నేడు పోలీసులు, అత్యవసర ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

నేడు పోలీసులు, అత్యవసర ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

Published Mon, May 6 2024 10:25 AM

నేడు పోలీసులు, అత్యవసర ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌

కలెక్టర్‌ విజయరామరాజు

కడప సెవెన్‌రోడ్స్‌: పోలీసు పర్సనల్స్‌, అత్యవసర సర్వీసులకు చెందిన వారికి సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. అలాగే హోమ్‌ ఓటింగ్‌ సోమ, మంగళ వారాల్లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశానికి ఎస్పీ హాజరవుతారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఆయనకు తెలియజేయాలన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, శనివారం సాయంత్రం 4.00 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులతోపాటు ఎన్‌సీసీ, స్కౌట్‌ సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటివరకు 1101602 (67.2 శాతం) ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 3.61 లక్షల మందికి ఓటరు గైడ్స్‌ కూడా పంపిణీ చేశామన్నారు. ఈనెల 10వ తేదీకి ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. కోడ్‌ ఉల్లంఘనలు సంభవిస్తే సి–విజిల్‌ యాప్‌ లేదా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1950కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement