ప్రచారం కరువు.. బీమాకు దూరం | Sakshi
Sakshi News home page

ప్రచారం కరువు.. బీమాకు దూరం

Published Mon, May 6 2024 7:05 AM

ప్రచా

● పంటల బీమాలో నిబంధనల సడలింపు ● రైతు యూనిట్‌గా పరిహారం చెల్లింపులు ● వానాకాలం సీజన్‌లో అమలు ● జిల్లాలోని 1.23 లక్షల మంది రైతులకు ప్రయోజనం

చందుర్తి(వేములవాడ): ఆరుగాలం శ్రమించి రైతులు పంటలు పండిస్తే.. అకాల వర్షాలు.. అడవి జంతువుల దాడితో నిండా మునుగుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల గురించి తెలియక పరిహారం పొందలేకపోతున్నారు. గతంలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోగా.. స్వల్ప మార్పులతో రైతుయూనిట్‌గా పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు. అయితే దీనిపై అధికారులు ప్రచారం చేయకపోవడంతో అవగాహన లేక రైతులు బీమా ప్రీమియం చెల్లించడం లేదు. ఫలితంగా పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందక నష్టపోతున్నారు.

2.42లక్షల ఎకరాల్లో సాగు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో 2.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుండగా.. 1.83లక్షల ఎకరాల్లో వరి, 55వేల ఎకరాల్లో పత్తి, మిగతా 5వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్లు వ్యవసాయాధికారుల నివేదికలు చెబుతున్నాయి. పంటల బీమాతో జిల్లాలోని 1.23లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. బ్యాంకు నుంచి రుణం పొందే రైతులు పంటల బీమా ప్రీమియం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం పొందని రైతులు నేరుగా బీమా ప్రీమియాన్ని మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించే అవకాశం ఉంది.

బీమాలో రెండు రకాలు

జిల్లాలో రెండు రకాల బీమా పథకాలు అమలు చేస్తున్నారు. వాతావరణ ఆధారిత బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం. వానాకాలం సీజన్‌లో పంటల బీమా పథకం కింద జిల్లాలో వరి, మొక్కజొన్న, కంది, జొన్న పంటలు వస్తాయి.

నష్టపోయిన రైతులకు ప్రయోజనం

రైతులు నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించడానికి అమలు చేస్తున్న ఫసల్‌ బీమా పథకానికి కేంద్రం పలు రకాల సవరణలు చేపట్టింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకే పరిహారం అందేది. అధిక వర్షాలతో పంటలు కొట్టుకుపోయిన, దెబ్బ తిన్న ప్రభుత్వం పరిహారం మంజూరుచేసేది. అడ వి జంతువులు, కోతులు పంటలను ధ్వంసం చేస్తే పరిహారం అందేది కాదు. అదే విధంగా మెరుపుల ప్రభావంతో పడే పిడుగు కారణంగా నష్టపోయే పంటలకూ పరిహారం మంజూరవలేదు. పంటలు అడవి జంతువులతో దెబ్బతిన్న, ఉరుములతో ధ్వంసమైనా.. ఖరీఫ్‌ నుంచి రైతులకు పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అవగాహన కల్పించాలి

కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌బీమా పథకం గురించి రైతులకు అవగాహన కల్పించాలి. పంటల బీమాపై అవగాహన లేకనే ప్రీమియం చెల్లించేందుకు ముందుకురావడం లేదు. గ్రామసభలు పెట్టి ఏ పంటకు ఎంత ప్రీమియం చెల్లించాలో రైతులకు వివరించాలి. పంట నష్టం జరిగితే కలిగే ప్రయోజనాల గురించి వివరించాలి. అప్పుడే చాలా మంది రైతులు పంటల బీమా చేసుకునేందుకు ముందుకొస్తారు.

– తాడిశెట్టి తిరుపతిరెడ్డి, బండపల్లి రైతు

ప్రచారం కరువు.. బీమాకు దూరం
1/2

ప్రచారం కరువు.. బీమాకు దూరం

ప్రచారం కరువు.. బీమాకు దూరం
2/2

ప్రచారం కరువు.. బీమాకు దూరం

Advertisement
Advertisement