రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మకు ప్రత్యేక పూజలు

Published Mon, May 6 2024 11:30 AM

-

పెదవేగి: భక్తుల పాలిట కల్పతరువుగా, కోరిన కోర్కెలు నెరవేర్చే తల్లిగా రాట్నాలకుంటలో వెలిసిన శ్రీరాట్నాలమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, పూజలు చేశారు. అమ్మవారికి కామవరపుకోటకు చెందిన పావులూరి రఘురాం, ప్రశాంతికుమారి దంపతులు రూ.5 వేల విలువ చేసే బంగారు సూత్రాలను బహూకరించారు. ఈ వారం పూజా టికెట్ల విక్రయం ద్వారా రూ.34,065, విరాళాల రూపంలో రూ.6,340 లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.10,590, ఫొటోల అమ్మకం ద్వారా రూ.2,885 వెరశి మొత్తం రూ.53,880 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ చెప్పారు.

గోదావరిలో స్నానానికి దిగి ట్యాక్సీ డ్రైవర్‌ గల్లంతు

పోలవరం రూరల్‌: గోదావరి నదిలో స్నానానికి దిగిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. హెచ్‌సీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెంకు చెందిన 42 సంవత్సరాల ట్యాక్సీ డ్రైవర్‌ ఆదివారం ఉదయం కొందరితో కలిసి పోలవరంలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లాడు. అక్కడ గోదావరి రేవులో స్నానానికి దిగగా ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న ప్రాంతంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు హెచ్‌సీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడి మృతి

పోలవరం రూరల్‌: శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ కూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందినట్లు స్టేషన్‌ హెచ్‌సీ కె.శ్రీనివాస్‌ చెప్పారు. పోలవరం గ్రామానికి చెందిన పోలవరపు వీరభద్రం (46) భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తన ఇంటి సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ వద్ద ఉండగా ఒక్కసారి గోడ కూలి మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement