మోదీ మాస్టర్‌ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్‌ | Sakshi
Sakshi News home page

మోదీ మాస్టర్‌ ప్లాన్‌లో బకరాలైన బాబు, పవన్‌

Published Sun, May 5 2024 11:49 AM

Ksr Comments On TDP, Janasena Manifesto

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతోంది. తాము ఏమి చేస్తామో చెప్పలేకపోతున్నారు. పాజిటివ్ కాంపెయిన్ కన్నా నెగిటివ్ కాంపెయిన్‌కే ప్రాధాన్యం ఇస్తూ సాగుతున్నారు. దీనివల్ల జనంలో అంత ఆదరణ కనిపించడం లేదు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌‌ కల్యాణ్‌లు సంయుక్త మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు బీజేపీ నేత సిద్దార్ధ్ సింగ్‌ ఆ మేనిఫెస్టోని పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం బాగా డామేజ్ చేసింది. అంతకు మించి ఇప్పుడు మరో అంశం కనబడుతోంది. కూటమి పక్షాన ఇస్తున్న ప్రచార ప్రకటనలు రెండు రకాలుగా ఉంటున్నాయి. 

ఒకటి టీడీపీ పక్షాన చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలలో ఏదో ఒక దానిని పెట్టి చంద్రబాబును మళ్లీ రప్పిద్దాం అంటూ ప్రకటన ఇచ్చారు. అందులో ఎక్కడా టీడీపీ వాగ్దానాలకు ప్రధాని మోదీ‌, జనసేన అధినేత పవన్‌‌ కట్టుబడి ఉంటామని చెప్పడం లేదు. అంటే ఇది కేవలం టీడీపీ దే తప్ప కూటమిది కాదన్న అర్ధం వస్తుంది. అలాగే పవన్‌‌ మేనిఫెస్టోలో భాగస్వామి అయిఇనప్పటికీ, కొన్నిసార్లు ఆయన ఫోటో కూడా వాడడం లేదు.

మరో ప్రచార ప్రకటన గమనించండి. అది బీజేపీ అడ్వర్వైజ్ మెంట్. అందులో పైన ప్రధాని మోదీ‌ ఫోటటో ఉంటే, కింద, చంద్రబాబు, పవన్‌‌ల పోటోలు వేసుకున్నారు. ఆ పక్కనే మోదీ‌ గ్యారంటీకి మేము కట్టుబడి ఉంటాం.. అని స్పష్టంగా తెలిపారు. మోదీ‌ మేనిఫెస్టోకి వీరిద్దరూ గ్యారంటీగా ఉంటారు కాని, చంద్రబాబు మేనిఫెస్టోకి మోదీ‌ గ్యారంటీ ఉండరని తేలిపోతోంది. ఇది టీడీపీ, జనసేనలకు మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు. అసలే బతిమలాడి, బాములాడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, ఆ పార్టీ వారేమో తమ మేనిఫెస్టోని అంటరాని పత్రంగా పరిగణించడం బాధాకర అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అదే టైమ్‌లో చంద్రబాబు చేసే పిచ్చి వాగ్దానాలకు, గాలి హామీలకు తాము ఎక్కడ గ్యారంటీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఒక రకంగా ఇది చంద్రబాబుకు దయనీయ పరిస్థితి అని చెప్పాలి. ఎందుకంటే మోదీ‌ గ్యారంటీలు, ఎన్నికల ప్రణాళికలో ఎన్‌డీఏ. అధికారంలోకి వస్తే ముస్లీంలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌లను రద్దు చేస్తామని విస్పష్టంగా చెబుతున్నారు. దానిని అవుననలేక, కాదనలేక టీడీపీ, జనసేనలు సతమతమవుతున్నాయి. సుమారు ముప్పై నియోజకవర్గాలలో ముస్లీంలు రాజకీయ పార్టీల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోకి అంగీకారం తెలపడం అంటే చంద్రబాబు, పవన్‌లు కూడా ముస్లీంల రిజర్వేషన్‌లను వ్యతిరేకించినట్లే అవుతుంది.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్పప్పుడు వచ్చిన ఈ హామీని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. అందులో చంద్రబాబు ప్రభుత్వం కూడా ఒకటి. కాని ఇప్పుడు చంద్రబాబు దీనిపై ఇరకాటంలో పడ్డారు. ఎవరో కొందరు ముస్లీం  నేతలతో దీని గురించి మాట్లాడిస్తున్నా, జనం నమ్మడం లేదు.ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.  చంద్రబాబు ఫోటోతో పాటు ఇస్తున్న ప్రచార ప్రకటనలో శనివారం ఇచ్చిన అంశం ప్రకారం ఏపీలో ఉన్న ప్రతి పౌరుడికి ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు. అది పచ్చి అబద్దం అని తెలిసిన వారు ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రచార ప్రకటన విడుదల చేశారన్న సంగతి అర్దం అవుతుంది. 

మేనిఫెస్టోలో  వారు ఇచ్చిన హామీ ఏమిటంటే ఎస్‌సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు ఏభై ఏళ్లు దాటితే పెన్షన్ తీసుకోవచ్చని ఇచ్చారు. కాని ప్రకటనలో మాత్రం మొత్తం జనాభాకు ఈ హామీ ఇచ్చినట్లుగా ఉంది. ఈ హామీ ప్రకారం బలహీనవర్గాలకు వారికి నాలుగువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలంటే కనీసం ముప్పైవేల కోట్ల పైబడిన మాటేనని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలందరికి పెన్షన్ అని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం మరింతగా పెరుగుతుందన్నమాట. సుమారు ఏభైవేల కోట్ల వరకు వ్యయం అయినా ఆశ్చర్యం లేదు. అంటే అది ఆచరణ సాధ్యం కాని హామీ అని తెలిసిపోతుంది.

చంద్రబాబు తన ఎన్నికల ప్రణాళికలో ఏ హామీకి ఎంత వ్యయం అవుతుందన్నది చెప్పకుండా జనాన్ని మాయ చేసే  యత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసినప్పుడు జగన్  సుమారు రెండుగంటల సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఏ ఏ స్కీమును తమ ప్రభుత్వం అమలు చేసింది, దానికి ఎంత వ్యయం అయ్యింది కూడా తెలిపారు. ఇప్పటికే బడ్జెట్ అంచనాలు దాటిపోతున్నందున, జగన్ కొత్త వాగ్దానాలు దాదాపు చేయకుండా ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు. పాత తరం నాయకుడిగా ఉన్న చంద్రబాబు మాత్రం కొత్త-కొత్త హామీలతో సూపర్ సిక్స్ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ మాదిరి ఆ సూపర్ సిక్స్‌కు ఎంత వ్యయం అయ్యేది చెప్పి ఉంటే ప్రజలకు అర్ధం అయి ఉండేది. చంద్రబాబు, పవన్‌‌లలో ఉన్న నిజాయితీ ఎంతో తెలిసేది. కాని వారు అలా చేయడం లేదు. వారితో పాటు అభ్యర్ధులు ఆకాశమే హద్దుగా అన్నీ చేసేస్తామని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే తప్ప, ఫలానా స్కీముకు ఇంత వ్యయం అవుతుంది.. ఈ డబ్బు ఇలా సమకూర్చుకుంటామని చెప్పే ధైర్యం లేదు. సంపద సృష్టిస్తామని పడికట్టు పదాన్ని వాడి ప్రజలను బురిడి కొట్టించాలన్నది వారి ఉద్దేశం.

గతంలో యనమల రామకృష్ణుడు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక విషయం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసే సంక్షేమ స్కీలు అమలు చేస్తోందని, ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చాలా కష్టంగా ఉందని వివరించారు. చంద్రబాబు కూడా పలుమార్లు తాను చాలా కష్టపడుతున్నానని, ప్రభుత్వంలో డబ్బులు లేకపోయినా, తాను రాత్రింబవళ్లు పనిచేసి కార్యక్రమాలు చేస్తున్నానని అనేవారు. ఈయన నిద్ర లేకుండా ఉంటే డబ్బు ఎలా వస్తుందో ఎవరికి అర్ధం అయ్యేకాదు.. జన్మబూమి కమిటీలతో స్కీములను అమలు చేయడంలో చాలా వరకు కోత పెట్టేవారు. 

జగన్ ప్రభుత్వంలోకి వచ్చాక, ఎన్నడూ ఆర్ధిక పరిస్థితిపై వాపోతూ మీడియా ముందు మాట్లాడలేదు. తానేదో రేయింబవళ్లు కష్టపడి సంపాదిస్తున్నానని బిల్డప్ ఇవ్వడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోయి, ప్రజలకు చెప్పిన విధంగా హామీలు నెరవేర్చడంలో సఫలం అయ్యారు. ఈ నేపద్యంలో జగన్‌పై ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఒక నమ్మకం పెరిగింది. చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించినా, దానిని వెబ్ సైట్ నుంచి తీసివేయడం, అసలు ఎన్ని వాగ్దానాలు చేసింది ఆయనకే గుర్తులేని పిరిస్థితి ఏర్పడడంతో క్రెడిబిలిటి కోల్పోయారు. అందువల్లే చంద్రబాబు, పవన్‌‌లు పెద్దగా తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. ఎంత సేపు జగన్‌ను దూషించడానికే యత్నిస్తున్నారు.

ఒకవేళ ప్రచార ప్రకటనలు ఇచ్చినా అందులో  అబద్దాలు రాస్తున్నారు. జగన్‌ తన  ప్రసంగాలలో ఎక్కడా టీడీపీ, జనసేన అభ్యర్దులను విమర్శిస్తూ మాట్లాడడం లేదు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం వెళ్లిన ప్రతి చోట జగన్‌తో పాటు, వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులపై కూడా పలు రకాల దూషణలకు పాల్పడడం, వారు  దీనికి కౌంటర్ ఇవ్వడం నిత్యకృత్యం అయింది. రామోజీ, రాధాకృష్ణలకు కూడా టీడీపీ మేనిఫెస్టోపై భ్రమలు తొలగిపోయాయి. అందుకే వారు దీనికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, జగన్ ప్రభుత్వంపై బురద చల్లడానికే వార్తలు రాస్తున్నారు. సంపాదకీయాలు రాస్తున్నారు. 

ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా పెక్కు కధనాలు ఇస్తున్నారు. పేజీలకొద్ది వార్తలను పరుస్తున్నారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం అని మాత్రం రాయకుండా జాగ్రత్తపడుతున్నారు. శనివారం నాటి ఈనాడు  పత్రికలో ఒక పేజీడు చెత్త అంతా తమ పత్రికలో అచ్చేశారు. అందులో అసలు ఈ యాక్ట్ అమలులోకి వచ్చిందని, దీనికోసం ప్రత్యేకంగా కిందిస్థాయిలో అధికారులను నియమించారని నీచమైన అబద్దాన్ని ఎవరో రైతు చెప్పారంటూ  మరీ రాసుకున్నారు.

చట్టమే అమలులో లేనప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందన్న ఇంగిత జ్ఞానం లేకుండా చెడరాస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. అనేక అంశాలపై రాసిన వార్తలనే మళ్లీ-మళ్లీ  రాసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే పెన్షన్‌లు ఇళ్ల వద్ద పంపిణీ కాకుండా చూసిన చంద్రబాబు, పవన్‌, రామోజీ, రాధాకృష్ణ ప్రభృతులు నాలుక కరుచుకుని యుటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు ఎదురుదాడి చేస్తూ జగన్ వల్లే పెన్షన్ దారులకు ఇబ్బందులు వచ్చాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పు పట్టకుండా, ఈ పరిస్థితికి కారణమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఒక్క మాట అనకుండా ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వయత్నం చేస్తున్నారు. 

ఏది ఏమైనా టీడీపీ, జనసేన, బీజేపీలు ఏపీలో కూటమి పెట్టుకున్నా, వాటికి ఒక ప్రామాణికత లేదని, ఒక విశ్వసనీయత లేదని, ప్రజలను మోసగించడమే లక్ష్యంగా ఉన్నారని వారి ప్రకటనల ద్వారా అర్థం అవుతుంది. మోదీ‌ గ్యారంటీకి చంద్రబాబు, పవన్‌లు కట్టుబడి ఉంటారట. అదే చంద్రబాబు, పవన్‌లు ఇచ్చిన గ్యారంటీలకు మోదీ‌ హామీగా ఉండబోరట. 

బహుశా  ప్రత్యేక హోదా, విభజన హామీలు తదితర అంశాలపై  గతంలో మాట్లాడి ఏపీలో పరువు పోగొట్టుకున్నానని తెలిసి మోదీ‌ తెలివిగా వ్యహరిస్తున్నారని అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో బకరా అయింది చంద్రబాబు, పవన్‌లే అయితే, జనాన్ని  బకరా చేయాలని వీరిద్దరితో పాటు రామోజీ, రాధాకృష్ణలు నానా తంటాలు పడుతున్నారు.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు.

Advertisement
Advertisement