తారస్థాయికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌ | Sakshi
Sakshi News home page

తారస్థాయికి చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌

Published Sun, May 5 2024 4:03 AM

Chandrababu Frustration to the max

జగన్‌కు ఉరేయాలంటూ నూజివీడు, దర్శి, కాకినాడఎన్నికల ప్రచార సభల్లో ప్రజలకు పిలుపు 

ముఖ్యమంత్రి, మోసగాడు, అహంకారి, సైకో, బందిపోటు అంటూ తిట్ల దండకం 

ఓటమి ఖాయమని తెలియడంతో సీఎం జగన్‌పై దూషణల పర్వం
 

నూజివీడు/దర్శి/బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)/కరప/కాకినాడ సిటీ: ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజురోజుకు తన స్థాయిని మర్చిపోయి రెచ్చిపోతున్నారు. ఆయన, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ నిర్వహిస్తున్న సభలకు ప్రజాస్పందన లేకపోవడం, వచ్చే ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తప్పదని స్పష్టం కావడంతో ఆయన ఫ్రస్ట్రేషన్‌ తారాస్థాయికి చేరుతోంది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.

కొద్దిరోజుల క్రితం జగన్‌ను చంపేస్తే ఏమవుతుందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు శనివారం నూజివీడు, దర్శి, కాకినాడల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మరింత రెచ్చిపోయారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయనకు ప్రజలు ఉరేయాలని పిలుపునిచ్చారు. సీఎంపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. దూషణలపర్వానికి దిగారు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని తేలడంతోనే ఇలా దిగజారి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఐదేళ్ల అరాచకానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి.. 
రాబోయే ఎన్నికల్లో జగన్‌ ఐదేళ్ల అరాచకానికి ప్రజలు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరారు. ఏలూరు జిల్లా నూజివీడు, ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సీఎం లుచ్ఛా ముఖ్యమంత్రి, మోసగాడు, అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, బందిపోటు దొంగ, నియంత అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల సంపద అంతా తన దగ్గరే ఉండాలనుకుంటారని మండిపడ్డారు. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో వైఎస్సార్‌సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఈ సైకో ముఖ్యమంత్రిని సాగనంపాలన్నారు. ఈ సైకోకు తోడు కాకినాడ సిటీలో మరో సైకో ఉన్నాడన్నారు. కాకినాడను గంజాయి కేంద్రంగా, డ్రగ్స్‌ క్యాపిటల్‌గా, దొంగ బియ్యం అక్రమ రవాణా కేంద్రంగా తయారు చేశారన్నారు. జగన్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి బినామీ అని విమర్శించారు. ‘భూమి మీదా.. జగన్‌దా.. జగనన్న భూహక్కు చట్టం అంటా తమ్ముళ్లూ.. మీ భూమి మీద జగన్‌ కన్నుపడింది’ అని ఆరోపించారు. 

భవిష్యత్‌లో భూముల రికార్డ్స్‌ ఏమీ ఉండవని, జిరాక్స్‌ కాపీలే ఇస్తారని, వాటితో ముడ్డి తుడుచుకోవడమేనని చెప్పారు. అమెరికాలో ఉన్న జగన్‌ బినామీ కంపెనీకి జిరాక్స్‌ కాపీలను స్టోర్‌ చేసే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ల్యాండ్‌టైట్లింగ్‌ చట్టం నల్ల చట్టమని, మీ భూమిని కాజేసే చట్టమని, దొంగోడు, బూచోడు మనందరి భూమిపై కన్నేశాడని తీవ్ర విమర్శలు చేశారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని, 25 ఏళ్ల క్రితం సెల్‌ఫోన్‌ తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశానన్నారు. 

దుర్మార్గుడు సర్వనాశనం చేశాడు.. 
జగన్‌ మెడకు ఉరేసే అవకాశం ఉందని.. మే 13న జగన్‌ పార్టీకి, ఫ్యాన్‌కు ఉరివేయాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిని దేశంలోనే నంబర్‌వన్‌ చేయాలనుకున్నానన్నారు. అయితే దుర్మార్గుడు వచ్చి మూడు ముక్కలు ఆడి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు. అమరావతి వచ్చి ఉంటే నూజివీడు పక్కనే ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెళ్లేదన్నారు. టీడీపీని గెలిపిస్తే నూజివీడును కృష్ణా జిల్లాలో కలుపుతానన్నారు. 

వలంటీర్లను ప్రజలకు సేవ చేసేందుకు పెట్టండి కానీ రాజకీయాలకు కాదని తానే చెప్పానని చంద్రబాబు తెలిపారు. వలంటీర్లను పింఛన్ల  విధుల్లో పెట్టవద్దన్నది తానేనని చెప్పారు. పేదలపై కక్ష కట్టి ఏప్రిల్‌లో 33 ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ జలగ సైకో అని ధ్వజమెత్తారు. కాగా నూజివీడుకు వచ్చిన చంద్రబాబు జనం లేక 40 నిమిషాలపాటు బస్సులోనే వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. కాకినాడలోనూ జనం హాజరుకాలేదు. దీంతో నాయకులపై చంద్రబాబు మండిపడ్డట్టు తెలిసింది.

సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ అభిమానుల ఫ్లెక్సీలు 
దర్శి సభలో సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘జై జూనియర్‌ ఎన్టీఆర్‌.. సీఎం కావాలి జూనియర్‌ ఎన్టీఆర్‌’ అంటూ చంద్రబాబు ముందే నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు పక్కన ఉన్న నేతలు ఫ్లెక్సీ దించి పక్కకు పోవాలని హెచ్చరించినా అభిమానులు నినాదాలు చేశారు. దీంతో కింద ఉన్న కేడర్‌ వారిని బలవంతంగా అక్కడ నుంచి పంపేశారు. 

Advertisement
Advertisement