Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా! | Sakshi
Sakshi News home page

Geetha Shivarajkumar: ‘గీత’ దాటినా... గీత మారేనా!

Published Sun, May 5 2024 4:21 AM

Lok sabha elections 2024: Guarantees will contribute to my victory, says Congress candidate Geetha Shivarajkumar

గీతా శివరాజ్‌కుమార్‌. కన్నడ ప్రజలకు  చిరపరిచితమైన పేరు. కన్నడ కంఠీరవ  రాజ్‌కుమార్‌ కోడలు. ప్రముఖ నటుడు  శివరాజ్‌కుమార్‌ భార్య. అంతేనా...? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు!  

రాజకీయ కుటుంబంలో పుట్టి కన్నడ సినీ  పరిశ్రమకు దిగ్గజాల వంటి తారలను  అందించిన ఇంటికి కోడలిగా వెళ్లారు.  అయినా పుట్టింటి వారసత్వం ఆమెను చివరికి  రాజకీయాల వైపు నడిపించింది. 2014లోనే రాజకీయ అరంగేట్రం చేసిన గీత ఇప్పుడు శివమొగ్గ లోక్‌సభ స్థానంలో బీజేపీ దిగ్గజం యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్రతో పోటీ పడుతున్నారు...

నిషేధాన్ని ఉల్లంఘించి..  
గీతకు 1986లో శివరాజ్‌కుమార్‌తో పెళ్లయ్యింది. తర్వాత కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యారు. తల్లి మరణానంతరం ఆమె నిర్వహించిన మైసూరులోని ‘శక్తిధామ్‌’ స్వచ్ఛంద సంస్థ బాధ్యతలు చూస్తున్నారు. చాలాకాలం భర్తకు స్టయిలిస్ట్‌గా కూడా చేశారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 

కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని రాజ్‌కుమార్‌ లక్ష్మణరేఖ గీశారు. దాంతో సినిమాల్లో ఎంత పాపులారిటీ సాధించినా ఆయన కొడుకులెవ్వరూ రాజకీయాల వైపే చూడలేదు. కానీ బాల్యం నుంచి ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం చూసిన గీతకు రాజకీయాలంటే మహా ఆసక్తి. ఆమెకు రెండేళ్లప్పుడు తండ్రి బంగారప్ప ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్ఫూర్తితో 2014లో గీత రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజ్‌కుమార్‌ భార్య పార్వతమ్మ వ్యతిరేకించారంటారు. 

తటస్థంగా ఉన్న కుటుంబాన్ని శివ రాజ్‌కుమార్, గీత వారి ఆకాంక్షల కోసం రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆమె ఆవేదన చెందినట్టు వార్తలొచ్చాయి. అయినా గీత పట్టించుకోలేదు. శివమొగ్గ లోక్‌సభ స్థానంలో జేడీ(ఎస్‌) అభ్యరి్థగా యడ్యూరప్పపై పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఓటమితో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. సోదరుడు మధు బంగారప్ప కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు శివమొగ్గ నుంచి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ రెండుసార్లు గెలిచిన సిట్టింగ్‌ ఎంపీ రాఘవేంద్రతో తలపడుతున్నారు. ఆయన విజయ పరంపరకు బ్రేకులు వేస్తానని ధీమాగా చెబుతున్నారు!

నీటి సమస్య పరిష్కారం తొలి ప్రాధాన్యత..  
శివమొగ్గలో నీటి కొరత తీర్చడమే తన మొదటి ప్రాథమ్యమని చెబుతున్నారు గీత. ‘‘నా సోదరుడు, ఇతర ఎమ్మెల్యేల సహకారంతో అనేక సమస్యలను పరిష్కరిస్తా. కాంగ్రెస్‌ పథకాలు నా విజయానికి దోహదపడతాయి. ‘‘గెలవగానే బెంగళూరు వెళ్లిపోతానన్న బీజేపీ ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తా. శివమొగ్గలో నాకు ఇల్లుంది. ఇక్కడ ఉండకుండా ఎక్కడకు పోతాను? బీజేపీ ఇకనైనా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలు మాని రైతులు, వెనకబడ్డ తరగతులు, ప్రజల కష్టాలపై మాట్లాడితే బాగుంటుంది. నేనెప్పుడూ నా బాధ్యతల నుంచి వెనక్కు తగ్గలేదు. శక్తిధామ్‌ సంస్థను చూసుకుంటున్నట్టుగానే శివమొగ్గ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తా. క్షేత్రస్థాయిలో వారికి అందుబాటులో ఉంటా’’ అని చెబుతున్నారు. భర్త శివరాజ్‌కుమార్‌ ప్రతిష్ట, తండ్రి బంగారప్ప మంచితనం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన శివమొగ్గలో తనను గెలిపిస్తాయని నమ్మకముందంటున్నారు.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement
Advertisement