సంక్షేమంలో ఛాలెంజ్‌ | Sakshi
Sakshi News home page

సంక్షేమంలో ఛాలెంజ్‌

Published Mon, May 6 2024 9:45 AM

సంక్ష

మేలు

మార్కాపురం: దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదు. అవయవ లోపం వారి ప్రతిభకు అడ్డు కానే కాదు. వివక్ష చూపడం, అవహేళనగా మాట్లాడటం మాని సమానంగా చూడటం సామాజిక బాధ్యత. కానీ ప్రభుత్వాలే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తే సమాజం మరింత చిన్న చూపు చూస్తుంది. దివ్యాంగుల విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి సంక్షేమానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. దివ్యాంగుల్లో మరింత ఆత్మస్థ్యైర్యం నింపాయి. రేపటిపై ఆశతో, భవిష్యత్‌పై భరోసాతో సమస్యలను ‘ఛాలెంజ్‌’ చేస్తూ దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు.

దివ్యాంగులకు డిజిటల్‌ విద్య

విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సైతం డిజిటల్‌ విద్యను చేరువ చేసింది. జిల్లాలో 38 భవిత కేంద్రాల్లో సుమారు 800 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరిలో 380 మంది వరకు ఇంటి వద్దనే ఉంటూ ఐఈఆర్‌టీల ద్వారా శిక్షణ పొందుతున్నారు. దృష్టిలోపం, నోవిజన్‌, మూగ, చెవుడు కలిగిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు సుమారు 296 మందికి, ఐఈఆర్‌టీలు 75, స్కూల్‌ అసిస్టెంట్‌లకు (స్పెషల్‌ బీఈడీ చేసిన ఉపాధ్యాయులు) 43 ట్యాబ్‌లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్‌ఏపీ 2020లో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు అందించిన ఒక్కో ట్యాబ్‌ విలువ సుమారు రూ.30 నుంచి రూ.35 వేల వరకు ఉంటుంది. ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ), దివ్యాంగుల తల్లిదండ్రులకు ట్యాబ్‌ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

● దివ్యాంగులకు గతం కంటే మిన్నగా చేయూత

● ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు

● పర్సెంటేజీని బట్టి పింఛను ఇచ్చే విధానం రద్దు

● పింఛను పెంపు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం

● పక్షవాతం బాధితులకు రూ.5 వేలు, మంచానికే పరిమితమైతే రూ.10 వేల పింఛను

● వాహనాలు, ఉపకరణాల రూపంలో 1,899 మందికి రూ.2.84 కోట్ల లబ్ధి

● ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

నాడు దురవస్థ

గత టీడీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వారిలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసింది. పింఛను ఎప్పుడిస్తారో తెలియదు. సదరం క్యాంపుల్లో సర్టిఫికెట్లు అందక, వారికి కావాల్సిన ప్రత్యేక ఉపకరణాలు లభించక దివ్యాంగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కావాలంటే ఉత్తర(రెకమెండేషన్‌ లెటర్‌), దక్షిణాలు (మామూళ్లు) సమర్పించుకున్నా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. అయినా పథకాలు అందాయా అంటే అదీ లేదు.

నేడు ఆత్మస్థ్యైర్యం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దివ్యాంగుల్లో ఆత్మస్థ్యైర్యం పెంపొందించేలా గతంలో 3 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచారు. గతంలో బస్‌పాసుల కాల పరిమితి ఏడాది కాగా మూడేళ్లకు పెంచారు. జగనన్న హౌసింగ్‌ స్కీమ్‌లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. క్రమం తప్పకుండా సదరం క్యాంపులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. దివ్యాంగుల కోరిక మేరకు పర్సంటేజీని బట్టి పింఛను ఇచ్చే విధానాన్ని రద్దు చేశారు. పక్షవాతం ఉన్న దివ్యాంగులకు రూ.5 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు 10 వేలు పింఛను అందించడంతో వారికి ఆర్థిక భరోసా దక్కినట్టయింది. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు చక్రాల వాహనాలు, ఇతర ఉపకరణాలు అందజేశారు. జిల్లాలో 32 దివ్యాంగ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయడంతోపాటు అర్హులైన వారికి సబ్సిడీపై రుణాలు మంజూరు చేసి జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు.

పింఛను పెంపుతో సంతోషం

జిల్లాలో 36,310 మంది దివ్యాంగులకు వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో రూ.3 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు 33,205 మంది, రూ.5 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు (డీఎంహెచ్‌ఓ పరిధి) 2,540 మంది, రూ.10 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు 565 మంది ఉన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పింఛను పెంచడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దివ్యాంగులకు

అన్ని విధాలా

దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందించిన సహకారం మర్చిపోలేం. రిజర్వేషన్‌ను 3 నుంచి 4 శాతానికి పెంచడంతోపాటు ఉపకరణాలు కూడా అందించారు. పింఛను నగదు, బస్‌పాసుల కాలపరిమితి పెంచారు. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే మ్యారేజ్‌ ఇన్సెంటివ్‌ అవార్డు కింద గతంలో ఇస్తున్న రూ.లక్షను రూ.1.50 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే పింఛను నగదును రూ.3 వేలు చేశారు. ఇలా అన్ని విధాలుగా దివ్యాంగులకు మేలు చేకూరింది.

– డి.గోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, మార్కాపురం

సంక్షేమంలో ఛాలెంజ్‌
1/4

సంక్షేమంలో ఛాలెంజ్‌

సంక్షేమంలో ఛాలెంజ్‌
2/4

సంక్షేమంలో ఛాలెంజ్‌

సంక్షేమంలో ఛాలెంజ్‌
3/4

సంక్షేమంలో ఛాలెంజ్‌

సంక్షేమంలో ఛాలెంజ్‌
4/4

సంక్షేమంలో ఛాలెంజ్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement