మిగిలింది.. వారం రోజులే! | Sakshi
Sakshi News home page

మిగిలింది.. వారం రోజులే!

Published Sun, May 5 2024 4:00 AM

మిగిల

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారాల్లో ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటున్నారు. లోక్‌సభ నియోజకవర్గాలు, జిల్లాను బాధ్యతగా తీసుకొని మంత్రులు ఎన్నికల పోరులోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి నల్లగొండలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. భువనగిరిలో గెలుపు బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీసుకోగా, అక్కడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం అందిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం రెండు చోట్లా అభ్యర్థుల గెలుపు బాధ్యతను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే పెట్టింది. దీంతో ఆయన అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర నేతలు తీసుకున్నారు.

ప్రచార రథాలు.. సభలు, సమావేశాలు

ప్రధాన పార్టీలు ఎక్కువగా ప్రచార రథాలు, సోషల్‌ మీడియాపై దృష్టి పెట్టాయి. ఇన్‌చార్జిలు, రాష్ట్ర స్థాయి నేతల పర్యటనలతోపాటు ఆయా ప్రాంతాల్లో ప్రచార రథాలను (మైక్‌తో కూడిన వాహనాలను) తిప్పుతున్నాయి. ఏ వీధికెళ్లినా ఆయా పార్టీల ప్రచార రథాలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ రికార్డు చేసిన వాయిస్‌తో కూడిన నినాదాలు ప్లే చేస్తూ తిప్పుతున్నారు. ముఖ్య నేతల పర్యటనలతో రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తూ పార్టీలన్నీ ఓటర్లకు గాలం వేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ, భువనగిరి ఇన్‌చార్జిలు తమ అభ్యర్థులైన కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం రోజువారీ షెడ్యూల్‌ రూపొందించుకొని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక రెండు నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేష్‌ గెలుపు కోసం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నిత్యం ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ నిత్యం ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కేసీఆర్‌ ఎన్నికల నేపథ్యంలో రెండుసార్లు పర్యటించగా, కేటీఆర్‌ రెండుసార్లు, హరీష్‌రావు రెండు నియోజకవర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి కిరణ్‌ రిజీజు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఇతర నేతలు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు.

ఫ లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు

ఫ వేగం పెంచిన పార్టీలు.. జోరుగా ప్రచారం

ఫ రాష్ట్ర, జాతీయ నేతల పర్యటనలు

ఫ మండుటెండలతో ఉదయం, సాయంత్రం వేళల్లోనే సభలు, సమావేశాలు

ఫ కాంగ్రెస్‌ పార్టీ భారం ఉత్తమ్‌, కోమటిరెడ్డి బ్రదర్స్‌పై..

ఫ బీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యత జగదీష్‌రెడ్డికే..

ఎండ మంట పుట్టిస్తున్నా..

ఎండలు మంట పుట్టిస్తున్నా.. పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు నమోదవుతున్నా.. నేతలు ప్రచారంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నికలకు మరో వారం రోజులే గడువు ఉండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి సమయం ఉండటంతో ఆ సమయం వరకు రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిల్లో బూత్‌ స్థాయి సమావేశాలు నిర్వహించింది. రోడ్‌షోలు కూడా నిర్వహిస్తోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కూడా ఇంటింటి ప్రచారంతో పాటు రోడ్‌ షోలను నిర్వహిస్తున్నాయి.

మిగిలింది.. వారం రోజులే!
1/1

మిగిలింది.. వారం రోజులే!

Advertisement
Advertisement