హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర

Published Mon, May 6 2024 1:50 AM

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర

వనపర్తి: రాష్ట్రానికి తలమానికంగా ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకు కాంగ్రెస్‌ అంతర్గతంగా సహకరిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతుల్లో పెట్టే దిశగా రాష్ట్ర కాంగ్రెస్‌ పాలకులు అడుగులు వేస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌పార్టీకి ప్రస్తుత ఎన్నికల్లో ఓటు వేస్తే.. తమకు తామే అన్యాయం చేసుకున్నట్లు అవుతుందన్నారు. కృష్ణా జలాల విషయంలో పక్క రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గోదావరి–కావేరి నదులను అనుసంధానిస్తూ గోదావరి బేసిన్‌ను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ నిర్ణయాలకు కాంగ్రెస్‌ వంత పాడుతోందని విమర్శించారు. ముందుచూపుతో ప్రధాన పట్టణాలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేసిన చిన్న జిల్లాలను కుదించేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూనుకుంటోందని.. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ప్రశ్నించినా మంత్రులుగాని, సీఎంగాని ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పదేళ్ల పాలనతో కొంత వ్యతిరేకత వచ్చిన కారణంగా కేవలం 1.85 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కాలం కలిసొచ్చి వచ్చిన ముఖ్యమంత్రి పదవిని రేవంత్‌రెడ్డి కాపాడుకోవాలని హితవు పలికారు. దుర్భాషలాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి సరికాదనే విషయాన్ని గమనించాలన్నారు. యాసంగి రైతుబంధు నేటికీ చాలామంది రైతులకు అందలేదని.. మళ్లీ వానాకాలం సీజన్‌ వస్తుందనే విషయం ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. మాటిమాటికి పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం చిత్తశుద్ధి ఉంటే పాలమూరు–రంగారెడ్డి పథకం పనులు పూర్తిచేసి వానాకాలం నాటికి సాగునీరు అందించాలని సవాల్‌ విసిరారు. 2003లో పార్టీలో చేరుతానని రేవంత్‌రెడ్డి వస్తే తానే కేసీఆర్‌తో గులాబీ కండువా కప్పించానని మాజీ మంత్రి గుర్తుచేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, మాజీ గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ బి.లక్ష్మయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు రమేష్‌గౌడ్‌, పట్టణ ఇన్‌చార్జ్‌ శ్రీనివాస్‌యాదవ్‌, గొర్రెల కాపరుల సంఘం మాజీ అధ్యక్షుడు కురుమూర్తియాదవ్‌, నాయకులు జోహెబ్‌, రాము పాల్గొన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Advertisement
Advertisement