ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?: మాచర్ల సిద్ధం ఎన్నికల భేరీలో సీఎం జగన్‌

Published Mon, May 6 2024 2:28 PM

AP Elections 2024: AP CM Jagan Public Meeting Speech at Macherla

పల్నాడు, సాక్షి: మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదని, మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారాయన.  సోమవారం మధ్యాహ్నాం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

మాచర్ల.. సిద్ధమేనా?. ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులు, ప్రేమా ఆప్యాయతలే కనిపిస్తున్నాయి. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్‌ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం కనిపిస్తోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే.

చంద్రబాబుకి ఏరోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదు. సాధ్యంకాని రీతిలో ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలు.. ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయి. కానీ, ఈ బిడ్డ జగన్‌ పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో.. 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని అక్కచెల్లెమ్మల కుటుంబాల బాగుండాలని వివిధ పథకాల రూపంలో 130 సార్లు బటన్‌ నొక్కాడు. మీ బిడ్డ తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేది చూశాం. మొట్టమొదటిసారిగా ఆ చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు నెరవేర్చాం.  2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చేశాం.

ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. 


నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు  అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?

నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.

స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర,  నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?

పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని.. పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్‌. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.

గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.

గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్‌. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్‌లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని అడుగుతున్నాను. మునుపెన్నడూ చూడని విప్లవాలు.. మీ బిడ్డ పాలనలోనే జరిగాయి.

మరో పక్క.. 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటైనా మంచి గుర్తుకు వస్తుందా?. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. 
అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో.. 2014లో ఇచ్చిన పాంప్లెట్‌ చూస్తే మీకే అర్థమవుతుంది.

ఈ పాంప్లెట్‌ గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురు పెద్దల ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికీ పంపించారు. వాళ్ల ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టించారు.  2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?..

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ జరిగిందా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో కనీసం ఒక్క రూపాయి చంద్రబాబు వేశాడా?..

ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?.

అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అన్నారు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నా.. ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌, చేనేత పవర్‌ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. జరిగిందా?. విమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు.. జరిగిందా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నారు.. జరిగిందా?. నేను మీ అందరినీ అడిగేది ఒక్కటే సాక్షాత్తు చంద్రబాబు సంతకం.. 2014లో స్వయంగా మీ ఇంటికి పంపారు. ముఖ్యమంత్రిగా పాలించారు. మరి ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?.

ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?: సీఎం జగన్‌

ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ.. మళ్లీ ఇదే చంద్రబాబు. ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట. సూపర్‌ సిక్స్‌ అంట.. నమ్ముతారా?, సూపర్‌ సెవెన్‌ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.

ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్‌ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్‌ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.

మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఎంపీ అభ్యర్థిగా అనిల్‌  కుమార్‌ యాదవ్‌లపై‌పై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచాలని, ఓటేసి గెలిపించుకోవాలని సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.

Advertisement
Advertisement