టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్‌ చేయాలి | Sakshi
Sakshi News home page

టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్‌ చేయాలి

Published Mon, May 6 2024 11:30 AM

టీడీపీ చింతలపూడి అభ్యర్థి సొంగాను ప్రాసిక్యూట్‌ చేయాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చింతలపూడి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని రిటైర్డ్‌ మండల విద్యాశాఖాధికారి సేవ ధర్మదాసు డిమాండ్‌ చేశారు. ఆదివారం సాయంత్రం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎన్‌ఆర్‌గా ఉంటూ, తన ఓటును ఫారమ్‌ 6ఏ ద్వారా నమోదు చేయకుండా లోకల్‌ ఓటర్‌గా ఎపిక్‌ నంబర్‌ డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 1469121గా నమోదు చేయించుకోవడం ఎన్నికల నియమావళికి విరుద్ధమే కాకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 8ఏ, 123 (2) ప్రకారం అనర్హత వర్తిస్తుందన్నారు. అంతేకాకుండా, ఏప్రిల్‌ 22న ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియాలో గల బ్యాంక్‌ ఖాతాలను, ఇన్సూరెన్స్‌ విషయాలను కప్పిపుచ్చి, దానిపై తాను లేవనెత్తిన అభ్యంతరంతో ఏప్రిల్‌ 25న మరో నామినేషన్‌, అఫిడవిట్‌ దాఖలు చేసి తనకు అమెరికాలో వెస్ట్‌ వర్జీనియాలో గల బ్యాంక్‌ ఖాతాలను, ఇన్సూరెన్స్‌ విషయాలను చేర్చి తన డొల్లతనాన్ని తానే బయటపెట్టుకున్నారన్నారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. అలాగే రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌, ఐపీసీ సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్‌ చేయాలని కోరుతూ రాష్ట్రపతి నుంచి కలెక్టర్‌ వరకు అందరికీ ఫిర్యాదులు చేశామన్నారు. ఇటీవల చింతలపూడిలో దళితులతో నిర్వహించిన సమావేశంలో అగ్రవర్ణాలకు చెందిన వారిని వేదికపై కూర్చోపెట్టి దళితులను వేదిక కింద కూర్చోపెట్టి రోషన్‌ కుమార్‌ దళితులను అవమానించారని, అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పులు ధరించి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేయడం అంబేడ్కర్‌ను అవమానించడమేనన్నారు. రోషన్‌ కుమార్‌ ఎన్నికల్లో గెలిచినా తరువాత అతనిపై అనర్హతకు గురవుతారని, చింతలపూడి నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

రిటైర్డ్‌ ఎంఈఓ ఎస్‌.ధర్మదాసు

Advertisement
Advertisement