గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం | Sakshi
Sakshi News home page

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం

Published Mon, May 6 2024 9:50 AM

గెలిప

ఒంగోలు టౌన్‌: ఎమ్మెల్యే, ఎంపీగా తమను గెలిపించండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఏవన్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం రాత్రి ఆర్యవైశ్య అత్మీయ సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో ఎప్పుడూ అబద్దాలు మాట్లాడే జనార్దన్‌ నేను ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెట్టినట్లు చెప్పాడని, పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏనాడూ ఆర్యవైశ్య వ్యాపారులను ఇబ్బందులు పెట్టలేదని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తిగా సహకరించానని తెలిపారు. అదే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నేను ఎలాంటి ఇబ్బందులు కలిగించినట్లు రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేసి పోతానని చెప్పారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం గురించి టీడీపీ లెక్కలేనన్ని అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు టీటీడీ చైర్మన్‌ గా చేయాలని కోరికగా ఉందని, ఆయనను టీటీడీ చైర్మన్‌ను చేసేంత వరకు ముఖ్యమంత్రితో పోరాడుతానని చెప్పారు. ప్రతి రెండేళ్లకోసారి ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం జరిపిస్తానన్నారు. మీ కోసం ఏది చేయడానికై నా సిద్ధంగా ఉన్నాను, నన్ను, చెవిరెడ్డి భాస్కరెడ్డిని గెలిపించండి, మీ రుణం తీర్చుకుంటాం అన్నారు.

ఆర్యవైశ్యుల ఇంట్లో పెరిగాను:

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

తాను చిన్నప్పుడు ఆర్యవైశ్యుల ఇంటిలోనే పెరిగానని, వారితోనే తిరిగానని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆర్యవైశ్యులు నిజాయితీకి మారుపేరని, నమ్మకంగా ఉంటారని, అందుకే వారంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. తన వ్యాపారాల విషయంలో ఆర్యవైశ్యులను నమ్ముతానని అన్నారు. ఆరో తరగతి నుంచి బీఈడీ దాకా 18 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే చదువుకునే అదృష్టం లభించిందని చెప్పారు. టీటీడీ బోర్డులో పలు మార్లు సభ్యుడిగా పనిచేసే అవకాశం దేవుడు కల్పించారన్నారు. మీ సేవ చేయడానికే వెంకటేశ్వరస్వామి ఇక్కడికి నన్ను పంపించాడని భావిస్తున్నానని, ఎంపీగా గెలిపిస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఐదేళ్లకోసారి వచ్చిపోయే రకం కాదని, మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకడిగా వ్యవహరిస్తానని అన్నారు. కష్టాల నుంచి పెరిగాను, కష్టాల విలువ బాగా తెలుసు, ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉంటానని చెప్పారు. బాధ్యతగా, నిజాయతీగా పనిచేస్తాను, ఆశీర్వదించండి అని కోరారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా కలిసి మెలిసి వైఎస్సార్‌ సీపీకి ఓట్లేయాలని, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను గెలిపించాలని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలినేని శచీదేవి, బాలినేని కావ్య, నగర మేయర్‌ గంగాడ సుజాత, కారంశెట్టి పుష్పలత, కుప్పం ప్రసన్న, ఆర్యవైశ్య నాయకులు మునగా కృష్ణారావు, కోడూరి సత్యనారాయణ, మట్టరాజ, తడపర్తి వాసు, తాతా మధు, రామస్వామి, శిద్దా హనుమంతరావు, సురేష్‌, ప్రవీణ్‌, సత్యం, వినోద్‌ ఆరె శ్రీను, ఆనంద్‌, కూరపాటి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఆత్మీయ సమావేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు హైలెట్‌గా నిలిచాయి. ఆధ్యాత్మిక గీతాలు రంజింప చేశాయి. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర గురించి నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తొలుత వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మట్టి శివలింగానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలకు హోస్టర్లుగా మృదుల, సుమన శ్రీ, మలక్‌ పేట శైలజ వ్యవహరించారు.

ఆర్యవైశ్యులకు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకుంటానన్న బాలినేని ఆర్యవైశ్యుల ఇళ్లలోనే పెరిగాను..మీతో శభాష్‌ అనిపించుకుంటానన్న చెవిరెడ్డి పండుగలా జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
1/3

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
2/3

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
3/3

గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం

Advertisement

తప్పక చదవండి

Advertisement