హలో..ఓటెయ్యాలి..రండి..! | Sakshi
Sakshi News home page

హలో..ఓటెయ్యాలి..రండి..!

Published Sun, May 5 2024 5:25 AM

హలో..ఓటెయ్యాలి..రండి..!

● వలస ఓటర్లపై అభ్యర్థుల ఆశలు ● ప్రతి ఓటు కీలకంగా భావిస్తున్న ప్రధాన పార్టీలు ● ఒకరోజు ముందే వచ్చేలా రవాణా ఏర్పాట్లు ● గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం

వీరఘట్టం: సార్వత్రిక ఎన్నికలు సమీస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తుండగా వారికి మద్దతుగా కార్యకర్తలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఓటర్లను కూడగట్టడం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమని, ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. ఎన్నికల తేదీ సమీస్తుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. గెలుపు ఆశతో ఉన్న అభ్యర్థుల తరఫున బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల నియోజకవర్గం బాధ్యులు ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉండి ఉపాధి,ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. వారి బంధువులు, స్నేహితులు, తమ అనుచరులతో వలస ఓటర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి వారితో మాటలు కలుపుతున్నారు. హలో..మే 13న ఎలక్షన్‌ ఉందికదా..త్వరగా వచ్చేయండి. ఒకరోజు ముందుగానే ఊరికి వచ్చేలా రవాణా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరగా వచ్చేయండి అంటూ ఫోన్లు చేస్తున్నారు.

జిల్లాలో సుమారు 25 వేల మంది

వలస ఓటర్లు

పార్వతీపురం మన్యం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉపాధి, ఉద్యోగాల కోసం తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని హైదరాబాద్‌, రాయగడ, బరంపురం తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ముఖ్యంగా కురుపాం, పార్వతీపురం ప్రాంతాల్లో వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. మే 13 జరగనున్న పోలింగ్‌కు ఈ ఓటర్లను ఎలాగైనా తీసుకువచ్చేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.గత సార్వత్రిక ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా వలస ఓటర్లు జిల్లాకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వలస ఓటర్లు ఉన్న గ్రామాలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వారిని ఓటింగ్‌కు తీసుకురావడానికి అన్ని చర్యలూ చేపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వలస ఓటర్లను రప్పిస్తే తమ విజయావకాశాలు మెరుగుపడతాయనే ఆలోచనలో ఓటమి భయంతో ఉన్న టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే వలస ఓటర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement
Advertisement