నమ్మేదెట్టా? ఒట్టుల సీఎంను.. | Sakshi
Sakshi News home page

నమ్మేదెట్టా? ఒట్టుల సీఎంను..

Published Mon, May 6 2024 6:12 AM

KCR Fires on Congress Party

తులం బంగారం తుస్‌.. బోనస్‌ బోగస్‌

కాంగ్రెస్‌ సర్కారుకు పరిపాలన చేతకాదు 

ఆరు గ్యారంటీ హామీల అమలు ఎక్కడ? 

రైతుబంధుకు పరిమితులు, కొత్త జిల్లాల రద్దు ఆలోచన ఎందుకు? 

కరెంటు కోతలేమిటి?.. పంటలు ఎందుకు ఎండిపోయాయి? 

మోదీ గోదావరిని ఎత్తుకుపోతానంటే సీఎం రేవంత్‌ మాట్లాడరేమిటి 

ప్రధాని మోదీ పదేళ్లలో అచ్చేదిన్‌ కాదు.. సచ్చేదిన్‌ తెచ్చారు 

జగిత్యాల రోడ్‌ షోలో మాజీ సీఎం కేసీఆర్‌ ఫైర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పరిపాలన రాదని.. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. వరి ధాన్యానికి బోనస్‌ బోగస్‌ అయిందని, ఆడపిల్లలకు ఇస్తామన్న తులం బంగారం హామీ తుస్సుమన్నదని వ్యాఖ్యానించారు. 

రైతు బంధుకు పరిమితులు పెట్టడం ఏమిటని.. కొత్త జిల్లాల రద్దు ఆలోచన ఎందుకని నిలదీశారు. కాంగ్రెస్‌ సర్కారు మెడలు వంచి హామీలను అమలు చేయించాలంటే.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలని పేర్కొన్నారు. మన నదులు, మన నీళ్లు, మన నిధులు.. మనకే దక్కాలంటే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాలన్నారు. ఆదివారం సాయంత్రం జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నం. జగిత్యాలను జిల్లా చేసుకున్నం. ఈ రోజు జగిత్యాల జిల్లాను కొత్త ప్రభుత్వం తీసేస్తదట. ఉండాలా.. పోవాలా? మేం వరద కాలువను రిజర్వాయర్‌లా మార్చినం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వరద కాలువను, పంటలను ఎందుకు ఎండబెడుతోందో తెలియదు. మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని రాహుల్‌ గాంధీ అంటున్నరు. మీకు వచ్చినయా? సీఎం రేవంత్‌ చెప్పినట్టుగా రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందా? ఏ ఊరు వెళితే ఆ ఊరి దేవుడి మీద ఒట్టుపెడుతున్న సీఎంను నమ్మే పరిస్థితి ఉందా? 

రైతు బంధుకు పరిమితి ఎందుకు? 
రైతుబంధుకు బదులు రైతు భరోసా పేరిట ఇస్తానన్న కాంగ్రెస్‌ రూ.15,000 ఇచ్చిందా? అందరికీ రైతుబంధు పడిందా? అసలు రైతుబంధుకు ఐదెకరాల పరిమితి పెడతారట. ఆరు, ఏడు ఎకరాలు ఉన్న రైతులు ఏం పాపం చేశారు? 20–25 ఎకరాలు అంటే సరేగానీ.. మరీ ఐదెకరాలకే పరిమితా? వరికి రూ.500 బోనస్‌ బోగస్‌ అయింది. కల్యాణలక్షి్మ, షాదీ ముబారక్‌లతోపాటు తులం బంగారం వచ్చిందా? తుస్‌ అయ్యిందా? మేం మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చాం.

గత 9ఏళ్లు కరెంటు కోతలు లేవు. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. మా హయాంలో జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తెస్తే.. నేటి ప్రభుత్వం విధించే కరెంటు కోతలతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆపేశారు. చేనేత, గీత, బీడీ కార్మికులను పట్టించుకుంట లేరు. అన్న వస్త్రం కోసం పోతే.. ఉన్న వస్త్రం పోయిందన్నట్టు తయారైంది పరిస్థితి. 

బీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ పారీ్ట.. 
పదేళ్లలో అచ్చేదిన్‌ అన్న మోదీ ధరలు పెంచి సచ్చేదిన్‌ తెచి్చండు. జన్‌ధన్‌ ఖాతాల్లో ఎవరికైనా రూ.15 లక్షలు పడ్డయా? మోదీ హయాంలో యువత, మహిళలు, విద్యార్థులు.. ఇలా ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు. ముస్లింలకు విన్నవిస్తున్నా.. ఈ దేశం అందరిదీ.. నేడు దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. బీఆర్‌ఎస్‌ సెక్యులర్‌ పార్టీ. మీరంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. అందుకే అందరూ బీఆర్‌ఎస్‌కు ఓటేయాలి.

కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్‌ రాష్ట్రంగా ఉంటుంది..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ఎంపీలు ఎవరు గెలిచినా మోదీ ముందు మాట్లాడలేరని.. మన నిధులు, నీళ్లు, నదుల కోసం పార్లమెంట్‌లో కొట్లాడాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ మెడలు వంచి హామీలు అమలు చేయించాలన్నా బీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలవాలన్నారు.

కొండగట్టులో సమోసా తిని.. చాయ్‌ తాగి..
ఆదివారం జగిత్యాలలో రోడ్‌ షో కోసం బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్‌.. దారి మధ్యలో కొండగట్టు వద్ద ఓ హోటల్‌ వద్ద ఆగి సమోసా తిని, చాయ్‌ తాగారు. అక్కడున్న ప్రజలు, కార్యకర్తలు కేసీఆర్‌తో సెలీ్ఫలు దిగారు.   – కొండగట్టు (చొప్పదండి)  

Advertisement
Advertisement