వంటింట్లో ధరల మంట! | Sakshi
Sakshi News home page

వంటింట్లో ధరల మంట!

Published Mon, May 6 2024 10:05 AM

వంటింట్లో ధరల మంట!

తిరుమలగిరి (తుంగతుర్తి): నిత్యావసరాల ధరలకు రెక్కలు వచ్చాయి. బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కోడి గుడ్ల వంటి నిత్యావసరాల ధరలు చూసి సామాన్య, మధ్య తరగతి ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంటింటి సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ప్రతి ఇంటా నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.

పెరిగిన సన్న బియ్యం ధరలు

సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ఏడాది వ్యవధిలోనే సన్నబియ్యం క్వింటాకు రూ.1,200, పాత బియ్యం రూ.1,000 చొప్పున పెరిగాయి. ప్రతి ఒక్కరూ సన్న బియ్యం వినియోగిస్తుండటంతో ధరలు బాగా పెరిగాయి. సీజన్‌ ఆరంభంలోనే కొత్త బియ్యం ధర క్వింటా రూ.3,800 పలికితే ఇంకో రెండు నెలలు గడిస్తే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో సన్న బియ్యం కొత్తవి క్వింటాకు రూ.4,800, పాతవి రూ.5,600 ధర పలుకుతోంది. గతంలో కంటే సన్న ధాన్యం తెగుళ్లతో నష్టం జరగడం, పంట దిగుబడి సరిగా రాకపోవడంతో బియ్యం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి.

కనికరించని కంది పప్పు

కంది పప్పు ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగిస్తుంటారు. పప్పు లేకుంటే చాలా మందికి ముద్ద దిగదు. అయితే కంది పప్పు మార్కెట్‌లో కుతకుత ఉడుకుతోంది. గత ఏడాది జనవరిలో కిలో రూ.110 ఉంటే జూన్‌లో రూ.150కి చేరింది. ప్రస్తుతం కిలో కంది పప్పు రూ.170 ఉంది. జిల్లాలో పప్పు దినుసుల సాగు అంతంత మాత్రంగా ఉండటంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఇతర రాష్ట్రాల్లో కూడా దిగుబడి తగ్గిందని, అందువల్లే డిమాండ్‌కు అనుగుణంగా దిగుమతులు లేవని వ్యాపారులు చెబుతున్నారు. దరాఘాతంతో సామాన్యులు కందిపప్పుకు ప్రత్యామ్నాయంగా పెసర, శనగ, ఎర్ర పప్పులను వినియోగిస్తున్నారు. మినపప్పు ధర కూడా రూ.130 నుంచి రూ.200లకు పెరిగింది. అల్లం వెల్లుల్లి కూడా అంతే. బహిరంగ మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. గత సంవత్సరం జనవరిలో కిలో రూ.60 పలికిన అల్లం ధర ప్రస్తుతం కేజీ రూ.150 పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో వెల్లుల్లి ధర కేజీకి రూ.300 పలుకుతుంది. వేసవిలో మామిడి పచ్చళ్లకు ఉపయోగించే అల్లం, వెల్లుల్లి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన ధరలు ఇలా..

ధరలు 2023 2024

(రూ.లో) (రూ.లో)

బియ్యం (కొత్తవి) 3,300 4,800

బియ్యం (పాతవి) 5,200 6,000

కంది పప్పు 110 170

పెసర పప్పు 90 130

శనగ పప్పు 70 90

మినపప్పు 140 200

అల్లం 60 150

వెల్లుల్లి 70 300

ఫ భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు

ఫ సామాన్య, మధ్య తరగతి ప్రజల

నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం

నిత్యావసరాలు కొనలేని పరిస్థితి

గతంలో కంటే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. కనీసం కంది పప్పు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. మామిడి కాయ పచ్చడి పెట్టాలన్నా ధరలు పెరగడంతో వెనకాడుతున్నాం.

– రమ, తిరుమలగిరి

Advertisement
 
Advertisement