కాకర్ల విజయం క్లిష్టమే..! | Sakshi
Sakshi News home page

కాకర్ల విజయం క్లిష్టమే..!

Published Mon, May 6 2024 1:25 AM

-

ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురేష్‌ విజయం అంత సులువు కాదంటూ ఓ యూట్యూబ్‌ చానల్‌తో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు చేసిన వ్యాఖ్యలు తమ్ముళ్లలో అంతర్మథనానికి దారితీశాయి. దీనిపై కాకర్ల సురేష్‌ వర్గీయులు భగ్గుమంటున్నారు.

రాజకీయ ప్రకంపనలు

ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి ఉంది. ఈ తరుణంలో టీడీపీ విజయానికి సహకరిస్తామంటూనే.. ఉదయగిరిలో టీడీపీ గెలుపు అంత తేలిక కాదన్న బొల్లినేని వ్యాఖ్యలు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2012 నుంచి నియోజకవర్గంలో టీడీపీని.. కేడర్‌ను సర్వశక్తులొడ్డి కాపాడుకుంటూ వచ్చానని.. అయితే అధిష్టానం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్నారై కాకర్ల సురేష్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయానని చెప్పారు. అయినా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఉదయగిరిలో సురేష్‌ విజయానికి సహకరించాలని భావించానని, ఆయన తనకు తగిన గౌరవమివ్వడంలేదని తెలిపారు. నామినేషన్‌ సమయంలో తాను నియోజకవర్గంలోనే ఉన్నా, ఆహ్వానం అందకపోవడంతో మనస్తాపానికి గురై హైదరాబాద్‌ వెళ్లానని సదరు యూట్యూబ్‌ చానల్‌తో చెప్పారు.

ఆయన ప్రవర్తన సక్రమంగా లేదు

వాస్తవానికి ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయడం తనకిష్టం లేదని.. అయితే మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌ మాట కాదనలేక తాను ప్రచారం చేయాలని భావించానని చెప్పారు. అయితే ఇక్కడి అభ్యర్థి ప్రవర్తన సక్రమంగా లేదన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తొమ్మిది సార్లు కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీయే విజయం సాధించాయని.. టీడీపీ రెండుసార్లే గెలుపొందిన అంశాన్ని ప్రస్తావించారు. దీని బట్టి కాకర్ల విజయం అంత తేలిక కాదని వ్యాఖ్యానించడం కేడర్‌లో తీవ్ర అయోమయానికి దారితీసింది.

వివాదాస్పదమైన బొల్లినేని వ్యాఖ్యలు

భగ్గుమన్న సురేష్‌ వర్గీయులు

తమ్ముళ్లలో అంతర్మథనం

రగిలిపోతున్న కాకర్ల వర్గీయులు

ఉదయగిరి సీటును తమ నేతకు ఖరారు చేసిన నాటి నుంచి పార్టీకి నష్టం కలిగించేలా బొల్లినేని వ్యవహరిస్తున్నారని కాకర్ల వర్గీయులు మండిపడుతున్నారు. ఉదయగిరిలో కాకర్ల విజయం సాధిస్తారనే సమాచారంతో జిల్లా కేంద్రానికి బొల్లినేని వచ్చారని, అయితే ఇక్కడ టీడీపీ గెలవదంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని.. ఈ వారంలో ఆయనతో తమకు ఒరిగేదేమీలేదని.. కేవలం పార్టీకి నష్టం కలిగించేందుకే ఉదయగిరి వచ్చారని కాకర్ల వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బొల్లినేని వ్యవహార శైలి కాకర్ల కొంపముంచేలా ఉందని టీడీపీ కేడర్‌ అంతర్గతంగా చర్చించుకుంటోంది.

Advertisement
 
Advertisement