ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం! | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబం.. కేంద్రాలనేకం!

Published Thu, Apr 18 2024 10:35 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు.అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్‌ స్లిప్‌ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్‌ కేంద్రం, భార్యకు మరో పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్‌ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్‌ ఒకటే అయినా వారి పోలింగ్‌ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్‌ బూత్‌దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతో పాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలాఎందుకవుతుందో అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్‌ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు.

నగరంలో వింత పరిస్థితి

పోలింగ్‌ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం!

Advertisement
Advertisement