దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు | Sakshi
Sakshi News home page

దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు

Published Mon, May 6 2024 4:50 AM

దమ్ముంటే చేనేతకు జీఎస్టీ రద్దు చేయించు

ధర్మవరం: ‘‘ఽఢిల్లీ స్థాయి నాయకుడినని గొప్పలు చెప్పుకునే నువ్వు.. కార్పొరేట్‌ తరహాలో ధర్మవరంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నావు.. ఓట్ల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్నావు.. ప్రచారానికి ఏకంగా కేంద్ర హోం మంత్రిని తీసుకువచ్చావ్‌.. నిజంగా చేనేతలపై నీకు ప్రేమ ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చేనేతకు జీఎస్టీ పన్ను రద్దు చేయించు. పోలింగ్‌ రోజు లోపు జీఎస్టీ రద్దు ప్రకటన చేయిస్తే నేను ఎన్నికలు వదిలేసి ఇంట్లో కూర్చుంటా’’ అని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన ధర్మవరంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ బీసీకార్డుతో చేస్తున్న మోసాలను, జాతీయ నాయకుడినంటూ చేస్తున్న పబ్లిసిటి స్టంట్‌పై మండిపడ్డారు. యాదవ సామాజికవర్గం అంటూ చెప్పుకుంటున్న సత్యకుమార్‌ అసలు బీసీనే కాదని, అతను ఆర్యక్షత్రియుడన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలకు ఏం మంచి చేస్తారో చెప్పి ఓట్లు అడగాలే తప్ప, అసత్యాలు, గొప్పలు చెప్పడం ఏ స్థాయి రాజకీయమో సత్యకుమారే చెప్పాలన్నారు. ఎంత ప్రలోభపెట్టినా స్థానికంగా ఎవరూ సహకరించక పోవడంతో సత్యకుమార్‌ ఇతర రాష్ట్రాల నుంచి వందల మందిని ధర్మవరానికి తీసుకువచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. అలాగే 30 మందికిపైగా ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను ప్రచారానికి తీసుకువచ్చారన్నారు. కానీ వారు ఎక్కడివారో.. ఏం చేస్తారో ధర్మవరం వాసులకు తెలియదన్నారు. అందువల్లే సత్యకుమార్‌ ప్రచారానికి ఎక్కడా ప్రజా స్పందన లభించడం లేదన్నారు. దీంతో అతను ఏకంగా సినిమా హీరోయిన్లను ధర్మవరానికి తీసుకువస్తున్నారన్నారు. అయినా జనం పట్టించుకోకపోవడంతో రోజుకో డ్రామా ఆడుతున్నారన్నారు. అయినా జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. చేనేతపై జీఎస్టీ పన్ను 5 శాతం ఉండగా, గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 శాతానికి పెంచాలని చూస్తే తాను పోరాటం చేశానన్నారు. తమ పార్టీ ఎంపీలతో కలసి ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిసి చేనేతల పరిస్థితి వివరించి జీఎస్టీ పెంచవద్దని కోరగా, ఆమె సానుకూలంగా స్పందించి జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారన్నారు. ఈవిషయం ధర్మవరం వాసులందరికీ తెలుసన్నారు. ఇప్పటికై నా సత్యకుమార్‌ అసత్యాలు మానుకోవాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి హితవు పలికారు.

పోలింగ్‌ రోజులోపు ప్రకటన చేయిస్తే ఎన్నికలు వదిలేస్తా

ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్‌కు

ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్‌

Advertisement
 
Advertisement