమయంలో ఆమె తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిన్నౌర్ జిల్లాలో ఆమె ప్రచారంలో పాల్గొన్నప్పుడు కిన్నౌరి శాలువా కప్పుకుని  అందరికీ కనిపించారు. ఆ వీడియోను  కంగన సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

సిమ్లాలోని రాంపూర్‌లో ప్రచారం సాగించినప్పుడు ఆమె  అక్కడి ప్రసిద్ధ భీమాకాళి ఆలయంలో పూజలు చేసి, బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆమె స్థానిక సంప్రదాయ దుస్తులలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ  సిమ్లా సంప్రదాయ దుస్తుల్లో కంగనా మెరుపు తీగలా ఉన్నారనే కామెంట్‌ వినిపించింది.  

ఇదిలా ఉండగా కంగనా రనౌత్ ప్రచార సభల్లో పాల్గొనేటప్పుడు డిఫరెంట్ డ్రెస్సుల్లో కనిపిస్తూ, అందరినీ ఆకట్టకుంటున్నారని విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు. ఆమె ప్రచార సభలను చూస్తుంటే ఆమె ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు అనిపిస్తోందని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement