Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా? | Sakshi
Sakshi News home page

Pawan Kalyan: రాజకీయ అజ్ఞాని అని ఒప్పుకున్నట్లేనా?

Published Thu, Apr 25 2024 3:16 PM

Ksr Comments On Pawan Kalyan Politial Stratagy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలలోకి ఎందుకు వచ్చినట్లు! ఆయన ఏమి సాధించినట్లు! ఆయన ఏమి మాట్లాడుతున్నట్లు! ఎవరి కోసం ఆయన పని చేస్తున్నట్లు! ఎవరో ఒకరిని ద్వేషించడానికి అయితే రాజకీయాలలోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. సమాజానికి ఏదో రకంగా సేవ చేయడానికి రాజకీయాలలోకి రావాలని అనుకుంటారు. కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి, వేరే పార్టీ నేత కోసం నిత్యం పరితపించే వ్యక్తిగా పవన్‌ దేశంలోనే ఒక రికార్డు సాదించినట్లు అనిపిస్తుంది. పవన్‌ కల్యాణ్‌ తీరుతెన్నులు చూశాక ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు పవన్‌ కల్యాణ్‌ అవసరం ఎంత మాత్రం లేదనిపిస్తుంది. ఆయనకు ఒక సిద్దాంతం లేదని, పద్దతి పాడు లేదని అడుగడుగున అందరికి తెలిసిపోతుంది. అందుకే ఆయన రాజకీయాలలో రాణించలేకపోతున్నారని భావించాలి.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయనకు ద్వేషం ఉండవచ్చు. ఆయనను అర్జంట్‌గా పదవి నుంచి దించేయాలన్నంత కోపం ఉండవచ్చు. అందుకోసం ఆయన ప్రయత్నిస్తే తప్పేమీ కాదు. కానీ జగన్‌ను అసలు ఎందుకు పదవి నుంచి దించాలన్నదానిపై ఆయనకు ఒక స్పష్టత ఉండాలి కదా! తనపార్టీని తానే నాశనం చేసుకుని, తన పార్టీవారిని తానే అవమానించి బయటకు వెళ్లగొడుతున్న అరుదైన రికార్డు ఉన్న పవన్‌ కల్యాణ్‌కు ఏవిషయంలోను స్పష్టత ఉండదు. అలాంటప్పుడు జగన్ విషయంలో ఏమి క్లారిటీ ఉంటుంది! జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆయనకు వ్యతిరేకత ఉందా? వలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవి నచ్చలేదా! ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రత్యేక నీటి పథకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తేవడం పవన్‌కు ఇష్టం లేదా? జగన్ విధానాలు నచ్చకపోతే ఫలానాది బాగాలేదు.. తాము దానికి ప్రత్యామ్నాయం ఇది సూచిస్తున్నానని చెప్పవచ్చు.

కానీ అలా ఎన్నడైనా చేశారా! సముద్ర తీరంలో జగన్ నిర్మిస్తున్న ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, విద్యుత్, తదితరరంగాలలో కొత్తగా తెస్తున్న పరిశ్రమలు ఇష్టం లేదా! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ వంటివారికి వీటిని అడ్డుకోవడం ద్వారా ఒక లాభాన్ని ఆశిస్తున్నారు. వాటిపై దుష్ప్రచారం చేయడం ద్వారా తమకు రాజకీయ లబ్ది కలగాలని వారు కోరుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వాన్ని నడపవచ్చన్నది రామోజీ, రాధాకృష్ణల కుట్ర. కానీ, అందులో పవన్‌ కల్యాణ్‌కు అసలు పాత్రే ఇవ్వరు కదా. మహా ఇస్తే ఒక ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టుకోమంటారు తప్ప ఇంకొకటి కాదని అంతా భావిస్తారు. ఈ మాత్రం దానికి పవన్‌ కల్యాణ్‌ తన ప్రతిష్టను అంతా పణంగా పెట్టి తన పార్టీని తాకట్టు పెట్టి. తనవారందరిని నట్టేట ముంచి చంద్రబాబు పాదాల వద్ద రాజకీయ బానిసత్వం చేయడం దేనికో ఆయన అభిమానులకు కూడా అంతు పట్టదు.

ఈ మద్యకాలంలో పార్టీ నుంచి బయటకు వస్తున్న అనేక మందినేతలు ఎలా వాపోతున్నారో కనబడుతూనే ఉంది కదా! శాసనసభ ఎన్నికలలో పార్టీ తరపున పోటీచేసే అవకాశం వస్తుందని నమ్మిన పలువురు నేతలు కోట్లు ఖర్చు పెట్టారట. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వారిని తూర్పు తిరిగి దండం పెట్టుకోండని చెప్పి, ఆయన మాత్రం పడమర వైపు తిరిగి చంద్రబాబుకు సరెండర్ అయిపోయారు. తత్పలితంగా పార్టీని కేవలం పది, పరకా సీట్లకే పరిమితం చేశారు. మిగిలిన చోట్ల లక్షలు, కోట్లు వ్యయం చేసిన నేతలంగా నిండా మునిగిపోయారు. బుద్ది తక్కువై పవన్‌ను నమ్మామని వారు చెబుతున్నారు. ఇందులో తెలుగుదేశం నేతల్నీ తప్పు పట్టలేం. ఎందుకంటే వారంతా చాలాకాలం నుంచి ఒకే మాట చెబుతున్నారు. పదో - పరకో సీట్లు పడేస్తే పవన్‌ కల్యాణ్‌ తాము చెప్పినట్లు పడి ఉంటారని వారు అంటూ వచ్చారు. ఈ విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ ఒక సభలో చెప్పి, తాను పదోపరకకో లొంగుతానా? అంటూ మాట్లాడితే జనసేన వారంతా బాగా మాట్లాడారులే అనుకున్నారు.. కానీ ఆయన చివరికి పది సీట్ల కోసం టీడీపీకి సరెండర్ అయ్యారు. పేరుకు ఇరవైఒక్క సీట్లు అయినా, పది సీట్ల వరకు చంద్రబాబు పంపించిన టీడీపీ నేతలకే పవన్ సీట్లు ఇచ్చారు.

ఈ మాత్రం దానికి పార్టీ ఎందుకు? వారాహి భోషాణం దేనికి, ఎవరి కోసం బిల్డప్? అసలు తెలుగుదేశంలో విలీనం చేసేస్తే సరిపోయేది కదా అని జనసేనను నమ్మి నాశనం అయినవారు అడుగుతున్నారు. వారిది అరణ్యరోదనగా మిగిల్చిన పవన్‌ కల్యాణ్‌ ప్రతి విషయంలోను చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నారు. చంద్రబాబు తెలివిగా పవన్‌ కల్యాణ్‌ను పది సీట్లకే పరిమితం చేసి జనసేనను పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో ఇంతకాలం తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నానని, చంద్రబాబుకు సమానంగా ఆయన పక్కనే నడుస్తున్నానని చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌ను అసలు ఆ రేసులో లేకుండా చేసుకున్నారు. తద్వారా తాను, లేదా తన కుమారుడు లోకేష్‌లు మాత్రమే.. ఒకవేళ అవకాశం వస్తే సీఎం పదవి చేపట్టడానికి వీలుగా పవన్‌ను లొంగదీసుకున్నారు.

పవన్ కూడా ఒక ఎమ్మెల్యే పదవి వస్తే మహద్బాగ్యం అంటూ పిఠాపురంలో ఒక నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతను బతిమలాడుకుంటున్న తీరు ఆయన రాజకీయాలకు పనికిరాడని రుజువు చేస్తుంది. తనపార్టీవారిని గెలిపిస్తారని అనుకు్న్నవారికి భ్రమలు తొలగిస్తూ పవన్‌ కల్యాణ్‌ తను గెలుపుకోసం పిఠాపురంలో టీడీపీ నేత కాళ్లావేళ్లా పడుతున్నారు. ఇలా తన రాజకీయ పార్టీని తానే నాశనం చేసుకున్న పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి జగన్ పై ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆయన మాట తీరు చూస్తే రాజకీయాలలో ఏ మాత్రం పరిణితి లేని అజ్ఞాని అన్న సంగతి పదే, పదే అర్ధం అవుతుంది. జగన్ తనకు తానే దండలో రాయి పెట్టుకుని కొట్టుకున్నారట! ఏ మాత్రం ఇంగితం ఉన్నవారైనా ఇలా మాట్లాడతారా! లోకేష్ పిచ్చి వ్యాఖ్యలకు, పవన్ బుర్ర తక్కువ కామెంట్లకు తేడా ఏమీ కనిపంచదు. చంద్రబాబే అతి తెలివితో ముందుగా తానేదో ఖండించినట్లు నటించి, ఆ తర్వాత గులకరాయి తగిలిందంటూ డబుల్ టాక్ చేశారు.

పవన్‌ కల్యాణ్‌కు ఆ మాత్రం కూడా కుట్ర తెలివితేటలు కూడా లేవు. చంద్రబాబు ఏది చెబితే అదే తాను కూడా వంత పాడి గులకరాయి స్వరం ఎత్తుకున్నారు. జగన్‌కు తగిలింది గ్రానైట్ రాయి అని, పొరపాటున అది నవరగంతకు తగిలినా, కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగేది! అంతదాకా ఎందుకు ఒక గులకరాయిని తీసుకుని తమవాళ్లతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కొట్టించుకు చూస్తే దాని పవర్ ఏమిటో తెలుస్తుంది. జగన్‌కు ఆ రకంగా గాయమైతే కనీసం సానుభూతి తెలపకపోగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏవేవో నేరాలు జరిగాయట. అప్పుడు ఎవరూ స్పందించలేదట. సమాజంలో జరిగే నేరాలకు, ముఖ్యమంత్రిపై దాడికి లింకు పెట్టి మాట్లాడడంలోనే పవన్‌ కల్యాణ్‌ అజ్ఞానం తెలుస్తుంది.

సుగాలి ప్రీతి హత్య గురించి మాట్లాడారు. అది ఎప్పుడు జరిగింది.. చంద్రబాబు పాలన టైమ్ లోనే కదా! మరి అలాంటి చంద్రబాబుతో ఎందుకు జత కట్టారు! వివేకానంద రెడ్డి హత్య ఎప్పుడు జరిగింది! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేగా! అప్పుడు శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని పవన్ అన్నారా! పైగా వివేకా కూతురు సునీత నాలుక మడతేసి చెబుతున్న అసత్యాలను ఈయన ఎత్తుకున్నారు. సునీతే తన తండ్రి హత్య జరిగిన రోజుల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు కదా! ఆ తర్వాత కాలంలో, హత్య తానే చేశానని చెప్పుకుంటున్న వ్యక్తికి ఈమె ఎందుకు బెయిల్ ఇప్పించారు! ఈ విషయాలేవీ పవన్‌కు పట్టవా! ఏదో ఒకటి జగన్ పై బురద వేసి చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న వ్యక్తికి ఎవరు రాజకీయాల గురించి చెప్పాలి.

మళ్లీ ముప్పైవేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ పిచ్చి వాగుడు. అదే నిజమని నమ్మితే వలంటీర్ల వ్యవస్థను తీసివేస్తామని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు చెప్పడంం లేదు? చంద్రబాబు అయితే యూటర్న్‌ తీసుకుని వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెబుతున్నారే! జగన్ అమలు చేస్తున్న స్కీములను తామూ అమలు చేస్తామని చెప్పడం ద్వారా తాము ఎంత బలహీనంగా ఉన్నది వీరిద్దరూ తెలియచేస్తున్నట్లే కదా! జగన్‌పై జరిగిన దాడి లేదా హత్యాయత్నం ఘటనలో తొలుత పవన్ సోదరుడు నాగబాబు కొంత అభ్యంతరకరంగా వ్యాఖ్యానించినా, ఆ తర్వాత సర్దుకుని దాడిని ఖండించారే.

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, దాడి హేయమని ఖండించారు కదా! నాగబాబుకు దాడి ఎలా కనిపించింది? పవన్‌ కల్యాణ్‌కు ఎందుకు కనిపించలేదు! అంటే పవన్‌ కల్యాణ్‌ పిచ్చి మాటలుమాట్లాడుతున్నారని తేలిపోవడం లేదా! పవన్‌కు నాగబాబు ఇచ్చిన స్టేట్ మెంటే జవాబుగా కనిపిస్తుంది కదా! అంటే నాగబాబుకు ఉన్న విజ్ఞత కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదనే అనుకోవల్సిందే కదా! పవన్‌ కల్యాణ్‌ హుంకరింపులు, గంతులు, ఆవేశం నటిస్తూ ఊగిపోవడాలు ఇవన్ని చూసిన తర్వాత మనందరికి ఒక స్పష్టత వస్తుంది కదా! ఈయన రాజకీయాలకు ఏ మాత్రం తగడని. వ్యక్తిగత జీవితంలో అనైతిక ప్రవర్తనతో పాటు, ఇలాంటి అజ్ఞానంతో రాజకీయాలు చేయడం ఎంత ప్రమాదకరం! ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరికలు సిగరెట్ల మీద, మందు బాటిళ్ల మీద ఉంటాయి. అలాగే పవన్‌ కల్యాణ్‌ పాలిటిక్స్ రాజకీయ సమాజానికి, ఏపీ ప్రజలకు ప్రమాదకరమని అనిపించడం లేదా!


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
Advertisement