● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్‌ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్‌ డిమాండ్‌ అంగన్‌వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు | Sakshi
Sakshi News home page

● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్‌ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్‌ డిమాండ్‌ అంగన్‌వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు

Published Sun, May 5 2024 3:35 AM

-

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఉమ్మడి కరీంనగర్‌ 13 అసెంబ్లీ, మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలతో భారీగా జనాభా ఉన్న సువిశాలమైన జిల్లా. ఇంతటి జనాభా ఉన్న పాత జిల్లాలో సామాన్యులు చట్టప్రకారం అందాల్సిన కనీస సదుపాయాలకు నోచుకోలేకపోతున్నారు. సామాజికపరంగా భద్రత కల్పించే అనేక రకాల సదుపాయాలను వివిధ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం కేంద్రం ప్రవేశపెట్టింది. ఇంతవరకూ ఆ సేవలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ పరిధిలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో అందడం లేదు. కొన్ని సేవలు నేటికీ అసంపూర్తిగానే అందుతున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు గెలిచాక ఆయా సమస్యలకు ఈ సారైనా పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈఎస్‌ఐ సేవలెక్కడ?

ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా మూడు రంగాల్లో కా ర్మికులు పనిచేస్తున్నారు. వీరు అనారోగ్యం పాలైతే వైద్యం అందించేందుకు కేంద్రం ఈఎస్‌ఐ ఆసుపత్రి సేవలు తీసుకొచ్చింది. రామగుండంలో చిన్న డిస్పెన్సరీ తప్ప జనాభాకు తగినట్లు ఇక్కడ ఈఎస్‌ఐ ఆసుపత్రి లేదు. అసలు ఆ ఆసుపత్రి ఉన్న విషయం కూడా చాలామంది తెలియకపోవడం గమనార్హం. ఈ సేవలు పొందాలంటే వరంగల్‌, హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30వేల మంది ప్రైవేటు టీచర్లు వివిధ స్కూళ్లలో పని చేస్తున్నారు. కానీ, వీరిలో 50శాతంపైగా మందికి ఎలాంటి పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలు లేవు. 1,000 వరకు ఉన్న రైసుమిల్లుల్లో 20వేలకు పైగా కార్మికులు ఉన్నారు. అలాగే దాదాపు లక్షా తొంబై వేల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 370 వరకు గ్రానైట్‌ క్వారీల్లో 25వేల వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి సరైన పీఎఫ్‌, ఈఎస్‌ఐ సేవలు అందడం లేదు.

వేతన సవరణతో సేవలకు దూరం

ఆపద కాలంలో కనీసం హైదరాబాద్‌లో అయినా ఈఎస్‌ఐ సేవలు పొందే వీలుండేది. 2015లో రూ.15,000 ఉన్న వేతన పరిమితిని కేంద్రం రూ.2,1000కు పెంచింది. అప్పటి నుంచి అదే కొనసాగుతోంది. కానీ, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు గత కేసీఆర్‌ ప్రభుత్వం 30శాతం వేతనం పెంచింది. దీంతో చాలామంది కార్మికుల వేతనాలు రూ.21,100 దాటాయన్న కారణంతో ఈఎస్‌ఐ సేవలకు దూరమయ్యారు. మారుతున్న కాలానికి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25వేలకు పెంచాలన్న కార్మికుల డిమాండ్‌ ఇంకా అమలుకు నోచుకోలేదు.

అంగన్‌వాడీ ప్రతిపాదనలేవి?

పిల్లలకు సరైన పోషకాహారంతోపాటు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించే అంగన్‌వాడీ కేంద్రాలు..పేద, సామాన్యుల పాలిట వరం. మన రాష్ట్రంలో దాదాపు 37,500 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి పెరుగుతున్న జనాభా, వెలుస్తున్న కొత్త కాలనీలకు అనుగుణంగా కొత్త అంగన్‌వాడీ కేంద్రాలను ఆన్‌ డిమాండ్‌ పద్ధతిలో ఏర్పాటు చేయాలని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పింది. అయినా, ఈ కేంద్రాల అమలుకు ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు ఆశించినంత స్థాయిలో చొరవ తీసుకోవడం లేదు.

కేంద్రం ఆధ్వర్యంలో నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎస్‌డీసీ) కింద ఏర్పాటు చేయాల్సిన నైపుణ్య శిక్షణ కేంద్రాలు మన వద్ద లేకపోవడం గమనార్హం.

అలాగే 13 నియోజకవర్గాల్లో జరుగుతున్న సివిల్‌ పనుల్లో 0.1 శాతం మొత్తాన్ని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (న్యాక్‌)కు జమవుతుంది. ఆ మొత్తాన్ని వివిధ సివిల్‌ పనుల్లో శిక్షణ ఇచ్చేందుకు గ్రాడ్యుయేట్‌ ఫినిషింగ్‌ స్కూల్‌ కోసం వెచ్చిస్తారు. అలాంటి శిక్షణ కేంద్రం ఉమ్మడి జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేసినా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినవారవుతారు.

కేంద్రం పరిధిలోని నేషనల్‌ మైనార్టీస్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో రాష్ట్రం సమన్వయం చేసుకోని కారణంగా ఇక్కడ మైనార్టీలకు సరైన ఆర్థికసాయం అందడం లేదు. మైనార్టీ సంఖ్యను చూసినప్పుడు కరీంనగర్‌లో 1,29,000, పెద్దపల్లిలో 70,000పైగా, నిజామాబాద్‌లో 3,00,00 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ముస్లింలు అధికభాగం ఉండగా, మైనార్టీలు, సిక్కులు తదితరులు మిగిలిన సంఖ్యలో ఉన్నారు. ఈసారి గెలిచే ఎంపీలైనా మైనార్టీల ఆర్థికసాయానికి చొరవ తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement