ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ | Sakshi
Sakshi News home page

ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్‌.. టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ

Published Sun, May 5 2024 1:13 PM

Land Titling Act: Cid Investigation On Tdp Fake Campaign

సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్‌ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్‌ ఏ2గా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్‌సీపీ  ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఈసీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్‌తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్‌ కాల్స్‌ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.

కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్‌ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్‌ సెల్‌) అడిషనల్‌ డీజీకి అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌ ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ  వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.

వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్‌ కాల్స్‌ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్‌ చేయగానే.. ‘వైఎస్‌ జగన్‌ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్‌ కాజేస్తాడు, ఒరిజినల్స్‌ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్‌ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్‌కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్‌ మెసేజ్‌లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

వీటికి సంబంధించిన వాయిస్‌ రికార్డులను వైఎస్సార్‌సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్‌చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ తన ఫిర్యాదులో కోరింది  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisement
Advertisement