-
ఖరీఫ్‌కు సన్నాహాలు
సాక్షి, రాజమహేంద్రవరం: కొద్ది నెలలుగా దాదాపు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలతో నిప్పుల గుండంలా మారిన వాతావరణం వారం రోజులుగా కాస్త చల్లబడింది. వరుణుడి కరుణతో జిల్లావ్యాప్తంగా అడపాదడపా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రబీ వరి కోతలు సింహభాగం పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు సైతం జోరుగా జరుగుతున్నాయి. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. కాడి పట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పొలాలను సిద్ధం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే నెల 15వ తేదీలోగా వరి నారుమళ్లు వేయాలని, జూలై 15వ తేదీలోగా నాట్లు పూర్తి చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. సాగుకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా సబ్సిడీపై అందిస్తున్నారు. 83,068 హెక్టార్లలో సాగు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 83,068 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 77,817 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. 50 శాతం రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు ఖరీఫ్ సాగులో భూసారాన్ని పెంపొందించడంలో పచ్చిరొట్ట విత్తనాలు కీలక భూమిక పోషిస్తాయి. పశువుల ఎరువులకు ప్రత్యామ్నాయంగా వినియోగించే ఈ విత్తనాలను ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. 434 క్వింటాళ్ల జీలుగ, 150 క్వింటాళ్ల జనుము, 30 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను ముందస్తుగానే అందుబాటులో ఉంచింది. జీలుగ, జనుము విత్తనాల కిలో ధర రూ.88 కాగా రూ.44కు, పిల్లిపెసర కిలో రేటు రూ.134 ఉండగా రాయితీపై కేవలం రూ.67కే అందజేస్తున్నారు. 58,356 మెట్రిక్ టన్నుల ఎరువుల ఆవశ్యకత ఖరీఫ్‌లో ఆశించిన మేర దిగుబడులు రావాలంటే నాణ్యమైన ఎరువుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. నకిలీల బారిన పడి రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 58,356 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 23,096 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచారు. రైతులు తమకు అవసరమైన ఎరువులను ఆర్బీకేలు, సొసైటీలు, డీలర్ల వద్ద పొందవచ్చు. సాధ్యమైనంత వరకూ సేంద్రియ ఎరువులనే వినియోగించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. వరి విత్తనాలూ సిద్ధం ఖరీఫ్‌లో రైతులు అత్యధికంగా వరి సాగు చేపడతారు. వారికి అవసరమైన వివిధ రకాల విత్తనాలను వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉంచారు. వరి విత్తనాలు 38,908 క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీనిలో ఇందులో 400 క్వింటాళ్లు ఏపీ సీడ్స్ ద్వారా, 10 వేల క్వింటాళ్లు ప్రైవేటు సంస్థల ద్వారా, మిగిలిన వాటిని రైతు నుంచి రైతుకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో రైతులు ఎంటీయూ–7029, పీఎల్ఏ–1100, బీపీటీ–5204, ఎంటీయూ–1318 వంటి వరి రకాలు అత్యధికంగా సాగు చేస్తారు. ఎకరానికి నాలుగైదు సెంట్ల విస్తీర్ణంలో మాత్రమే నారుమడులు వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఎకరానికి 25 కేజీల విత్తనాలు సరిపోతాయి. విత్తన శుద్ధి చేసిన వాటిని మాత్రమే సాగుకు ఉపయోగించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రబీ వరి కోతలు 95 శాతం పూర్తి జిల్లా వ్యాప్తంగా రబీ వరికోతలు ఇప్పటికే 95 శాతం పైగా పూర్తయ్యాయి. మరో వారం రోజుల్లో వంద శాతం పూర్తవుతాయి. కోతలు పూర్తయిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి.. ఇప్పటికే సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. దీంతో రైతులకు ఎటువంటి నష్టమూ జరగలేదు. రబీలో జిల్లావ్యాప్తంగా 4.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఇందులో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, 2.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ప్రైవేటుగా మంచి ధర పలకడం, పొలాల నుంచే వ్యాపారులు ధాన్యం తీసుకుని వెళ్లడంతో పలువురు రైతులు వ్యాపారులకు అమ్ముకోవడానికే మొగ్గు చూపారు. జిల్లాలో వరి సాగు, కోతలు (హెక్టార్లలో) ఇలా.. మండలం వరి సాగు వరి కోతలు రాజమహేంద్రవరం రూరల్ 1,251 1,251 కడియం 2,006 2,004 రాజానగరం 3,328 3,328 అనపర్తి 3,670 3,670 బిక్కవోలు 5,597 5,597 కోరుకొండ 1,757 1,757 గోకవరం 1,537 1,537 సీతానగరం 3,280 3,265 రంగంపేట 795 795 చాగల్లు 3,317 3,317 దేవరపల్లి 2,838 2,838 గోపాలపురం 1,707 1,687 కొవ్వూరు 4,150 4,150 నిడదవోలు 6,820 6,820 పెరవలి 3,141 3,141 తాళ్లపూడి 3,375 3,347 ఉండ్రాజవరం 4,653 4,653 నల్లజర్ల 2,093 2,080 ఖరీఫ్‌కు సిద్ధంగా ఉన్నాం ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నాం. రైతులకు అవసరమైన పచ్చిరొట్ట, వరి విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో వచ్చే అవకాశం ఉంది. పంట సాగు సైతం లాభదాయకంగా మారనుంది. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. సాగుపై రైతులకు ఇప్పటికే అవగాహనకల్పిస్తున్నాం. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఫ వరుణుడి పలకరింపు ఫ రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు సంకేతాలు ఫ సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఫ అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు ఫ ఆర్బీకేల ద్వారా సబ్సిడీపై అందజేసేందుకు ఏర్పాట్లు ఫ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 83,068 హెక్టార్లు విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు ఫ ఖరీఫ్ సాగుకు విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఫ వ్యవసాయ శాఖ అధీకృత లైసెన్స్ పొందిన కంపెనీ డీలర్ల నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ఫ కొనుగోలు సమయంలో డీలరు నుంచి రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ విత్తన సంచి, ట్యాగ్‌ను పంట కాలం చివరి వరకూ భద్రంగా ఉంచుకోవాలి. ఫ పంట సాగు చేసే ముందే మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి. ఫ ఏదైనా సమస్య వస్తే మండల వ్యవసాయ అధికారికి దృష్టికి తీసుకుని వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది. ఫ మొక్కజొన్న, మిరప విత్తనాల కొనుగోలులో కూడా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. -
అన్నవరప్పాడు.. కల్యాణ కాంతులు చూడు
పెరవలి: రెండో ద్వారకా తిరుమలగా ఖ్యాతికెక్కిన అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం కల్యాణ కాంతులను అద్దుకుంటోంది. అలమేలుమంగా పద్మావతీ సమేతుడై ఇక్కడ వెలసిన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. ప్రతి రోజూ భజనలు, కోలాటాలతో పాటు సాయంత్రం వేళ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ చరిత్ర అన్నవరప్పాడుకు చెందిన ఓసూరి సోమన్న కలలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు సాక్షాత్కరించి, ఈ దివ్యస్థలిలో ఆలయం నిర్మించాలని ఆదేశించారట. తెల్లవారిన తరువాత ఆయన ఈ విషయం గ్రామ పెద్దలకు తెలియజేయడంతో అందరూ స్వామివారి ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకున్నారు. విరాళాలు సేకరించి 1965లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవదేవుడే కలలో కనిపించి, ఇక్కడ ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో సాక్షాత్తూ ఆ వేంకటేశ్వరస్వామే ఇక్కడ వెలసినట్లు భక్తులు విశ్వసిస్తారు. నాటి నుంచి నేటి వరకూ ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గతంలో అత్రి మహర్షి తపస్సు చేసిన కారణంగానే ఈ క్షేత్రానికి ఇంతటి తేజస్సు లభించిందని చెబుతారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి వందలాదిగా భక్తులు వస్తూంటారు. పెళ్లిళ్ల గుడి అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహం చేసుకున్న దంపతులు నిండు నూరేళ్లూ చీకుచింతా లేకుండా కలసిమెలసి హాయిగా జీవిస్తారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి ఏటా వివాహాలు నిర్వహించుకుంటారు. ఒక్కోసారి ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లపై కూడా వివాహాలు జరుపుతారు. ఈ వెంకన్న సన్నిధి.. పెళ్లిళ్లకు చల్లని పెన్నిధి అని విశ్వసించడంతో ఈ ఆలయానికి పెళ్లిళ్ల గుడిగా కూడా పేరు రావడం విశేషం. కల్యాణోత్సవాలు జరుగుతాయిలా.. 19: విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరుణ, దీక్షధారణ, అభిషేకం, ఎదుర్కోలు ఉత్సవం, వధూవరులుగా అమ్మవార్లు, స్వామి అలంకరణ, కల్యాణోత్సవం. 20: శ్రీలక్ష్మీయాగం. 21: సామూహిక కుంకుమార్చన 22: శ్రీలక్ష్మీతులసీ బృందార్చన. 23: చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగోత్సవం, పవళింపు సేవ. ఫ నేడు వేంకటేశ్వరస్వామి పరిణయం ఫ 23 వరకూ కల్యాణోత్సవాలు -
నో మ్యాన్ జోన్‌గా నన్నయ వర్సిటీ
రాజానగరం: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఈవీఎంలను ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాంపస్ మొత్తం పూర్తిగా సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరగనుంది. అప్పటి వరకూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూములతో పాటు వర్సిటీ ప్రాంగణమంతటా సాయుధ బలగాలతో మూడు షిఫ్టులలో పహారా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఈ ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్–సి అమలు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత ఇక్కడ గెజిటెడ్ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేసి, నిషేధాజ్ఞలు జారీ చేశారు. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే భారతీయ శిక్షా స్మృతి–1860 సెక్షన్ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్సిటీ సిబ్బందికి నో ఎంట్రీ ఎప్పటిలానే శనివారం ఉదయం విధులు నిర్వర్తించేందుకు వర్సిటీకి వచ్చిన సిబ్బందిని సాయుధ బలగాలు ప్రధాన గేటు వద్దనే నిలిపివేశాయి. తాము విధులకు వెళ్లాలని చెప్పినప్పటికీ కేంద్ర బలగాలు వినకపోవడం కొంతసేపు వివాదానికి తావిచ్చింది. విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు ఎన్నికల నిర్వహణ అధికారులను సంప్రదించారు. అనంతరం గుర్తింపు కార్డు ఉన్న వారిని లోపలకు అనుమతించారు. ఆ సమయంలో విలేకర్లు తీసిన ఫొటోలను కూడా పోలీసులు డిలీట్ చేయించారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తాము వ్యవహరిస్తున్నామని, ఫొటోలు తీయరాదని స్పష్టం చేశారు. వర్సిటీ ప్రాంగణాన్ని జిల్లా ఎన్నికల అధికారి నో మ్యాన్ జోన్‌గా ప్రకటించారని, అనుమతి లేకుండా ఏ ఒక్కరూ లోపలకు రాకూడదని చెప్పారు. వర్సిటీ అధికారులతో వీసీ అత్యవసర సమావేశం ఈ పరిణామాల నేపథ్యంలో ఉపకుపతి ఆచార్య కె.పద్మరాజు శనివారం మధ్యాహ్నం వర్సిటీ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. వర్సిటీ ప్రాంగణాన్ని నో మ్యాన్ జోన్‌గా ప్రకటించడంపై చర్చించారు. ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాల్సి ఉందని, అందువలన కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ వర్సిటీలో విద్యార్థుల బోధనతో పాటు రోజువారీ పరిపాలనా కార్యకలాపాలకు అవకాశం ఉండదనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకూ వర్సిటీ కార్యకాలపాలను తాత్కాలికంగా బంద్ చేస్తున్నామని, అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది సహకరించాలని వీసీ ఆచార్య పద్మరాజు కోరారు. భద్రతా చర్యలు పరిశీలించిన ఎస్పీ బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు భద్రపరచిన నన్నయ వర్సిటీలోని స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ఇక్కడి స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచిన నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలు, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, మొబైల్ టీములతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణమంతటా సీసీ కెమోరాల నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, డీఎస్పీలు డి.ప్రభాకర్, కె.శ్రీనివాసులు, సీఐలు సూరి అప్పారావు, కాశీ విశ్వనాథ్ తదితరులున్నారు. ఫ సాయుధ బలగాల ఆధీనంలో క్యాంపస్ ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రకటన ఫ వచ్చే నెల 6 వరకూ బోధన, పాలనా కార్యకలాపాలు బంద్ -
తెలంగాణ ఈఏపీ సెట్లో తిరుమల ప్రతిభ
రాజమహేంద్రవరం రూరల్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తమ విద్యార్థులు సత్తాచాటి, అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు శనివారం తెలిపారు. తమ విద్యార్థి ఎన్.రాధాకృష్ణ స్టేట్ 2వ ర్యాంకు, ఎస్.సాకేత్రాఘవ్ 4వ ర్యాంకు, పి.శివసంపత్ నాయుడు 25వ ర్యాంకు, వీఎస్జీఎస్వీ రామకృష్ణారెడ్డి 53వ ర్యాంకు, వి.అభిశ్యామ్ 64వ ర్యాంకు, డి.ప్రభాస్ స్టేట్ 91వ ర్యాంకులు సాధించారన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను నున్న తిరుమలరావు, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
సమ్మర్లో చదివేద్దాం
సద్వినియోగం చేసుకోవాలి వేసవి సెలవుల్లో విద్యార్థులకు గ్రంథాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని అదేశాలు వచ్చాయి. ఒకొక్క కేంద్రానికి రూ.10వేల బడ్జెట్ కేటాయించారు. గత ఏడాది విజయవంతంగా నిర్వహించాం. విద్యార్థులు అధికంగా సెల్ఫోన్లకే సమయం కేటాయించి చిన్న వయస్సులోనే కళ్లజోళ్లతో కనిపిస్తున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు గ్రంథాలయాలకు వచ్చేలా తల్లిదండ్రులు ప్రొత్సహించాలి. విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి నిత్యం శిక్షణకు వచ్చేలా చూడాలని సిబ్బందిని అదేశించాం. ఆసక్తి గల ఉపాధ్యాయులు, చిత్రలేఖనం, వృత్తి శిక్షణ చేసిన వారు గ్రంథాలయాల్లో విద్యార్థులకు సమయం కేటాయించేందుకు ముందుకు రావాలి. ఉమ్మడి జిల్లాకు దాదాపు రూ.12 లక్షలు నిధులు కేటాయించారు. –వి.ఎల్.ఎన్.ఎస్.వీ ప్రసాద్ , జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేసవి సెలవుల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, 2021లో రెండేళ్లపాటు రద్దు చేశారు. 2022వ సంవత్సరం నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి గత నెల 29వ తేదీ నుంచి నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే పెరిగిన ఉష్టోగ్రతలు, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల సమయం వృథా కాకుండా వారిలో పఠనాశక్తిని కలిగించడం, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకునేలా ప్రొత్సహించడం లక్ష్యాలుగా వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు జిల్లా గ్రంథాలయ సంస్థ సమాయత్తమైంది. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులను అకట్టుకునేలా వివిధ అంశాలపై 40 రోజులు శిక్షణ ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జూన్ 7వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించనున్నారు. సమీప గ్రంథాలయాలకు వెళ్లి సంప్రదించాల్సి ఉంటుంది. వివిధ సంస్థలకు చెందిన నిపుణులు తరగతులు నిర్వహిస్తారు. రెండు విభాగాల్లో నిర్వహణ పఠనం, సరదా అనే రెండు విభాగాల్లో శిక్షణ ఉంటుంది. పుస్తక పఠనం, కథలు చెప్పించడం, ప్రముఖులతో అవగాహన సదస్సులు, ఆటలపై ఆసక్తి ఉన్నవారికి చెస్, క్యారమ్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. విజేతల పుస్తకాలతో పాటు కవులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలు, వివిధ దినపత్రికలు, చిన్నారులకు ఉపయోగపడే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేశారు. నృత్యం, పప్పెట్ల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. సేవలకు అవకాశం పేద విద్యార్థులకు స్వచ్ఛంద సేవ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. స్పోకెన్ ఇంగ్లిష్, చెస్, డ్రాయింగ్, తెలుగులో మంచి ప్రతిభ ఉన్నవారు ఈ గ్రంథాలయాల ద్వారా స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు గ్రంథాలయ సంస్థ అవకాశం కల్పిస్తోంది. వేసవిలో ఇలాంటి సేవ ద్వారా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ఆస్కారం ఉంటుంది. జిల్లాలో ఇలా.. జిల్లా కేంద్ర గ్రంథాలయం 01, ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 05, ద్వితీయ శ్రేణి 10, తృతీయ శ్రేణి 86, పుస్తక నిక్షిప్త కేంద్రాలు 165. వేసవి విజ్ఙాన శిబిరాలకు గ్రంథాలయాలు సిద్ధం జూన్ 7 వరకూ నిర్వహణ సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు -
రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి
నిడదవోలు రూరల్: మండలంలోని విజ్జేశ్వరం వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని తలకు తీవ్రగాయాలై ఒక వ్యక్తి మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై రమేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం విజ్జేశ్వరం గ్రామానికి చెందిన కోడూరి లక్ష్మణరావు(57) ఈ నెల 16వ తేదీ రాత్రి మోపెడ్‌పై కిరాణా సరుకులు తీసుకుని నిడదవోలు నుంచి ఇంటికి వెళుతుండగా విజ్జేశ్వరం అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్రగాయాలైన లక్ష్మణరావు ఘటనా స్థలంలో మృతిచెందినట్లు కొడుకు సాయిసూర్యనారాయణ శాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అదృశ్యం కేసు నమోదు సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన 50 ఏళ్ల ముమ్మని సూర్యప్రసాద్ కనిపించడం లేదని ఆయన భార్య ముమ్మని పోశిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై టి.రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యప్రసాద్ ఈ నెల 16వ తేదీ తెల్లవారుజామున తన జిరాక్స్, కూల్‌డ్రింక్ షాపునకు ఇంటి నుంచి వెళ్లారు. సూర్యప్రసాద్ తండ్రి కోడలు పోశిలక్ష్మి వద్దకు వచ్చి తన కుమారుడు ‘నాకు కష్టాలు ఉన్నాయి, వెళ్లిపోతున్నాను’ అని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినట్టు అతని స్నేహితులు చెప్పారని, షాపు వద్దకు వెళ్లగా మూసి ఉందని తెలిపారు. బంధువులు చుట్టుపక్కల గాలించినా కనిపించలేదు. దాంతో భార్య పోశిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామకృష్ణ తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి అనపర్తి: మండలంలోని కుతకులూరు కోటేశ్వరస్వామి కాలనీకి చెందిన మహిళ శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మేడవరపు రామతారకం (55) ఇంటిలో చెత్తను పారసేందుకు గాను నివాసానికి సమీపంలో ఉన్న నాగుల పుట్ట వెనుకకు వెళ్లారు. ఈ సమయంలో చెత్తను బయట పారవేసిన ఆమె అక్కడ ఉన్న ఇనుప కంచెను చేతితో తాకారు. అయితే ఇనుప కంచెకు విద్యుత్తు ప్రవహిస్తుండటంతో విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందారు. చెక్‌పోస్టు తొలగింపు కడియం: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పొట్టిలంక వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తొలగించినట్టు కడియం ఇన్స్పెక్టర్ బి.తులసీధర్ తెలిపారు. ఆయన శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ చెక్‌పోస్టులో వాహన తనిఖీల్లో భాగంగా రూ. 3.25 కోట్ల విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదును సిబ్బంది స్వాధీనం చేసుకున్నారన్నారు. -
మెరికలకు మెరుగులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా క్రీడల వైపు వారి దృష్టిని మళ్లిస్తే అటు ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు, ఇటు వారిలోని ప్రతిభను వెలికితీయవచ్చు. పిల్లల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీయడం కోసం కాకినాడ నగరంలోని గుడారిగుంట మదర్ థెరిస్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖో–ఖో వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఏటా నిర్వహిస్తున్నారు. క్రికెట్ మోజులో పడిన యువకులు గ్రామీణ క్రీడల్లో ఒకటైన ఖోఖోను ఒక దశలో మరచిపోయారు. పల్లె క్రీడ ఖోఖో ఉనికి కోల్పోతున్న దశలో కాకినాడకు చెందిన ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు, ఖో–ఖో క్రీడాకారుడు శ్రీనివాసు ఖోఖో క్లబ్‌ను ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ అందిస్తూ వందల సంఖ్యలో క్రీడాకారులను తయారు చేసి ఈ క్రీడకు ఆదరణ పెంచుతున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన ఖోఖో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించి పలువురు పోలీస్ శాఖలోను, ప్రభుత్వ పాఠశాల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా కాకినాడలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల్లో ఇప్పటి వరకు దాదాపు 500 మంది ఇక్కడ తర్ఫీదు పొందారు. 10వ తేదీ వరకు నిర్వహణ కోచ్ శ్రీనివాస్, అసిస్టెంట్ కోచ్ హరి ఆధ్వర్యంలో ఈ శిబిరం సాగుతోంది. 25 మంది బాలికలు, 25 మంది బాలురు ఈ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7.30 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో శిక్షణ ఇస్తున్నారు. ఫిట్నెస్, ఖోఖో టెక్నిక్స్‌తో పాటు వీరికి ఆటలోని మెళుకులు నేర్పిస్తున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ఉచితంగా దాతల సహకారంతో ప్రతీ రోజు ఉదయం ఉడకబెట్టిన గుడ్డు, మొలకెత్తిన గింజలు, రాగి జావ అందిస్తున్నారు. పిల్లల పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని వారిలో ఖో–ఖో పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. జూన్ నెల 10 వరకు ఈ శిక్షణ శిబిరం కొనగసాగుతుంది. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిబిరానికి హాజరుకావచ్చు. గుడారిగుంట ప్రభుత్వ పాఠశాలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను తయారు చేయడం కోసం నైపుణ్యం కలిగినవారిని గుర్తించి చక్కటి క్రీడాకారులుగా తయారు చేయడం కోసం ఏటా వేసవి ఉచిత ఖోఖో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది బాలుర క్యాంప్ రాజమహేంద్రవరంలోను, బాలికల క్యాంప్ కాకినాడ గుడారిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలో నిర్వహిస్తున్నాం. ఆసక్తి గలవారు 98487 08008 నంబర్లో సంప్రదించి శిక్షణలో చేరవచ్చు. – శ్రీనివాసు, పీడీ, ఖోఖో కోచ్, కాకినాడ ఖోఖోలో రాణిస్తున్న యువత కాకినాడలో 20 ఏళ్లుగా వేసవి శిక్షణ శిబిరాలు పలువురు క్రీడాకారులు విద్య, ఉద్యోగాలకు ఎంపిక జాతీయ, రాష్ట్ర స్థాయిలో పతకాలు కై వసం ఇండియాకు ఆడడమే లక్ష్యం నాపేరు డి.నందిని. నేను మదర్ థెరిసా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు 3 నేషనల్స్, 6 స్టేట్ లెవెల్ పోటీలలో పాల్గొన్నాను. ఇండియాకు ఎంపికై జాతీయస్థాయి జట్టులో ఆడాలనేది నా లక్ష్యం. కోచ్ శ్రీనివాస్ వద్ద రెండు సంవత్సరాలుగా ఖో–ఖోలో శిక్షణ పొందుతున్నాను. శిక్షణ బాగుంది నా పేరు జె.హేమదుర్గ. నేను నెహ్రూ ఎయిడెడ్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. తండ్రి నాగబాబు, తల్లి వీరగనిక కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఖో–ఖోలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా లక్ష్యం. ఖో–ఖోలో ఈ ఏడాది వేసవి శిక్షణ శిబిరంలో చేరాను. ఇక్కడ శిక్షణ బాగుంది. ఆర్మీలో ఉద్యోగం సాధిస్తా నా పేరు జె.విజయ చంద్రశేఖర్. నేను గుడారిగుంట మదర్ థెరిస్సా ప్రభుత్వ ఉన్నత పాఠశాలో 8 తరగతి చదువుతున్నాను. ఖో–ఖో ఆడడం ఇదే మొదటిసారి. క్రీడాకోటాలో ఆర్మీలో ఉద్యోగం సాధించాలని ఖో–ఖో నేర్చుకుంటున్నాను. -
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్‌పై శిక్షణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఏపీ కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు క్రియేటివ్ ఈ కంటెంట్ జనరేషన్ విధానంపై ఇస్తున్న శిక్షణ రెండో రోజు శుక్రవారం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో నిష్ణాతుల నుంచి నేర్చుకున్న అంశాలను అధ్యాపకులు వారి సబ్జెక్టులలో ఈ కంటెంట్లను తయారు చేయడానికి ఉపయోగించి, దూరవిద్య ద్వారా చదువు కొనసాగిస్తున్న విద్యార్థులతో పాటు కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి నాణ్యమైన విద్యను చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తమ కళాశాల పాలుపంచుకోవడం తమకెంతో ఆనందాన్నిస్తోందన్నారు. హైదరాబాద్ ఎడ్ జోన్ ఇంటర్నేషనల్‌కు చెందిన డాక్టర్ రామ్‌కుమార్ కృత్రిమ మేధస్సుకు (ఏఐ)కు సంబంధించిన అనేక అంశాలను వివరించి, వాటిని ఈ కంటెంట్ జనరేషన్లో ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారన్నారు. డాక్టర్ హరినాథ్ శర్మ కృత్రిమ మేధస్సును ఉపయోగించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలాగా, ఆకర్షణీయంగా పాఠ్యాంశాలను ఎలా రూపొందించాలో వివరించారన్నారు. యూనిస్కిల్స్ ఇండియాకు చెందిన ప్రొఫెసర్ ప్రవీణ్‌కుమార్‌శర్మ పాడ్ కాస్టింగ్, ఆడియో ఎడిటింగ్‌పై అధ్యాపకులకు అవగాహన కల్పించారన్నారు. కార్యక్రమానికి బి.వెంకట్రావు, సమన్వయకర్తగా విజయవాడ ఏపీసీసీఈకు చెందిన డాక్టర్ జె.జ్యోతి కన్వీనర్‌గా వ్యవహరించారన్నారు. శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాల నుంచి 86 మంది అధ్యాపకులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలోఎన్.శ్రీనివాస్, సంజీవ్ కుమార్, దేవరాజ్, కిరణ్ కుమార్, ప్రవీణ్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆలమూరు: మండలంలోని మూలస్థానం అగ్రహారం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బర్రే నాగరాజు (21) మృతి చెందాడు. ఆలమూరు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ కథనం ప్రకారం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన నాగరాజు తన ద్విచక్ర వాహనంపై సోదరుడి అత్తవారి నివాసమైన స్థానిక ఇందిరాకాలనీకి బయలుదేరాడు. ఆ క్రమంలో స్థానిక డివైడర్‌ను దాటి ఇందిరాకాలనీ రోడ్డులోకి వెళుతుండగా రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి నాగరాజును ఢీకొంది. నాగరాజుతో సహ ద్విచక్ర వాహనాన్ని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిపోయి రక్షణ తీగలను తాకి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తలకు బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్, హైవే సిబ్బంది కలిసి సత్వరమే ప్రమాద స్థలికి చేరుకుని అప్పటికే నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై శ్రీను నాయక్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు పెళ్లీడుకు వచ్చిన నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదంలో తన సోదరుడు మృతి చెందాడనే వార్త తెలియడంతో స్థానిక ఇందిరాకాలనీలో నివాసం ఉంటున్న మృతుని బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. -
భూతదయకు ప్రా‘ధాన్యం’
తమ ఇంటికి ధాన్యం వచ్చే సమయంలో రైతులు వాటితో కుచ్చులను ప్రత్యేకంగా తయారు చేసి ఇంటి ముంగిట, హాల్లోను కడుతుంటారు. ఆ ధాన్యపు కుచ్చులలో ఉన్న గింజలను రామచిలుకలు, పిచ్చుకలు వచ్చి తింటూ ఉంటాయి. రైతుల భూతదయను చాటే ఈ దృశ్యాలు పల్లెల్లో సహజంగా కనిపిస్తాయి. నేడు పట్టణాల్లోనూ ఇవి దర్శనమిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజానగరం మండలం సంపత్‌నగరం గ్రామానికి చెందిన రైతు యాళ్ల రుద్రం ధాన్యపు కుచ్చులను ప్రత్యేకంగా అల్లి బొమ్మూరు జంక్షన్లో విక్రయిస్తున్నాడు. కుచ్చు సైజును బట్టి రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నాడు. ముచ్చట గొల్పుతున్న ఈ ధాన్యపు కుచ్చులను అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొందరు కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. రైతు యాళ్ల రుద్రం మాట్లాడుతూ ఈ ధాన్యపు కుచ్చులను 20రోజులుగా విక్రయిస్తున్నానని తెలిపాడు. – రాజమహేంద్రవరం రూరల్ -
వ్యక్తి దుర్మరణం
మండపేట: ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలి కాగా ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం మండపేటలో చోటు చేసుకుంది. పట్టణ ఎస్సై హరికోటి శాస్త్రి తెలిపిన వివరాల మేరకు.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన దాసరి శ్రీను(36) తన కుమార్తెను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని మండపేట వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామం పయనమయ్యాడు. పెద్ద కాలువ దాటిన తరువాత వీరభద్రపురం వచ్చే సరికి మాచవరం నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఆటో అతివేగంతో మోటారు సైకిల్‌ను ఢీ కొట్టింది. దీంతో మోటారు సైక్లిస్టు శ్రీను తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కుమార్తెకు కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అంబులెన్సు సాయంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టౌన్ సీఐ షేక్ అఖిల్‌జమ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
గొల్లప్రోలు: మండలంలోని వన్నెపూడి జంక్షన్ వద్ధ జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన చెప్పుల నానిబాబు(33) మోటారు సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా వన్నెపూడి జంక్షన్ వద్ద వెనక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రగాయాలు కాగా కాకినాడ ప్రభత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నానిబాబు మృతి చెందాడు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అబ్బుర పర్చిన డాగ్ షో
పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో సాగుతున్న ఎన్సీసీ శిబిరంలో శుక్రవారం నిర్వహించిన డాగ్ షో క్యాడెట్లను అబ్బురపర్చింది. ఆంధ్ర, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ ఐడిఎస్ఎస్సీ 2024కు ఎంపికై న క్యాడెట్ల శిక్షణ శిబిరంలో కాకినాడ ఏఆర్ డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో నేరాల తరువాత నిందితులను గుర్తించే తీరుపై అవగాహన కల్పిస్తూ డాగ్ షో నిర్వహించారు. కాకినాడ 18వ ఆంధ్రా బెటాలియన్ కమాండెంట్ కల్నల్ వివేక్ సావన్ గౌడర్ మాట్లాడుతూ ఎన్‌సీసీతో ప్రతీ విద్యార్థికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం డాగ్ షోలో భాగంగా డాగ్ స్క్వాడ్‌కు చెందిన లైకా, ప్రాక్సి శిక్షణ పొందిన పోలీస్ శునకాలు పేలుడు పదార్థాలను గుర్తించడం, చెమట వాసన ద్వారా నిందితులను గుర్తించడం, దేశ చిత్రపటాలను గుర్తించడం, అగ్ని వలయాలు దూకడం, సెల్యూట్ చెయ్యడం వంటి వాటిని సునాయసంగా ప్రదర్శించి క్యాడెట్లను అబ్బురపర్చాయి. ఈ కార్యక్రమంలో ఏఆర్ డాగ్ స్క్వాడ్ జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, ఏఎస్పీ సత్యనాణ, ఆర్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ వర్మతో పాటు ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లు పాల్గొన్నారు. ఆసక్తిగా తిలకించిన ఎన్సీసీ క్యాడెట్లు -
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ అభివృద్ధికి న్యూయోమ్ టెక్నాలజీస్ సంస్థ సహకారం అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమని వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. బెంగళూరులోని ఆ సంస్థ సీఈఓ కమ్ ఎండీ డాక్టర్ వంగల రజనీకాంత్‌తో యూనివర్సిటీ అధికారులు ఈసీ హాలులో శుక్రవారం సమావేశమై ప్రస్తుతం కల్పించవలసిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. విద్యార్థుల అభభ్యసన, వ్యవస్థాపకత, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణలో ఆవిష్కరణల కోసం ఆ సంస్థతో కలిసి పని చేయనున్నామని వీసీ తెలిపారు. డాక్టర్ వంగల గోదావరి జిల్లాల వాసీ కావడంతో ప్రాంతీయ అభిమానంతో ఈ విధంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రిజిస్టార్ ఆచార్య జి. సుధాకర్, ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కిడ్నాప్ కేసులో కారు స్వాధీనం మలికిపురం: ఈ నెల 13వ తేదీ సాయంత్రం కిడ్నాప్‌కు గురయిన రేకపల్లి నాగరాజు కేసులో కేశనపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడి కారును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. -
No Headline
రాయవరం: సమాజంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవనాన్ని సాగిస్తున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. వీటిలో ముఖ్యంగా హైపర్‌టెన్షన్ అత్యంత ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు (బీపీ) బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గుండె, మెదడు, నరాలు, కిడ్నీపై బీపీ దుష్ప్రభావాన్ని చూపుతోంది. ఒక్కోసారి పక్షవాతం, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యాలతో ప్రాణాలకు హాని చేస్తోంది. చాలా మందికి బీపీ ఉందన్న విషయాన్ని గమనించే లోపు ఆ వ్యాధి వలన కలిగే అనర్థాలతో శరీరంలోని పలు అవయవాలు దెబ్బ తింటున్నాయి. శుక్రవారం ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... సైలెంట్ కిల్లర్ శరీరంలో అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడితో (ప్రెజర్) రక్తాన్ని పంపిస్తుంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింప చేసే శక్తినే బ్లడ్ ప్రెజర్‌గా పేర్కొంటారు. ఒక వ్యక్తి గుండె సాధారణ స్థితిలో బీపీ 120/80గా పేర్కొంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే పరిగణించాలని సూచించింది. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తారు. చాలామందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్టు కూడా తెలియక ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి పోతారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి బీపీ చెక్ చేయించుకోవాలి. నేటి ఆధునిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో హైపర్ టెన్షన్ ప్రధాన సమస్యగా మారింది. హైపర్ టెన్షన్లో అసాధారణ రీతిలో 160/100, 170/110, 200/120 చూపుతుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి మెదడు, గుండెలోనూ నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదముంటుంది. కరోనా అనంతరం మనిషి జీవన స్థితిగతులు మరింత జటిలం అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా అనంతరం యువతలో సైతం హైపర్ టెన్షన్ ప్రభావం అధికంగా ఉందనే అభిప్రాయం ఉంది. ఇటీవల 20–30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు సాధారణంగా అధిక రక్తపోటు వయసు మళ్లిన వారికి వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పనిచేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపోథెరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ద్వారా బీపీ వస్తుంది. 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్‌ల వద్దకు చికిత్స కోసం వెళ్లేవారిలో అధిక శాతం మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారు. వీరి వద్దకు చికిత్సకు వెళ్తున్న వారిలో 20 నుంచి 30 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు ఉంటున్నారన్నది ఒక అంచనా. ప్రభుత్వం ఎన్సీడీ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేయించి బీపీ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తోంది. జిల్లాలో 14,85,148 మందిని స్క్రీనింగ్ చేయగా, వారిలో 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్టు ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించారు. 1,07,053 మంది డయాబెటీస్ పేషెంట్స్, 70,491 మంది హైపర్ టెన్షన్, సుగర్ వ్యాధిని కలిగి ఉన్న వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. ఉచితంగా ప్రభుత్వ సేవలు గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లోనే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించి ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, మందులు కూడా అందజేస్తోంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు హైపర్ టెన్షన్‌తో బాధపడే రోగులు ముఖ్యం గా ఆహార పదార్థాల్లో ఉప్పును తక్కువగా వినియోగించాలి. మసాలాలు, నిల్వ పచ్చళ్లు, కారం తగ్గించాలి. ప్రతి రోజూ గంటపాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ లక్షణాలు మెడ నరాల లాగేస్తున్నట్టు ఉండడం. కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచుగా తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం. యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిర్లుగా ఉండడం. అధిక రక్తపోటుతో అనర్థాలు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమే నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే -
తీపర్రు ఇసుక ర్యాంపుపై అధికారుల దాడి
పెరవలి: తీపర్రు ఇసుక ర్యాంపుపై విజిలెన్స్, మైనింగ్ అధికారులు గురువారం ఉదయం 10.30 గంటలకు దాడి చేశారు. మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యాన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఇన్స్పెక్టర్ టి.గోపాలకృష్ణ, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రాత్రి 10 గంటల వరకూ తనిఖీలు చేశారు. వారిని చూసి నిర్వాహకులు, సిబ్బంది పరారయ్యారు. రెండు పొక్లెయిన్లు, రెండు లారీలు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశామని ఏడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. తీపర్రు ఇసుక ర్యాంపులో ఇసుక తవ్వకాలకు 2025 వరకూ అనుమతులు ఉన్నాయని, ఇక్కడ 48 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకూ ఎంత మేర తవ్వకాలు జరిపారో లెక్కలు వేయాలన్నారు. దాడులపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ర్యాంపు తమ సొంత స్థలమని, ఇక్కడ తమ లారీలు ఎప్పుడూ ఉంటాయని, వాటిని ఎలా స్వాధీనం చేసుకుంటారని వాటి యజమానులు ప్రశ్నించారు. ర్యాంపులో లారీలు ఉన్నందున కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు చెప్పారు. -
వరదలపై సన్నద్ధంగా ఉండాలి
● గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ సతీష్ కుమార్ ● ఇరిగేషన్ అధికారులతో సమీక్ష ధవళేశ్వరం: వరదల సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా వీటిని ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని గోదావరి డెల్టా సిస్టమ్ సీఈ ఆర్.సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి వరదల సీజన్ సమీపిస్తున్నందున ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్మినెంట్, సెంట్రల్, టెంపరరీ ఫ్లడ్ స్టోర్స్‌లో వరద సామగ్రిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రమాద స్థాయిలో వరదలు వచ్చే సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు తదితరల శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సమష్టి కృషితో వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరదల సమయంలో ధవళేశ్వరంలో ఏర్పాటు చేసే ఫ్లడ్ కంట్రోల్ రూముకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని సతీష్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈలు ఆర్.కాశీ విశ్వేశ్వరరావు, కె.రామకృష్ణ, ఎ.శ్రీనివాసరావు, డీఈలు యు.రమేష్, వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, కె.సుబ్బారావు, ఏఈలు అద్దంకి సాయిరామ్, ప్రసాద్, రాధాకృష్ణ, విశ్వనాథరాజు, సుబ్బారావు, నాగలక్ష్మి, సునీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏలేరులో అడుగంటిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: వేసవి ధాటికి ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమేపీ అడుగంటుతున్నాయి. దీంతో దిగువ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున రోజురోజుకూ నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 68.95 మీటర్లు, 24,11 టీఎంసీలకు గాను 3.81 టీఎంసీల నీటి నిల్వలున్నాయి. ఈ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 54 వేల ఎకరాలకు రాబోయే రోజుల్లో సాగు నీరందని పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. దీంతో పాటు దిగువ ఏలేరు కాలువలో నీటి సరాఫరా నిలిపివేయడంతో పశువులు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పశువులతో పాటు, సమీప గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రాజెక్టులో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయినా, విశాఖపట్నానికి నీటిని తరలించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులో నీటిని మోటార్ల సాయంతో పది పైపుల ద్వారా విశాఖ పట్నానికి 140 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఖరీఫ్‌పై అనుమానాలు ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో పాటు, వరిసాగు పూర్తి కావడంతో ఏలేరు కాలువకు నీటి సరాఫరా నిలిపివేశారు. ప్రస్తుత నీటినిల్వల నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖరీఫ్ సాగుపై ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిని బట్టే ఆయకట్టులో సాగు ఆధారపడి ఉంటుంది. అలాంటిది నీటి నిల్వల తగ్గుదలతో రైతులు నిరాశ చెందుతున్నారు. -
ఉచిత నిర్బంధ విద్య పిల్లల హక్కు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉచిత నిర్బంధ విద్య పొందడం ఆరేళ్ల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లల హక్కు అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్‌బాబు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నివారణపై కార్మిక శాఖ, ఇతర సమన్వయ శాఖల సహకారంతో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చిన్న పిల్లలను కార్మికులుగా మార్చడం చట్టరీత్యా నేరమని, ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పిల్లల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు, వ్యవస్థలు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలందరికీ మంచి విద్య, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులను కల్పించడం మనందరి అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొన్ని బృందాలను ఏర్పరచి పట్టణంలోని పలు ప్రాంతాలలో తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని, ఈ తనిఖీలకు సంబంధించిన నివేదికను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. ఐసీడీఎస్ పీడీ కే.విజయ కుమారి, డీఈవో కె.వాసుదేవరావు, అర్బన్ డీఐ బి.దిలీప్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ పి.సూర్యప్రభావతి, కార్మిక శాఖ అధికారులు, డీసీఆర్బీ సిబ్బంది, ఎన్జీవో సభ్యులు పాల్గొన్నారు. -
ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు రెండేళ్ల జైలు
ధవళేశ్వరం: ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు రెండ్లేలళ్ల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ రాజమహేంద్రవరం 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డి విజయ్ గౌతమ్ తీర్పు ఇచ్చారు. సౌత్ జోన్ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్ 11వ తేదీ రాత్రి సుమారు 15 ఏళ్ల బాలుడు వెళుతుండగా ధవళేశ్వరం కంచర్లలైన్ వద్ద అప్పలబత్తుల కృష్ణవంశీ, కూరపాటి సతీష్, ఉమ్మాడి సాయిగణేష్ దాడి చేశారు. బాలుడి వద్ద ఉన్న అతడి తాతయ్యకు చెందిన మోటారు సైకిల్‌తో ధవళేశ్వరం ప్రభుత్వాస్పత్రి సమీపానికి తీసుకువెళ్లారు. అనంతరం బాలుడి వద్ద ఉన్న రూ.100, వాచీని బలవంతంగా లాక్కుని గాయపరిచారు. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇంటికి చేరిన బాలుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై అప్పటి సీఐ కె.మంగాదేవి కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెద్దిరెడ్డి శంభూ ప్రసాద్ వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో ముగ్గురికి పైవిధంగా శిక్ష విధించారు. కాగా.. కేసును పురోగతి సాధించేందుకు కృషి చేసిన అప్పటి సీఐ కె.మంగాదేవి, డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, ప్రస్తుత సీఐ జీవీ వినయ్ మోహన్, ఏఎస్సై జి.వెంకటేశ్వర్లును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. -
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
కాకినాడ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులకు మొదటి జాబితా సీట్లను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించామని జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు. మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ద్రాక్షారామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలురకు, కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం బాలికలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. ఆయా విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే సమాచారం అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఇతర సమాచారం కోసం జి.దేవి 63040,97747, వి.ప్రసాద్‌బాబు 94404 99016 నంబర్లను సంప్రదించాలన్నారు. -
డీవీఈవో సుబ్రహ్మణ్యం సస్పెన్షన్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవీఈవో) జేవీఎస్ సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ వివరాలను ఇంటర్‌బోర్డు అధికారులు బుధవారం వెల్లడించారు. ధవళేశ్వరం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జేవీఎస్ సుబ్రహ్మణ్యంపై వేధింపుల ఆరోణలు వచ్చాయి. కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకురాలిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో ఆమె నెల రోజుల క్రితం ఆత్మహత్య యత్నం చేశారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కాంట్రాక్టు అధ్యాపకులను, మహిళా అధ్యాపకులను తీవ్రంగా వేధిస్తారని సుబ్రమణ్యంపై పలు ఆరోపణలు ఉన్నాయి. -
17, 18 తేదీల్లో గైట్‌లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
రాజానగరం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను ఈనెల 17, 18 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
No Headline
పథకాలే చోదక శక్తి? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టి నవరత్నాలు పథకాల వల్ల సింహభాగం కుటుంబాలు లబ్ధి పొందాయి. చాలా కుటుంబాలు ఐదేళ్లలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు లబ్ధి పొందాయి. సంక్షేమ ఫలాలన్నీ మహిళల పేరు మీదే అందించడం, నేరుగా వారి అకౌంట్లలోనే నగదు జమ చేస్తుండటం వల్ల ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడినట్లు తెలిసింది. అమ్మ ఒడి, ఆసరా, సున్నావడ్డీ రుణాలు, ఇంటి పట్టాలు, విద్యా దీవెన, వసతి దీవెన, కాపునేస్తం. భరోసా తదితర పథకాలకు సంబంధించి మహిళల అకౌంట్లలోనే నేరుగా నగదు జమ చేస్తున్నారు. ఎలాంటి లాంచాలకు తావులేకుండా పారదర్శకంగా అమలవుతుండటం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నమ్మకం సన్నగిల్లడం, పథకాలు ప్రకటించినా అధికారంలోకి వచ్చాక అమలు చేయరన్న అపనమ్మకంతో ఫ్యాన్‌కు మద్దతు పలికారు. జగన్ ఓడిపోతే ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయన్న ఆందోళన నెలకొంది. పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్ సీపీకే మద్దతు పలకాలన్న భావనతో గంపగుత్తగా తరలివచ్చి సీఎం జగన్‌కు మద్దతు ప్రకటించారన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
No Headline
● వైఎస్సార్ సీపీ గెలుపునకు సోపానాలు కానున్న సంక్షేమ పథకాలు ● లబ్ధి పొందిన మహిళలే పార్టీ గెలుపులో కీలకం అంటున్న విశ్లేషకులు ● అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం పథకాల్లో లబ్ధి ● పురుషుల కంటే అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్న వైనం ● ఓటు వేసిన 6.66 లక్షల మహిళలు, 6.47 లక్షల పురుషులు సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఓటరు జాబితాలోనే కాదు.. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల గెలుపును నిర్ణయించే శక్తిగా అవతరించారా? ఇందుకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో అత్యధిక శాతం మంది పాల్గొనడం నిదర్శనంగా నిలుస్తోందా? అతివల ఆశీస్సులు ఉన్నవారే అధికార పీఠం కై వసం చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఈ పరిణామం వైఎస్సార్ సీపీకి అనుకూలతను చేకూరుస్తుందన్న భావన వెల్లడవుతోంది. ‘తూర్పు’లో ఓటెత్తిన మహిళలు సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా మహిళలు ఓటెత్తారు. ఏడు నియోజకవర్గాల పరిధిలోనూ వారి ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రతి నియోజకవర్గంలోనూ పురుష ఓటర్ల కంటే మహిళలే అగ్రస్థానంలో నిలిచారు. ఇందుకు ఎన్నికల అధికారులు వెల్లడించిన గణాంకాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఉదయం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, పింఛనుదారులు ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. ఈ పరిణామం ఓటింగ్ పెంపునకు ఎంతగానో దోహద పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా 16,23,149 మంది ఓటర్లున్నారు. అందులో మహిళలు అత్యధికంగా 8,30,735 మంది ఉండగా.. పురుషులు 7,92,317 మంది ఉన్నారు. ఇతరులు 97 మంది. ఓటర్ల జాబితాలోనూ మొదటి స్థానంలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగంలోనూ పైచేయి సాధించారు. ఎన్నికల్లో పురుషులు 6,47,474 మంది ఓటేయగా.. వారి కంటే ఎక్కువగా మహిళలు 6,66,113 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే ఎక్కువగా 18,639 మంది మహిళలు ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములపై మహిళల ప్రభావం అధికంగా ఉంటుందన్న చర్చ బలంగా నడుస్తోంది. మహిళలు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయం తథ్యమంటూ లెక్కలు వేస్తున్నారు. వైఎస్సార్ సీపీలో ధీమా సార్వత్రి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం పోలింగ్ శాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 66.55 శాతంగా ఉన్న పోలింగ్ అనంతరం క్రమంగా పుంజుకుంది. మహిళలు, వృద్ధులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ఇదే సమయంలో ఓటేసేందుకు రావడంతో అర్ధరాత్రి వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికలు ముగిసే సమయానికి ఏకంగా 80.93 శాతానికి చేరింది. సాయంత్రం 5 గంటల తర్వాత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఈ పరిణామం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో గుబులు రేపుతోంది. సాయంత్రం మహిళలు, వృద్ధులు అధిక శాతం ఓటేశారు. ఆయా వర్గాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీంతో తమ పరిస్థితేంటన్న మీమాంస ఆ పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. లోలోపల ఓటమి భయం వెంటాడుతున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపుతున్నట్టు సమాచారం. ప్రతి ఒక్కరిలో విస్తృత చర్చ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఏ ఇద్దరు కలిసినా పెరిగిన ఓటింగ్ శాతం, మహిళలు అత్యధికంగా పాల్గొనడంపైనే నడుస్తోంది. ఇరు పార్టీల మద్దతు దారులు పోటీ పడి ఓట్లు వేసేందుకు తరలిరావడంపై మరింత చర్చ సాగుతోంది. పథకాలతో ఆర్థిక పురోగతి సాధించిన పేద, మధ్యతరగతి వర్గాలు అధికార పార్టీ అభ్యర్థులకే మద్దతుగా నిలిచి ఓట్లేశారని జనం విశ్వసిస్తున్నారు. మహిళా ఓటింగ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.25,436 కోట్ల సంక్షేమంపేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్న తలంపుతో ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే రూ.25,436 కోట్లు వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ప్రజలకు అందించింది. అమ్మ ఒడి కింద రూ. రూ.234 కోట్లు, వసతి దీవెన రూ.65.56 కోట్లు, విద్యాదీవెన రూ.142.99 కోట్లు, సున్నా వడ్డీ రూ.145.94 కోట్లు, వైఎస్సార్ ఆసరా రూ.728.9 కోట్లు, శ్రీనిధి రూ.374.58 కోట్లు, కాపునేస్తం రూ.174.44 కోట్లు ఇలా ప్రతి పథకానికి రూ.కోట్లల్లో నిధులు వెచ్చించింది. ఫలాలు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఈ పరిణామం సైతం ఓటింగ్ శాతం పెరిగేందుకు దోహదపడిందన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. జిల్లాలో మహిళా ఓటర్ల శాతం ఇలా..నియోజకవర్గం ఎన్నికల్లో పాల్గొన్న అధికం పురుష మహిళా ఓటర్లు ఓటర్లు అనపర్తి 96,161 98,761 2,600 రాజానగరం 94,571 94,928 357 రాజమండ్రి సిటీ 87,192 93,517 6,325 రాజమండ్రి రూరల్ 97,530 1,01,673 4,143 కొవ్వూరు 77,991 80,182 2,191 నిడదవోలు 89,198 91,488 2,290 గోపాలపురం 1,04,831 1,05,564 733
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
హనీమూన్ ఎక్స్‌ప్రెస్: 'క్యూట్‌గా స్వీట్‌గా' సాంగ్ వచ్చేసింది..
విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు
ఇంటర్ కూడా ఇక్కడే..
శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం
ఇంటర్ సప్లిమెంటరీకి రెడీ
అన్నదాత కన్నీరు తుడిచేలా..
No Headline
గ్రూప్–2 మెయిన్ పరీక్షకు ఉచిత శిక్షణ
ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు
బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
Advertisement