TDP: అరాచక శక్తులు.. కేసులు గుట్టలు | Sakshi
Sakshi News home page

TDP: అరాచక శక్తులు.. కేసులు గుట్టలు

Published Mon, May 6 2024 4:50 AM

-

అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌పై ఏకంగా హత్య కేసు

‘కదిరి’ కందికుంట ప్రసాద్‌పై లెక్కలేనన్ని కేసులు

బ్లాక్‌మెయిలింగ్‌, దౌర్జన్యం కేసుల్లో ఎమ్మెస్‌ రాజు దిట్ట

జేసీ కుటుంబ కేసుల చరిత్ర వింటే దిమ్మతిరగాల్సిందే

👉 భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు 
ఒకరు భూ కబ్జాకోరు, హత్యా రాజకీయాలకు మారు పేరు.. మరొకరు అవినీతి అక్రమాలకు దేశస్థాయిలో పేరుగాంచిన వారు.. బ్యాంకులకే ఎగనామం పెట్టిన వారు ఇంకొకరైతే, బ్లాక్‌మెయిలింగ్‌కు పేరుగాంచిన మహానుభావుడు మరొకరు.. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన చంద్రబాబు.. తనకు తగ్గ టీంనే ఈసారి బరిలోకి దించారు. దౌర్జన్యకారులు, ఖూనీకోరులను ఎంపిక చేసి మరీ టికెట్లు కట్టబెట్టారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారిలో ఎవరి చరిత్ర చూసినా కళ్లు బైర్లు కమ్ముతాయి. వీరిని తలచుకుంటేనే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. కానీ, వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో సచ్ఛీలురు కావడమే దౌర్భాగ్యం. అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ, ఎదురొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రబాబు టీంలోని వీరు ఒకవేళ కర్మ కొద్దీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.

దళితులకు శఠగోపం.. హత్యా రాజకీయం..
తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంతపురం అర్బన్‌ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌పై 2015లో ఏకంగా హత్య కేసు నమోదైంది. వైఎస్సార్‌ సీపీ నేత ప్రసాద్‌రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక.. బండమీద పల్లిలో ఓ దళితుడి భూమిని అక్రమంగా లాక్కున్నాడన్న కారణంగా బాధితుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

డాక్టర్‌ వద్దంట.. కేసుల వీరుడే ముద్దంట
మడకశిర నియోజకవర్గ సీటును 52 కేసులున్న ఎమ్మెస్‌ రాజుకు చంద్రబాబు కేటాయించారు. ఉన్నత చదువులు చదివిన డాక్టర్‌ సునీల్‌కు ముందు టికెట్‌ ఇచ్చిన బాబు... ఆ తర్వాత ఆయన నుంచి టికెట్‌ లాక్కుని మరీ నేర చరితుడికి కట్టబెట్టారు. బ్లాక్‌మెయిలింగ్‌ చేయడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడం ఇలా రకరకాల కేసులు ఎమ్మెస్‌ రాజుపై నమోదై ఉండడం గమనార్హం. శింగన మల, అనంతపురం ప్రాంతాల్లోని స్టేషన్లలో దాదాపు 52 కేసులు ఇతనిపై ఉన్నాయి.

జేసీ చరిత్రంతా నేరాల మయమే..
జేసీ.. ఈ పేరు చెబితే చాలు నేరాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అన్నట్టుంటుంది. ఫ్యాక్షన్‌ హత్యలను ప్రోత్సహించి చలి కాచుకున్న జేసీ దివాకర్‌ రెడ్డి, జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. అవినీతి చేయడంలోనూ పేట్రేగిపోయారు. నకిలీ ఇన్‌వాయిస్‌లతో వాహనాల అమ్మకం, అనుమతులు లేకుండా బస్సులు తిప్పడం కేసుల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దేశస్థాయిలో వీరి ఘనకార్యంపై చర్చ నడిచింది. ఇప్పుడు అలాంటి నేరచరిత్ర కలిగిన అస్మిత్‌ రెడ్డికే చంద్రబాబు తాడిపత్రి టికెట్‌ ఇచ్చారు. ఎప్పుడూ తాడిపత్రిలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే.

తిట్టి.. టికెట్‌ కట్టబెట్టి..
గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్‌లు జయరాంను తిట్టని తిట్టంటూ లేదు.మట్కా ఆడిస్తారని, పేకాట క్లబ్బులు నడిపిస్తారని, బెంజ్‌కార్లు లంచంగా తీసుకున్నారని ఇలా లెక్కలేనని ఆరోపణలు చేశారు. అయితే, ఎప్పుడైతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వెంటనే సచ్ఛీలుడై పోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టిన బాబే ఆయనకు గుంతకల్లు టికెట్‌ ఇవ్వడంతో స్థానికులే కాదు.. జిల్లా ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంది.

పరిటాలకే ఎందుకో..?
టీడీపీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పరిటాల సునీత కుటుంబం పేరెత్తితేనే గతంలో ఆ కుటుంబం సాగించిన రక్తచరిత్ర గుర్తుకొస్తుంది. సునీత భర్త పరిటాల రవి అప్పట్లో చేసిన హత్యారాజకీయాల గురించి ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆర్‌వోసీ పేరుతో కొన్ని వందల మందిని ఊచకోత కోసినట్లు చెబుతారు. దీనికితోడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు.

కబ్జాల కందికుంట
కదిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కందికుంట వెంకటప్రసాద్‌పై లెక్కలేనన్ని కేసులున్నాయి. కదిరిలో కంటికి కనిపించిన భూములన్నీ కబ్జా చేసేస్తాడనే ఆరోపణలున్నాయి. ఒక రేప్‌ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నట్లు గతంలో ఓ సర్వే సంస్థ వెల్లడించింది. హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. చెక్‌బౌన్స్‌ కేసులైతే లెక్కలేనన్ని. నకిలీ డీడీల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసును ఇటీవల కొట్టేయడంతో ఇదే అదనుగా చంద్రబాబు ఆయనకు సీటిచ్చేశారు.

👉 పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత కూడా తక్కువేమీ కాదు. గ్రానైట్‌, మట్టి, పెట్రోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఈమైపె అనేక కేసులున్నాయి.

ఒక హత్య.. మరో హత్యాయత్నం!
ఎన్నికల నేపథ్యంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. కొన్ని రోజుల క్రితం అనంతపురం అర్బన్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకుడు గుజ్జల నగేష్‌పై పచ్చ పార్టీకి చెందిన జయరాం నాయుడు వర్గీయులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు కదిరి నియోజకవర్గం జౌకుల గ్రామంలో నాగభూషణం అనే యువకుడిని టీడీపీ వర్గీయులు చంపేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేర చరితులకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడంతోనే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టిక
1/1

భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టిక

Advertisement
Advertisement