అమెరికా : రిటైర్మెంట్‌ హోమ్స్‌.. మంచికా.? చెడుకా? | United States Of America Retirement Housing, Are Retirement Homes Good? Is It Bad? | Sakshi
Sakshi News home page

US : రిటైర్మెంట్‌ హోమ్స్‌.. మంచికా.? చెడుకా?

Published Thu, May 16 2024 4:44 PM

United States Of America  Retirement housing

అమెరికాలో పెద్ద వయసువారు ఏం చేస్తున్నారు? 

రిటైర్మెంట్ హోమ్స్ వైపే ఎందుకు చూస్తున్నారు? 

కుటుంబ వ్యవస్థ దెబ్బ తింటే జరిగేవి ఇవేనా? 

ఇండియాలో పరిస్థితి ఏంటీ?

పిల్లలు బయటి దేశాలకు వెళ్లి ఉద్యోగం / వ్యాపారం వంటి రంగాల్లో స్థిరపడితే ఎక్కడున్నా ముందుగా సంతోషించేవారు వారి తల్లిదండ్రులే. వీరు ఇక్కడ స్వదేశంలో ఎన్ని అవస్థలైనా పడుతూ బయటున్న పిల్లల ఫోన్ పలకరింపులకే మహదానందపడే మనస్తత్వం కలవారు. అక్కడ కూతురో, కోడలో గర్భవతి, ఆమె ప్రసవ తేది దగ్గర పడుతుందని తెలిస్తే చాలు, వాళ్ళ కన్నా ముందు ఇండియాలో నున్న వారి తల్లులకు నొప్పులు వస్తున్న రోజులువి. వద్దమ్మా ఎందుకు శ్రమపడతారు , మేము ఏదోలా మేనేజ్ చేసుకుంటామని అక్కడున్న పిల్లలు అన్నా కూడా ఈ ఇండియా తల్లులు ఊరుకోరాయే. 

ప్రసవం లేదా చంటిపిల్లల పెంపకం వంటి ఏవో అవసరాలకు ఇక్కడి నుంచి పేరెంట్స్ అటు, మోకాలు నొప్పులు కూడా మరిచిపోయి పరుగులు తీయడం, విమానం రెక్కలైనా పట్టుకొని తమ పిల్లల దగ్గర వాలిపోవడం ఇప్పుడు మామూలు విషయం అయిపోయింది. అమెరికా ఫాల్సమ్ ( కాలిఫోర్నియా ) లో మార్నింగ్ వాక్‌లో నేను చూసిన ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రవేశద్వారం దగ్గర పై సూక్తి నా కంటబడింది. 

‘Respect the old when you are young , 
help the weak when you are strong , 
confess the fault when you are wrong 
because one day in life you will be old , weak and wrong ! ‘ 

డిమోన్షియా వ్యాధిగ్రస్తులు..
ఆ హోమ్ లోని ఇన్మేట్స్ ఎవరూ , ఎప్పుడూ బయటకు రారేమిటని ఆరా తీస్తే తెలిసిన విషయం వాళ్లంతా అల్జీమర్స్ వ్యాధి బాధితులని. ఇలాంటివారు తీవ్రమైన మతిమరుపువల్ల బయటకు వెళితే తాము ఉంటున్న చిరునామానే కాదు ఒకోసారి స్వంత పేరు కూడా చెప్పలేరట. తెలిసినవారిని కూడా అయోమయంగా చూడడం, మాటల్లో పదాలు దొరకక తడబడడం, వర్తమానాన్ని మరిచి గతంలోకి వెళ్లిపోవడం, ఇంకా ఏదో ఆఫీసులో పనిచేస్తున్నట్లు తయారై బ్యాగ్ పట్టుకొని బయలుదేరడం వంటి పనులు చేయడం ఈ డిమెన్షియా రకం వ్యాధిగ్రస్తుల లక్షణాలుగా చెప్పారు. వీరికి ఆలోచన ఉండదు, కొత్తగా ఏదీ నేర్చుకోలేరు, దేన్నీ గుర్తుపెట్టుకోలేరని , వీళ్ళను జాగ్రత్తగా చూడాలని అక్కడున్నవారు చెప్పగా విన్న విషయం.

స్థాయిని అనుసరించి ఏదో ఒక హోమ్‌
అయితే వీళ్లకు, వీళ్ళేకాదు అంగవికలాంగులు, 65 సంవత్సరాలు అంతకు పైబడిన ఆ దేశ సీనియర్ సిటిజన్స్‌కు, లీగల్ ఇమ్మిగ్రాంట్స్‌కు కూడా వాళ్ళవాళ్ళ ఆదాయాన్ని బట్టి యూఎస్ సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ ఎస్‌ఎస్‌ఏ) నుంచి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. 65 అంతకు మించిన వయస్సు వారు అమెరికాలో 58 మిలియన్లు ( 2022 ) అనగా ఆ దేశ జనాభాలో దాదాపు 17 శాతం ఉంటారట. 

వీరిలో చాలామంది ముందుగానే పొదుపు చేసిన సొమ్ముతో తమ స్థాయిని బట్టి ఏదో ఒక రిటైర్మెంట్ హోంలో చేరక తప్పని పరిస్థితులు అక్కడున్నాయి. ఇలాంటి హోమ్స్‌లో భోజన, వసతి సౌకర్యాలే కాకుండా పెద్దవాళ్లకు కావలసిన సహాయ సిబ్బంది 24 గంటలు అందుబాటులో వుండడం, అత్యవసర సమయాల్లో శిక్షణ పొందిన మెడికల్ స్టాఫ్ వారిని దగ్గరున్న ఆస్పత్రులకు చేర్చడం జరుగుతుంది.  

డబ్బు ఉంటే ఎవరికి బరువు కాకుండా..
అక్కడ వాకింగ్ స్పేస్, ఎక్సర్ సైజ్, మసాజ్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్స్, కాలక్షేపానికి టీవీలు, పత్రికలు, పుస్తకాల వంటివి ఉండడమే కాకుండా మాటాముచ్చటకు తమలాంటి వాళ్ళ కొరత లేకపోవడం వల్ల చాలామంది వృద్దులు అమెరికాలో ఈ రిటైర్మెంట్ హో మ్స్‌నే ఇష్టపడుతున్నారట, అంత ప్రేముంటే పిల్లలు అప్పుడప్పుడైనా అథితుల్లా వాళ్ళే వచ్చి పలకరించకపోతారా అన్న ధీమాతో. ఇప్పుడు బయటిగాలి తగిలి మన దేశంలో కూడా స్టార్ హోటల్ వసతులతో పోటీపడే పెద్దవాళ్ళ విశ్రాంత గృహాల సంస్కృతి పెరిగిపోతుంది వాస్తవం. 

అయితే చేతిలో డబ్బుండాలి , ఎవరికీ బరువు కాకుండా ఉండడానికి ఎన్నో మార్గాలు ఈ రోజుల్లో, కష్టాలన్నీ వృద్ధాప్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులున్న పేదవర్గాలవారివే కావడం. అందుకే వయసులో ఉన్నప్పుడు పెద్దల బాగోగులు చూడడం, ధనికులు పేదలను ఆదుకోవడం, తప్పు జరిగితే ఒప్పుకోవడం అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పనివే ఇవన్నీ అని జ్ఞాపకం చేస్తున్న పై సూక్తి అందరికీ సదా స్మరామి ! 

Advertisement
 
Advertisement
 
Advertisement